ముహూర్తాల వెర్రీ... డెలివర్రీ! | People Waiting Good Time For Delivery | Sakshi
Sakshi News home page

ముహూర్తాల వెర్రీ... డెలివర్రీ!

Published Fri, Mar 16 2018 10:19 AM | Last Updated on Fri, Mar 16 2018 10:19 AM

People Waiting Good Time For Delivery - Sakshi

సాక్షి, కడప : కాలం మారుతున్న కొద్దీ ట్రెండ్‌లు మారిపోతున్నాయి. బిడ్డలు నెలలు నిండిన తర్వాత పుట్టడం పాతకాలం.. మూహూర్తం చెప్పిన ప్రకారం పుట్టడం నేటికాలం.. 9 నెలల పాటు అమ్మ కడుపులో గడిపిన బిడ్డను బయటికి తెచ్చే సమయంపై తల్లిదండ్రులు పెడుతున్న శ్రధ్ద అంతా ఇంతా కాదు. శిశువు పుట్టకమునుపే.. పురోహితుల వద్దకు వెళ్లి పంచాం గాలు వెతికి ముహూర్తం ఖరారుచేస్తున్నారు. డెలివరి డేట్‌కు ముందు ఒక నెల నుంచి జాతకాలు.. తిధి.. నక్షత్రం.. రోజు.. రాహుకాలం.. యమగండం..ఘడియలు.. లాంటివి చూసుకుని ఆసుపత్రి వైపు అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే గతంలో మాదిరికాకుండా ఇప్పు డు డెలివరీ డేట్‌ ముందుగానే తెలుస్తుండటంతో ఎక్కువమంది ‘ఒకరోజు’ ఫిక్స్‌ చేసుకుంటున్నారు. శుభఘడియలను చూసుకుని ఇంట్లో నుంచి బయట పడుతున్నారు.

బిడ్డ పుట్టకమునుపే....
మూడు నెలల ముందో వైద్యులు డెలివరీ డేట్‌ ఇస్తారు. ఎప్పటికప్పుడు బిడ్డ పరిస్థితిని చూస్తూ పలు సూచనలు, సలహాలు ఇస్తూ వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు పురోహితుల వద్దకు వెళ్లి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో లేకపోయినా ఇటీవల కాలంలో చాలామంది సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ వస్తున్నారు. ఇంటి దేవతలకు ఇష్టమైన రోజును ఎంపిక చేసుకుని ఎవరికి వారు ముందుకు వెళుతున్నారు. పుట్టిన మరుక్షణమే ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన సమయాన్ని తీసుకుని జాతకాన్ని రాయిస్తున్నారు. శుభఘడియల్లో ఆపరేషన్‌ చేయించినా దోషాలతో బిడ్డ పుట్టినా అందుకు అనుగుణంగా దోష నివారణకు శాంతిపూజలు చేపడుతున్నారు. ఇలా బిడ్డ పుట్టకమునుపు...పుట్టిన తర్వాత తల్లిదండ్రులు, కుటుంబీకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు.

ముహూర్తాల వెర్రీలో.. :
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్న వారిలో చాలామంది ముహూర్తాలను చూసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాదాపు 30 నుంచి 40 శాతం మంది తిథి, ఘడియలు, నక్షత్రాలు చూసుకుని ఆస్పత్రులకు వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రసవానికి ఇంకా సమయమున్నా ముహూర్తాల వెర్రిలో పడి వారం, పదిరోజుల ముందే ఆపరేషన్‌కు సిద్ధమవడం కరెక్టు కాదని పెద్దలు సూచిస్తున్నారు. ఎందుకంటే బిడ్డ తల్లి కడుపులో తొమ్మిది నెలలు నిండేవరకు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాడన్నది వైద్యుల సూచన. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు...ముహూర్తాలు తర్వాత లేదనో క్రమంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు వైద్యులు సిజిరేయిన్‌ చేయాల్సి వస్తోంది. రెండు, మూడు రోజుల వ్యవధిలో చేసినా ఏం కాదుగానీ, పది, పదిహేనురోజుల తేడాతో ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటికి తీస్తే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ౖగైనకాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు.

ముహుర్తాలలో డెలివరీలు
శ్రావణమాసం, మాఘమాసం, కార్తీక మాసం, రంజాన్‌ మాసం, క్రిస్మస్‌ పండుగ రోజులలో డెలివరీల సందడి కనిపిస్తోంది. మంచి రోజులు వస్తాయంటే ఒకపక్క పెళ్లిళ్ల సందడి ఉండగా, మరోపక్క ఈ శుభముహూర్తాల సమయంలోనే బిడ్డ పుడితే జాతకంతోపాటు భవిష్యత్తు బంగారంగా ఉంటుందని పలువురు దంపతులు భావిస్తున్నారు. మంచిరోజులు ఉన్న సందర్భాలలో గర్భవతులతో ఆస్పత్రులలో కూడా హడావుడి కనిపిస్తోంది.

వారం, తిథి, నక్షత్రం చూసుకుంటున్నారు
డెలివరీ డేట్‌కు ఒకరోజు అటు, ఇటు ముహూర్తం అడుగుతున్నారు. వారం, తిథి, నక్షత్రం, తారాబలం, లగ్నబలం చూసుకున్న తర్వాతనే ఆపరేషన్‌ చేయించుకుంటున్నారు. రెండు, మూడు ఏళ్ల కిందట అంతగా లేకపోయినా, ప్రస్తుతం చాలామంది ప్రసవాలకు సంబంధించి ముహూర్తాలు అడుగుతున్నారు. మంచిరోజు చూసుకునే ఆపరేషన్‌కు వెళుతున్న రోజులొచ్చాయి. పూర్వాషాడ నక్షత్రంలో అధిపతి శుక్రుడు, ఉత్తరాషాడ నక్షత్రంలో అధిపతి రవి కాబట్టి ఈ రెండు నక్షత్రాల్లో జన్మించిన అన్ని ఫలితాలు అందుతాయని శాస్త్రంలో ఉంది. మొత్తానికైతే ఎక్కువగా పంచాంగాలు, ముహూర్తాలు చూసుకుని డెలివరీకి వెళుతున్నారు. – పి.రామ్మోహన్‌శర్మ, అర్చకులు, అమరేశ్వరస్వామి ఆలయం, కడప

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement