బందీగా అమ్మ... ఆకలితో పసికూన | She Was Held Captive Hungry Child In Illendu | Sakshi
Sakshi News home page

బందీగా అమ్మ... ఆకలితో పసికూన

Published Sun, Jul 1 2018 12:32 PM | Last Updated on Sun, Jul 1 2018 12:32 PM

She Was Held Captive Hungry Child In Illendu - Sakshi

పోలీస్‌ స్టేషన్‌లో తన పసిబిడ్డతో కళ్యాణ్, ఆయన తల్లి సువార్త   

          మూడు నెలల పదకొండు రోజుల వయసున్న ఈ పసికూనకు మాట్లాడే శక్తే ఉంటే.. తన తల్లిని ఇలాగే వేడుకునేవాడేమో...!!!  ఆ తల్లి ఎవరు..? ఎక్కడికెళ్లింది...? పసికూనకు ఎందుకు దూరమైంది,...? వీటికి సమాధానమే ఈ కథనం... 

ఇల్లెందు : ఇదొక ప్రేమికుడి వేదన. ఇదొక ప్రియురాలి యాతన. ఇదొక పసికూన రోదన. ఇల్లెందు మండలం రొంపేడు పంచాయతీ మిట్టపల్లి తండాకు చెందిన ఆమె పేరు బి.రజిత, గార్ల మండలం ముల్కనూరుకు చెందిన అతడి పేరు బళ్లెం కళ్యాణ్‌.  వీరిద్దరూ ప్రేమించుకున్నారు. గార్ల శివాలయంలో ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు.  వీరి ప్రేమ–పెళ్లికి రజిత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వారి నుంచి తామిద్దరికీ ప్రాణ భయం ఉందంటూ గార్ల పోలీసులను ఆ ప్రేమ జంట ఆశ్రయించింది. వారిని ఇల్లెందు పోలీస్‌ స్టేషన్‌కు గార్ల పోలీసులు పంపించారు. రజిత తల్లిదండ్రులను ఇల్లెందు పోలీసులు పిలిపించారు. కౌన్సిలింగ్‌ నిర్వహించారు.

ఆ తరువాత, రజిత– కళ్యాణ్‌ జంట హైదరాబాద్‌ వెళ్లింది. అక్కడే ఉంటున్నారు.  రజిత గర్భవతయింది. ప్రసవం కోసం భర్తతో కలిసి ముల్కనూరుకు వచ్చింది. కొన్ని రోజులు గడిచాయి. రజితతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబీకులు ఫోన్‌లో మాట్లాడసాగారు. యోగ క్షేమాలు తెలుసుకోసాగారు.  మార్చి 19న పండంటి బాబుకు రజిత జన్మనిచ్చింది. బాబును, రజితను చూసేందుకు తల్లిదండ్రులు పలుమార్లు ముల్కనూరు వచ్చారు. రజిత–కళ్యాణ్‌ కుటుంబాల మధ్య సుహృద్బావ వాతావరణం ఏర్పడింది.  వారం రోజుల కిందట రజిత అస్వస్థురాలైంది. ఆమె కుటుంబీకులకు తెలిసింది. ఇల్లెందులోని ఆస్పత్రిలో వైద్యం చేయిస్తామన్నారు. కళ్యాణ్‌–రజిత దంపతులు తమ పసికూనతో ఇల్లెందు చేరుకున్నారు. ప్రైవేటు వైద్యశాలలో రజితకు ఆమె కుటుంబీకులు వైద్యం చేయించారు. 


            ఆ దంపతులు ఆ రోజు సాయంత్రం ముల్కనూరు చేరుకున్నారు. ఇంటికి రావాలంటూ రెండు రోజుల కిందట రజిత కుటుంబీకుల నుంచి పిలుపొచ్చింది. బాబును తీసుకుని కళ్యాణ్‌–రజిత ఇల్లెందు వచ్చారు. ఆమెను మిట్టపల్లిలోని పుట్టింటికి పంపించాడు. ఆ పసికూనకు ఆరోగ్యం బాగోలేదు. సాయంత్రానికి రావాలని, అప్పటివరకు బాబును తన వద్దనే ఉంచుకుంటానని అన్నాడు. ఆమె సరేనంది. తన పుట్టింటికి వెళ్లింది.  సాయంత్రం వరకు కళ్యాణ్‌తో రజిత ఫోన్‌లో మాట్లాడింది. మరో గంటలో బయల్దేరుతానని చెప్పింది.  సాయంత్రమైంది. ఆమె రాలేదు. బాబు ఏడుస్తున్నాడు. రజితకు ఫోన్‌ చేశాడు. ఆమె కుటుంబీకులు మాట్లాడారు.

‘‘రజిత రాదు. నీ దిక్కున్న చోట చెప్పుకోపో...’’ – అటు నుంచి వచ్చిన సమాధానమిది. ఈ హఠాత్పరిణామంతో కళ్యాణ్‌కు నోట మాట రాలేదు.  శనివారం సాయంత్రమైంది. ఆ పసికూనకు ఒకటిన్నర రోజుపాటు తల్లి పాలు లేవు. పాపం.. ఆకలవుతుందేమో..! గుక్కపట్టి ఏడుస్తున్నాడు.  కళ్యాణ్‌కు ఎటూ పాలుపోలేదు. పసికూనను ఎత్తుకుని, తన తల్లి సువార్తతో కలిసి ఇల్లెందు పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కాడు. జరిగినదంతా చెప్పాడు (ఫిర్యాదు చేశాడు).  పోలీసులు స్పందించడం లేదని కళ్యాణ్‌ అంటున్నాడు. తనకు, తమ బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఎస్సై ఏమంటున్నారంటే.... దీనిపై ఇల్లెందు ఎస్‌ఐ బి.రాజును ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘తన భార్య రజితను మిట్టపల్లిలోని ఆమె పుట్టింటి వాళ్లు బంధించారంటూ పోలీస్‌ స్టేషన్‌కు కళ్యాణ్‌ వచ్చి ఫిర్యాదు చేశాడు.

ఆదివారం ఉదయం మిట్టపల్లి నుంచి రజితను, తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి విచారిస్తాం. ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ కోసం ఖమ్మానికి రిఫర్‌ చేస్తాం. తనను బంధించినట్టుగా రజిత చెప్పలేదు. ఆమెను బంధించినట్టుగా ఆ గ్రామానికి చెందిన ఎవ్వరూ కూడా చెప్పలేదు. ఎవరైనా చెబితే... ఆ కుటుంబంపై  చర్యలు తీసుకుంటాం. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఉండవచ్చు. అలాంటప్పుడు ఆమెను బంధించినట్టు ఎలా అవుతుంది...? బంధించారని కళ్యాణ్‌ చెబితే సరిపోదు’’ అని, ఎస్సై అన్నారు. 

పాపం.. పసికూన.. 
‘‘తల్లి నులివెచ్చని స్పర్శకు, పాలకు దూరమైన ఆ పసికందు పరిస్థితేమిటి..? తల్లిపాలకు దూరమై నిన్నటి రాత్రికి ఒకటిన్నర రోజు. ఎస్సై చెప్పినట్టుగా... కౌన్సిలింగ్‌ జరిపించి, తల్లి వద్దకు బిడ్డను పంపించేసరికి ఎన్ని గంటలు.. ఎన్ని రోజులు పడుతుందో...? అప్పటివరకు ఆ పసికందు ఆకలిదప్పులు, ఆరోగ్యం పట్టించుకునేదెవరు..? (పసిపిల్లల సంరక్షణ.. తండ్రికన్నా తల్లితోనే సాధ్యం కదా..!)’’ 
 ఈ జంట–పసికూన వ్యవహారం తెలిసిన–చూసిన వారందరి ఆవేదన ఇది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement