ఇక ధనధాన్యం | Set kharif grain purchases | Sakshi
Sakshi News home page

ఇక ధనధాన్యం

Published Sat, Oct 11 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

Set kharif grain purchases

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. నవంబర్ మొదటి వారం నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. జిల్లాలోని 39 మండలాల్లో 160 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పారు. వీటిద్వారా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు..మార్గదర్శకాలను జేసీ సురేంద్రమోహన్ నిర్దేశించారు.

ఖమ్మం జెడ్పీసెంటర్: ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ దీనికి తగిన మార్గదర్శకాలను సిద్ధం చేశారు. జిల్లాలో 39 మండలాల్లో 160 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నారు. దీనిలో 70 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 90 ఇందిరా కాంతి పథం (ఐకేపీ) కేంద్రాలున్నాయి. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో మొత్తం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి.

ఈ ఏడాది ప్రభుత్వం అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. డీఆర్‌డీఏ ఐకేపీ, పీఏసీఎస్‌ల ద్వారా ఈ ఏడాది లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా అధికారులు నిర్ణయించారు. గత ఏడాది 39 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. లెవీ విధానంలో 25 శాతం మాత్రమే మిల్లర్లకు కేటాయించడంతో వారు ముందుకొచ్చే పరిస్థితి లేదు. ప్రజా పంపిణీ అవసరాల దృష్ట్యా అధికంగా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
 
మొదటి వారంలో...
నవంబర్ మొదటివారంలో ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుడతారు. వ్యవసాయశాఖ నివేదికల ఆధారంగా తొలుత భద్రాచలం డివిజన్‌లో ఖరీఫ్ ధాన్యం చేతికి వస్తుంది కాబట్టి ఈ మేరకు ప్రణాళికలు రచించారు. ఇప్పటికే పలుమార్లు ఆయా శాఖల అధికారులతో జేసీ సమీక్షలు నిర్వహించి ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నవంబర్ మొదటివారంలో చర్ల, వెంకటాపురం, సత్యనారాయణపురం, వాజేడు, టీ.కొత్తగూడెం, భద్రాచలంతో పాటు మొత్తం 15 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించనున్నారు.

పంటచేతికి వచ్చే తీరును బట్టి మిగిలిన కేంద్రాలను ప్రారంభిస్తారు. ఇప్పటికే కొనుగోలుకు కావాల్సిన యంత్రాలను సమకూర్చారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు చేర్చడానికి రెవెన్యూ డివిజన్‌కు ఒక కాంట్రాక్టర్‌ను నియమించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 60 మిల్లులకు ధాన్యం తరలించాలని నిర్ణయించారు. గతంలో మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన లెవీ ఇవ్వడంలో అనేక ఉదంతాలు చోటుచేసుకున్నాయి. మిల్లర్ల ఆర్థిక స్థితిగతులు, మిల్లు సామర్థ్యం, గడువులోగా లెవీ బియ్యం అందించే చర్యలను పరిశీలించి సర్టిఫికెట్‌లు ఇచ్చేందుకు సివిల్ సప్లయీస్ డీటీలను నియమించారు.
 
మద్దతు ధర
రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతాంగానికి పలు సూచనలూ చేసింది. గ్రామాల్లో రైతులను చైతన్యవంతం చేసేందుకు, మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు నిర్దేశించిన ప్రమాణాలను కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. తేమ లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని రైతులకు సూచిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా అధికారులకు సమాచారం అందించాలని ఫోన్ నంబర్లను సైతం కరపత్రాల్లో ముద్రించారు.
 
నిబంధనలు ఇలా...
వంగడము పొడవు, వెడల్పు నిష్పత్తుల ఆధారంగా సాధారణ రకం, గ్రేడ్ ‘ఏ’ రకంగా నిర్ణయిస్తారు.
సాధారణ రకం ధర రూ.1, 360, గ్రేడ్ ఏ రకానికి రూ.1,400లుగా నిర్ణయించారు.
ఇసుక, మట్టి, రాళ్ళు ఒక శాతం, తాలు, తుప్పరకు ఒక శాతం, చెడిపోయినవి, రంగు మారినవి, మొలకెత్తినవి, పురుగు పట్టినవి ఐదు శాతం, పాలు పోసుకోనివి, కుచించుకున్నవి, ముడుచుకున్న ధాన్యానికి మూడు శాతం, తక్కువ గ్రేడ్ -7 శాతం, తేమ -17 శాతానికి మించకుండా ఉన్నవి మాత్రమే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.
 
ఆన్‌లైన్‌లో నగదు పంపిణీ

కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటలలో నగదు చెల్లించేలా అధికారులు చర్యలు చేపడతున్నారు. ఈ మేరక ఇప్పటి కే ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్‌లో యాక్సెస్ బ్యాంకు ద్వారా నగదు చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టారు. రైతులకు ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా యాక్సెస్ బ్యాంకు ద్వారా రైతుల బ్యాంక్ అకౌంట్‌లో నగదు జమ చేస్తారు.
 
కొనుగోళ్లకు అన్ని చర్యలు చేపట్టాం: సాంబశివరావు, డీఎం సివిల్ సప్లైస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేం దుకు అన్ని ఏర్పాట్లు చేశాం. వ్యవసాయశాఖ సూచనల మేరకు నవంబర్ మొదటి వారంలో పంటచేతికి వస్తుందని భావిస్తున్నాం. దీని ప్రకా రం ఇప్పటికే జేసీ సురేంద్రమోహన్ ఆదేశాల మేర కు అన్ని శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి 25 లక్షల గన్నీ బ్యాగ్‌లు అవసరం ఉంటాయి. ఇప్పటికే 10లక్షల సంచులు వచ్చాయి. 15వ తేదీ నాటికి మిగిలినవి వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement