baby birth
-
నా బిడ్డ బతుకుతుందనుకోలేదు.. సరోగసి సీక్రెట్స్ వివరించిన ప్రియాంక చోప్రా
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తొలిసారిగా తన కూతురు మాల్తీ జననం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సరోగసి విధానం ద్వారా బిడ్డను ఎందుకు కనాల్సి వచ్చిందో వివరిస్తూ ఎమోషనల్ అయ్యింది. ''మాల్తీ పుట్టినప్పుడు నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాను. ఆమె నా చేయికంటే చాలా చిన్నగా ఉంది. దీంతో కొన్నిరోజుల పాటు ఆమెను ఇంటెన్సివ్ కేర్ విభాగంలో డాక్టర్ల పర్యవేక్షనలో ఉంచాం. ఇంక్యుబేటర్‌లో కూతురిని చూస్తూ నేను, నిక్ చాలా మదనపడ్డాం. ఆ సమయంలోఘెంతో మంది డాక్టర్లు, నర్సులను కలిశాను. నిజానికి వాళ్లు దేవుని ప్రతిరూపాలు.. సాక్షాత్తు దేవుడిలానే పిల్లలకు ప్రాణాలు పోస్తున్నారు. నా కూతురు బతికి బయటపడుతుందని కూడా అనుకోలేదు. నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే సరోగసిని ఎంచుకున్నాం. కానీ నేనేదో అందం తగ్గుతుందని సరోగసిని ఎంచుకున్నానని మాట్లాడినప్పుడు చాలా బాధనపించింది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ తాలూకు ప్రభావం నా బిడ్డపై పడకూడదని నిర్ణయించుకున్నా. అందుకే తన ఫోటోలు కూడా రివీల్ చేయడం లేదు. ఇక సరోగసీ అంద ఈజీ కాదు. దీనికోసం సుమారు ఆరునెలల పాటు నేను, నా భర్త చాలా వెతికాం. చివరకి ఓ దయగల మహిళ సరోగసికి ఒప్పుకుంది. అందుకే నా కూతురికి నాతో పాటు ఆమె పేరు కూడా కలిసి వచ్చేలా పేరు పెట్టుకున్నాం'' అంటూ చెప్పుకొచ్చింది. కాగా గతేడాది జనవరిలో నిక్-ప్రియాంక దంపతులు పేరెంట్స్‌గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. -
తల్లీబిడ్డ కోసం.. ‘బేబీ బెర్త్’
రైల్వే ప్రయాణం సరసమైన ధరల్లో సౌకర్యవంతంగా ఉంటుందని అందరికీ తెలుసు. అందుకే పిల్లాపాపలతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు ఎక్కువగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. కానీ చిన్న పిల్లలతో వెళ్లే తల్లులు మాత్రం బెర్త్‌లో పడుకునే సమయంలో ఇబ్బంది పడుతుంటారు. అందుకే మదర్స్ డే సందర్భంగా తల్లులకు రైల్వే కొత్త బహుమతి అందించింది. ‘బేబీ బెర్త్’ను అందుబాటులోకి తెచ్చింది. బోగీలో లోయర్ మెయిన్ బెర్త్‌కు అనుసంధానంగా మడిచే (ఫోల్డబుల్) బేబీ బెర్త్‌ను ఏర్పాటు చేస్తోంది. తొలుత లక్నో మెయిల్లో పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. ఓ బోగీలోని రెండు సీట్లకు ఈ బెర్త్‌లను జత చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రైల్వే శాఖ ట్విట్టర్లో షేర్ చేసింది. ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకొని మిగతా రైళ్లలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. బేబీ బెర్త్ గురించి మరిన్ని విషయాలు.. ♦ఈ బెర్త్ లోయర్ బెర్త్ కిందకు మడిచిపెట్టి ఉంటుంది. కింది నుంచి పైకి లాగి పెద్ద బెర్త్‌కు సమానంగా వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. ♦బేబీ బెర్త్ కిందికి వంగిపోకుండా కింద స్టీల్ లాక్‌లు ఉంటాయి. వాటిని మెయిన్ బెర్త్‌కు ఉన్న రంధ్రాల్లోకి నెట్టాలి. చిన్నారి పడిపోకుండా ఉండేందుకు బెల్టులు ఉంటాయి. ♦ప్రయాణం అయిపోయాక స్టీల్ లాక్‌లను తీసేసి మళ్లీ మెయిన్ బెర్త్ కిందికి మడతబెట్టాలి. ♦చిన్నారితో కలిసి ప్రయాణిస్తున్నామని బుకింగ్ సమయంలో చెబితే బెర్త్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటారు. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
వింత జననం: ‘ప్లాస్టిక్ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ
Woman Gave Birth To Plastic Baby: ఇంతవరకు మనం రకరకాలుగా పుట్టిన వాళ్ల గురించి విన్నాం. అంతేందుకు అవిభక్త కవలలు గురించి విన్నాం. ఇతరత్ర సమస్యలతో పుట్టిన వాళ్ల గురించి కూడా విని ఉంటాం. కానీ ఎప్పుడైన ప్లాస్టిక్ బిడ్డకు జన్మనివ్వడం గురించి విన్నామా!. ఏంటిది కామెడీగా చెబుతున్నాను అనుకోకండి. నిజంగానే ప్లాస్టిక్ బిడ్డే పుట్టింది. (చదవండి: అందంగా అలంకరించిన ఆ క్రిస్మస్ చెట్టే వాళ్లను జైలుపాలు చేసింది!!) అసలు విషయంలోకెళ్లితే... ఔరంగాబాద్‌లోని సోహ్డాకు చెందిన ఓ మహిళ సదర్ ఆసుపత్రిలో వింత బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి శరీరం మొత్తం ప్లాస్టిక్‌తో చుట్టి ఉందని తెలిపారు. వైద్య శాస్త్ర భాషలో, అటువంటి పిల్లలను కొల్లాయిడ్ బేబీస్ అంటారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యుడు మాట్లాడుతూ...ప్రపంచంలో పుట్టిన 11 లక్షల మంది శిశువుల్లో ఒకరు కొల్లాయిడ్ బేబీ జన్మిస్తుంటారని తెలిపారు. ప్రసుత్తం ఈ బేబి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటుందని స్పష్టంగా చెప్పలేం. పైగా ఎంతకాలం వరకు బతుకుతుందో కూడా చెప్పలేం అని అన్నారు. అయితే తండ్రి స్పెర్మ్‌లో అసాధారణత వల్ల ఇలాంటి బిడ్డ పుడుతుందని ఎస్ఎన్సీయూ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ దినేష్ దూబే చెప్పారు. ఈ మేరకు గత ఏడేళ్లలో అటువంటి పిల్లలు ముగ్గురు జన్మించారని తెలిపారు. అయితే ఇందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మూడో వ్యక్తికి చికిత్స కొనసాగుతోందని అన్నారు. అంతేకాదు ఈ చిన్నారి కూడా ఆరోగ్యవంతంగా ఉండి సాధారణ జీవితం గడపగలదనే భావిస్తున్నాం అని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: ఆ సమయంలో కూడా సేవలందించిన సూపర్ ఉమెన్లు) -
మానవత్వం పరిమళించిన వేళ
సాక్షి, పాచిపెంట(విజయనగరం) : మానవ సేవే మాధవ సేవగా భావించారు. అందరూ సహకరించి ఓ గర్భిణికి పురుడుపోశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండడంతో సంతోషించిన ఘటన సాలూరులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు పంచాయతీ కోమటివలస గ్రామానికి చెందిన కొర్ర రాములమ్మ నాలుగు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో భర్త, కుటుంబంతో కలిసి పనుల కోసం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు వలస వెళ్లిపోయారు. రాములమ్మకు ప్రసవ తేదీ దగ్గర పడడంతో బుధవారం స్వగ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో విశాఖపట్నంలో దిగి సాలూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. రాత్రి సుమారు 10 గంటల సమయంలో బస్సు రామభద్రపురానికి చేరుకునే సరికి రాములమ్మకు నొప్పులు అధికమయ్యాయి. బిడ్డ ప్రసవమయ్యే పరిస్థితి రావడంతో వెంటనే రాములమ్మ భర్త నాగేశు కోమటివలస ఏఎన్ఎం సంగీతకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. బస్సును ఆపకుండా సాలూరు వచ్చేయాలని, సాలూరులో సిద్ధంగా ఉంటానని తెలి పింది. డ్రైవర్‌కు సైతం బస్సును సాలూరు తీసుకరావాలని, మధ్యలో నిలిపివేయవద్దని ఏఎన్ఎం విన్నవించింది. మానవత్వం చాటుకున్న ప్రయాణికులు, బస్సు డ్రైవర్, కండక్టర్ అందరి సహకారంతో రాములమ్మను సాలూరుకు తీసుకొచ్చారు. అప్పటికే బిడ్డ సగం బయటకు వచ్చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయ సెంటర్ వద్ద ఏఎన్ఎం బస్సులోకి ఎక్కి గర్భిణి పరిస్థితిని గుర్తించింది. బిడ్డ బయటకు రావడం, పేగులు కోయడం వల్ల తల్లికి ప్రమాదమని భావించింది. అంబులెన్స్‌కు ఫోన్ చేసినా రాలేదు. వెంటనే ఏఎన్ఎం స్థానిక సీహెచ్‌సీ స్టాఫ్ నర్స్‌కు ఫోన్‌చేసి ఇద్దరూ కలిసి అదే బస్సులో ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్లి అక్కడ బస్సులోనే రాములమ్మకు పురుడుపోశారు. రెండో కాన్పులో పండంటి మగబిడ్డకు రాములమ్మ జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను అర్ధరాత్రి సాలూరు సీహెచ్‌సీకి ఆటోలో తరలించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
బందీగా అమ్మ... ఆకలితో పసికూన
మూడు నెలల పదకొండు రోజుల వయసున్న ఈ పసికూనకు మాట్లాడే శక్తే ఉంటే.. తన తల్లిని ఇలాగే వేడుకునేవాడేమో...!!! ఆ తల్లి ఎవరు..? ఎక్కడికెళ్లింది...? పసికూనకు ఎందుకు దూరమైంది,...? వీటికి సమాధానమే ఈ కథనం... ఇల్లెందు : ఇదొక ప్రేమికుడి వేదన. ఇదొక ప్రియురాలి యాతన. ఇదొక పసికూన రోదన. ఇల్లెందు మండలం రొంపేడు పంచాయతీ మిట్టపల్లి తండాకు చెందిన ఆమె పేరు బి.రజిత, గార్ల మండలం ముల్కనూరుకు చెందిన అతడి పేరు బళ్లెం కళ్యాణ్. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. గార్ల శివాలయంలో ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ–పెళ్లికి రజిత తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వారి నుంచి తామిద్దరికీ ప్రాణ భయం ఉందంటూ గార్ల పోలీసులను ఆ ప్రేమ జంట ఆశ్రయించింది. వారిని ఇల్లెందు పోలీస్ స్టేషన్‌కు గార్ల పోలీసులు పంపించారు. రజిత తల్లిదండ్రులను ఇల్లెందు పోలీసులు పిలిపించారు. కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ తరువాత, రజిత– కళ్యాణ్ జంట హైదరాబాద్ వెళ్లింది. అక్కడే ఉంటున్నారు. రజిత గర్భవతయింది. ప్రసవం కోసం భర్తతో కలిసి ముల్కనూరుకు వచ్చింది. కొన్ని రోజులు గడిచాయి. రజితతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబీకులు ఫోన్లో మాట్లాడసాగారు. యోగ క్షేమాలు తెలుసుకోసాగారు. మార్చి 19న పండంటి బాబుకు రజిత జన్మనిచ్చింది. బాబును, రజితను చూసేందుకు తల్లిదండ్రులు పలుమార్లు ముల్కనూరు వచ్చారు. రజిత–కళ్యాణ్ కుటుంబాల మధ్య సుహృద్బావ వాతావరణం ఏర్పడింది. వారం రోజుల కిందట రజిత అస్వస్థురాలైంది. ఆమె కుటుంబీకులకు తెలిసింది. ఇల్లెందులోని ఆస్పత్రిలో వైద్యం చేయిస్తామన్నారు. కళ్యాణ్–రజిత దంపతులు తమ పసికూనతో ఇల్లెందు చేరుకున్నారు. ప్రైవేటు వైద్యశాలలో రజితకు ఆమె కుటుంబీకులు వైద్యం చేయించారు. ఆ దంపతులు ఆ రోజు సాయంత్రం ముల్కనూరు చేరుకున్నారు. ఇంటికి రావాలంటూ రెండు రోజుల కిందట రజిత కుటుంబీకుల నుంచి పిలుపొచ్చింది. బాబును తీసుకుని కళ్యాణ్–రజిత ఇల్లెందు వచ్చారు. ఆమెను మిట్టపల్లిలోని పుట్టింటికి పంపించాడు. ఆ పసికూనకు ఆరోగ్యం బాగోలేదు. సాయంత్రానికి రావాలని, అప్పటివరకు బాబును తన వద్దనే ఉంచుకుంటానని అన్నాడు. ఆమె సరేనంది. తన పుట్టింటికి వెళ్లింది. సాయంత్రం వరకు కళ్యాణ్‌తో రజిత ఫోన్లో మాట్లాడింది. మరో గంటలో బయల్దేరుతానని చెప్పింది. సాయంత్రమైంది. ఆమె రాలేదు. బాబు ఏడుస్తున్నాడు. రజితకు ఫోన్ చేశాడు. ఆమె కుటుంబీకులు మాట్లాడారు. ‘‘రజిత రాదు. నీ దిక్కున్న చోట చెప్పుకోపో...’’ – అటు నుంచి వచ్చిన సమాధానమిది. ఈ హఠాత్పరిణామంతో కళ్యాణ్‌కు నోట మాట రాలేదు. శనివారం సాయంత్రమైంది. ఆ పసికూనకు ఒకటిన్నర రోజుపాటు తల్లి పాలు లేవు. పాపం.. ఆకలవుతుందేమో..! గుక్కపట్టి ఏడుస్తున్నాడు. కళ్యాణ్‌కు ఎటూ పాలుపోలేదు. పసికూనను ఎత్తుకుని, తన తల్లి సువార్తతో కలిసి ఇల్లెందు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. జరిగినదంతా చెప్పాడు (ఫిర్యాదు చేశాడు). పోలీసులు స్పందించడం లేదని కళ్యాణ్ అంటున్నాడు. తనకు, తమ బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. ఎస్సై ఏమంటున్నారంటే.... దీనిపై ఇల్లెందు ఎస్ఐ బి.రాజును ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘తన భార్య రజితను మిట్టపల్లిలోని ఆమె పుట్టింటి వాళ్లు బంధించారంటూ పోలీస్ స్టేషన్‌కు కళ్యాణ్ వచ్చి ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం మిట్టపల్లి నుంచి రజితను, తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి విచారిస్తాం. ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం ఖమ్మానికి రిఫర్ చేస్తాం. తనను బంధించినట్టుగా రజిత చెప్పలేదు. ఆమెను బంధించినట్టుగా ఆ గ్రామానికి చెందిన ఎవ్వరూ కూడా చెప్పలేదు. ఎవరైనా చెబితే... ఆ కుటుంబంపై చర్యలు తీసుకుంటాం. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఉండవచ్చు. అలాంటప్పుడు ఆమెను బంధించినట్టు ఎలా అవుతుంది...? బంధించారని కళ్యాణ్ చెబితే సరిపోదు’’ అని, ఎస్సై అన్నారు. పాపం.. పసికూన.. ‘‘తల్లి నులివెచ్చని స్పర్శకు, పాలకు దూరమైన ఆ పసికందు పరిస్థితేమిటి..? తల్లిపాలకు దూరమై నిన్నటి రాత్రికి ఒకటిన్నర రోజు. ఎస్సై చెప్పినట్టుగా... కౌన్సిలింగ్ జరిపించి, తల్లి వద్దకు బిడ్డను పంపించేసరికి ఎన్ని గంటలు.. ఎన్ని రోజులు పడుతుందో...? అప్పటివరకు ఆ పసికందు ఆకలిదప్పులు, ఆరోగ్యం పట్టించుకునేదెవరు..? (పసిపిల్లల సంరక్షణ.. తండ్రికన్నా తల్లితోనే సాధ్యం కదా..!)’’ ఈ జంట–పసికూన వ్యవహారం తెలిసిన–చూసిన వారందరి ఆవేదన ఇది -
ముహూర్తాల వెర్రీ... డెలివర్రీ!
సాక్షి, కడప : కాలం మారుతున్న కొద్దీ ట్రెండ్లు మారిపోతున్నాయి. బిడ్డలు నెలలు నిండిన తర్వాత పుట్టడం పాతకాలం.. మూహూర్తం చెప్పిన ప్రకారం పుట్టడం నేటికాలం.. 9 నెలల పాటు అమ్మ కడుపులో గడిపిన బిడ్డను బయటికి తెచ్చే సమయంపై తల్లిదండ్రులు పెడుతున్న శ్రధ్ద అంతా ఇంతా కాదు. శిశువు పుట్టకమునుపే.. పురోహితుల వద్దకు వెళ్లి పంచాం గాలు వెతికి ముహూర్తం ఖరారుచేస్తున్నారు. డెలివరి డేట్‌కు ముందు ఒక నెల నుంచి జాతకాలు.. తిధి.. నక్షత్రం.. రోజు.. రాహుకాలం.. యమగండం..ఘడియలు.. లాంటివి చూసుకుని ఆసుపత్రి వైపు అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే గతంలో మాదిరికాకుండా ఇప్పు డు డెలివరీ డేట్ ముందుగానే తెలుస్తుండటంతో ఎక్కువమంది ‘ఒకరోజు’ ఫిక్స్ చేసుకుంటున్నారు. శుభఘడియలను చూసుకుని ఇంట్లో నుంచి బయట పడుతున్నారు. బిడ్డ పుట్టకమునుపే.... మూడు నెలల ముందో వైద్యులు డెలివరీ డేట్ ఇస్తారు. ఎప్పటికప్పుడు బిడ్డ పరిస్థితిని చూస్తూ పలు సూచనలు, సలహాలు ఇస్తూ వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు పురోహితుల వద్దకు వెళ్లి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో లేకపోయినా ఇటీవల కాలంలో చాలామంది సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ వస్తున్నారు. ఇంటి దేవతలకు ఇష్టమైన రోజును ఎంపిక చేసుకుని ఎవరికి వారు ముందుకు వెళుతున్నారు. పుట్టిన మరుక్షణమే ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన సమయాన్ని తీసుకుని జాతకాన్ని రాయిస్తున్నారు. శుభఘడియల్లో ఆపరేషన్ చేయించినా దోషాలతో బిడ్డ పుట్టినా అందుకు అనుగుణంగా దోష నివారణకు శాంతిపూజలు చేపడుతున్నారు. ఇలా బిడ్డ పుట్టకమునుపు...పుట్టిన తర్వాత తల్లిదండ్రులు, కుటుంబీకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. ముహూర్తాల వెర్రీలో.. : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్న వారిలో చాలామంది ముహూర్తాలను చూసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపు 30 నుంచి 40 శాతం మంది తిథి, ఘడియలు, నక్షత్రాలు చూసుకుని ఆస్పత్రులకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రసవానికి ఇంకా సమయమున్నా ముహూర్తాల వెర్రిలో పడి వారం, పదిరోజుల ముందే ఆపరేషన్‌కు సిద్ధమవడం కరెక్టు కాదని పెద్దలు సూచిస్తున్నారు. ఎందుకంటే బిడ్డ తల్లి కడుపులో తొమ్మిది నెలలు నిండేవరకు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాడన్నది వైద్యుల సూచన. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు...ముహూర్తాలు తర్వాత లేదనో క్రమంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు వైద్యులు సిజిరేయిన్ చేయాల్సి వస్తోంది. రెండు, మూడు రోజుల వ్యవధిలో చేసినా ఏం కాదుగానీ, పది, పదిహేనురోజుల తేడాతో ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీస్తే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ౖగైనకాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. ముహుర్తాలలో డెలివరీలు శ్రావణమాసం, మాఘమాసం, కార్తీక మాసం, రంజాన్ మాసం, క్రిస్మస్ పండుగ రోజులలో డెలివరీల సందడి కనిపిస్తోంది. మంచి రోజులు వస్తాయంటే ఒకపక్క పెళ్లిళ్ల సందడి ఉండగా, మరోపక్క ఈ శుభముహూర్తాల సమయంలోనే బిడ్డ పుడితే జాతకంతోపాటు భవిష్యత్తు బంగారంగా ఉంటుందని పలువురు దంపతులు భావిస్తున్నారు. మంచిరోజులు ఉన్న సందర్భాలలో గర్భవతులతో ఆస్పత్రులలో కూడా హడావుడి కనిపిస్తోంది. వారం, తిథి, నక్షత్రం చూసుకుంటున్నారు డెలివరీ డేట్‌కు ఒకరోజు అటు, ఇటు ముహూర్తం అడుగుతున్నారు. వారం, తిథి, నక్షత్రం, తారాబలం, లగ్నబలం చూసుకున్న తర్వాతనే ఆపరేషన్ చేయించుకుంటున్నారు. రెండు, మూడు ఏళ్ల కిందట అంతగా లేకపోయినా, ప్రస్తుతం చాలామంది ప్రసవాలకు సంబంధించి ముహూర్తాలు అడుగుతున్నారు. మంచిరోజు చూసుకునే ఆపరేషన్‌కు వెళుతున్న రోజులొచ్చాయి. పూర్వాషాడ నక్షత్రంలో అధిపతి శుక్రుడు, ఉత్తరాషాడ నక్షత్రంలో అధిపతి రవి కాబట్టి ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన అన్ని ఫలితాలు అందుతాయని శాస్త్రంలో ఉంది. మొత్తానికైతే ఎక్కువగా పంచాంగాలు, ముహూర్తాలు చూసుకుని డెలివరీకి వెళుతున్నారు. – పి.రామ్మోహన్‌శర్మ, అర్చకులు, అమరేశ్వరస్వామి ఆలయం, కడప -
బిడ్డకు జన్మనిచ్చి అనంత లోకాలకు..
మహిళ మృతిపై ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన కొత్తగూడెం అర్బన్: బిడ్డకు జన్మనిచ్చిన మరుసటి రోజే ఓ తల్లి అనంత లోకాలకు చేరింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నారుు. పాల్వంచ మండలం ఎర్రగుంటకు చెందిన దిడ్డి కుమారి(23) కాన్పు కోసం ఈనెల 26న కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. అదే రోజు ఏరియా ఆసుపత్రి గైనకాలజిస్టు డాక్టర్ ఝాన్సీ ఆపరేషన్ చేయగా బాబు పుట్టాడు. కాగా మరుసటి రోజు కుమారి పరిస్థితి విషమంగా మారడంతో ఝాన్సీ ఆమెను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రికి స్వయంగా తీసుకెళ్లింది. ప్రైవేటు ఆసుపత్రిలో కుమారి చికిత్స పొందుతూ మరణించింది. మృత దేహాన్ని కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా పంపించారు. విషయం తెలుసుకొని మృతురాలి బంధువులు ఆసుపత్రికి వచ్చి ఆందోళన నిర్వహించారు. కమారి మృతికి వైద్యులే కారణమంటూ ఆరోపించారు. కుమారికి ఆపరేషన్‌కు ముందు ఎక్కువ మోతాదులో మత్తు ఇవ్వడం మూలనే వైద్యం వికటించి మృతి చెందిందని ఆరోపించారు. కుమారి గర్భవతిగా ఉన్న తొమ్మిది నెలల్లో రాని గుండెనొప్పి ఇప్పడేలా వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. అనంతరం ఆసుపత్రి అధికారులు, పోలీసులు కుమారి తరుపున బంధువులు చర్చలు జరిపారు. అంత్యక్రియల ఖర్చు కోసం రూ.30 వేలు ఇవ్వడంతో మృతురాలి బంధువులు ఆందోళన విరమించారు. ఈ ఘటనపై పోలీసు స్టేషన్లో ఎటువంటి కేసు నమోదు కాలేదు. ప్రసవం అనంతరం మరుసటి రోజు గుండెనొప్పి, ఆయసం రావడంతో కుమారి ఆమె మృతి చెందినట్లు ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ జనార్దన్ వివరించారు.