మాట్లాడుతున్న తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య
ఇల్లెందు: టీఆర్‌ఎస్ ప్రభుత్వం గిరిజనుల రక్షణ కోసం ఉన్న చట్టాలు, జీఓలు అమలు చేయకపోగా గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య ఆరోపించారు. బుధవారం ఇల్లెందు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుడుందెబ్బను దెబ్బతీసేందుకు మావోయిస్టు ముద్ర వేస్తున్నారన్నారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా ఎస్పీ సునిల్‌దత్ చేసిన ప్రకటన పునఃపరిశీలించుకోవాలని కోరారు. తుడుందెబ్బ సంఘం మావోయిస్టు కనుసన్నల్లో పని చేస్తున్నట్లు ప్రకటించటాన్ని తీవ్రంగా ఖండించారు. పోడు భూముల సమస్యకు పూర్వం నుంచి ఆదివాసీలు అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఆదివాసీ ఉద్యమాలకు చరిత్ర ఉందని, అల్లూరి, కొమ్రంభీ, కోలాం, మన్యం తిరుగుబాట్లు, బిర్సాముండా లాంటి పోరాటాలు జరిగాయని, నేడు ఆదివాసీలు విద్య, ఉద్యోగ రంగాల్లోనూ ఉన్నారని, చట్టాలు, జీఓలు అవపోసానం పట్టి ఆదివాసీల అభివృద్ధికి కంకణం కట్టుకుని పని చేస్తున్నట్లు తెలిపారు. 5వ షెడ్యూల్, పెసా చట్టం, జీఓ నంబర్ 3, వర్గీకణ లాంటి సమస్యల కోసం 24 ఏళ్లుగా పోరాడుతున్నామని ఆయన తెలిపారు. తుడుందెబ్బ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ మలి దశ పోరు నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగితే జల్, జంగిల్, జమీన్ కోసం నాటి నుంచి నేటి వరకు ఆదివాసీలు పోరాడుతున్నారని తెలిపారు. కేసులు, బెదిరింపుల ద్వారా ఆదివాసీ ఉద్యమం నిర్వీర్యమై పోదన్నారు. తప్పుడు కేసులు బనాయించటం, జైళ్లపాలు చేయటం, మావోయిస్టులకు అంటగట్టడం పరిపాటిగా మారిందన్నారు. భదాద్రి ఎస్‌పీ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment