కనకయ్య ‘కారు’ ఎక్కేనా..? | kannaiah may be joined in trs party | Sakshi
Sakshi News home page

కనకయ్య ‘కారు’ ఎక్కేనా..?

Published Fri, Aug 29 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM

kannaiah may be  joined in trs party

 ఇల్లెందు: ఇల్లెందు కాంగ్రెస్‌లో ‘రేణుక తుపాన్’ మొదలైంది. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్య తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య గత రెండు నెలల క్రితం పీసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇల్లెందు నియోజకవర్గంలో రేణుక వర్గానికి చెందిన 12 మందిని పీసీసీ ఇటీవల సస్పెండ్ చేసింది. అయితే తమ అనుచరులపై వేటు వేయడాన్ని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తీవ్రంగా ఆక్షేపించారు. జిల్లాలో తాను ఉన్నంత కాలం కార్యకర్తలకు ఎలాంటి ఢోకా లేదని ఆమె భరోసా ఇచ్చారు. అయితే గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిని రేణుక వెనకేసుకొస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ఈ క్రమంలో గురువారం ఇల్లెందు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరేందుకు ఎమ్మెల్యే కోరం కనకయ్య సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి కలిశారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సీఎంకు వివరించారు. అవన్నీ సావధానంగా విన్న కేసీఆర్.. బంగారు తెలంగాణ పట్ల తనకున్న విజన్‌ను ఎమ్మెల్యే ముందుంచారు. బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని, టీఆర్‌ఎస్‌లోకి రావాలని కనకయ్యను కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారు.

అయితే తన విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే నడుచుకుంటానని, వారి అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని సీఎంకు చెప్పారని సమాచారం. కాగా, ఎమ్మెల్యే అనచరుల్లో ముఖ్యమైన నేతలు టీఆర్‌ఎస్ వైపు అడుగు వేసేందుకు సంసిద్ధంగా ఉన్నారని తెలిసింది. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధితో పాటు నియోజకవర్గ ప్రజలను మెప్పించేలా పాలన సాగించాలంటే ప్రభుత్వ సహకారం అవసరమని, కేసీఆర్ ఆహ్వానం మేరకే గులాబీ తీర్థం పుచ్చుకుంటే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇందుకోసం ఒకటి, రెండు రోజుల్లో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి కార్యకర్తల మనోభావాలు తెలుసుకుంటామని ఎమ్మెల్యే అనుచర నాయకుడు ఒకరు తెలిపారు. సెప్టెంబర్ ఒకటిన వీరంతా టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement