ఖమ్మం మెట్టు.. ఎవరిదో పట్టు! | Congress And TRS Parties Khammam Constituency Review | Sakshi
Sakshi News home page

ఖమ్మం మెట్టు.. ఎవరిదో పట్టు!

Published Mon, Apr 1 2019 5:29 AM | Last Updated on Mon, Apr 1 2019 5:29 AM

Congress And TRS Parties Khammam Constituency Review - Sakshi

విప్లవ రాజకీయాల పురిటిగడ్డ ఖమ్మం ఖిల్లాలో లోక్‌సభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ ఎలాగైనా పాగా వేసేందుకు అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఉవ్విళ్లూరుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీఆ తర్వాతి పరిణామాలతో పుష్పక విమానంలా మారిన‘కారు’లోని సైన్యం కలిసికట్టుగా పనిచేస్తే విజయం పెద్దకష్టమేమీ కానప్పటికీ, ఏం జరుగుతుందోననే మీమాంస
ఆ పార్టీలో కనిపిస్తుండటం విశేషం. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న నామా నాగేశ్వరరావుకు జిల్లాలోని ప్రధాన నేతల నుంచి ఎలాంటి సహకారం లభిస్తుందన్న దానిపైనే ఆయన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే,వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్‌ మళ్లీ రేణుకా చౌదరిని రంగంలోకి దింపి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బీజేపీ, సీపీఎం, న్యూడెమొక్రసీ బరిలో ఉన్నా.. ప్రభావంనామమాత్రమేనని, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని స్థానిక పరిస్థితులు చెబుతున్నాయి.
-మేకల కల్యాణ్‌ చక్రవర్తి

టీఆర్‌ఎస్‌: బలం,బలగంతో జోష్‌
తెలంగాణ రాష్ట్ర సమితి విషయానికి వస్తే.. ఖమ్మం లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దసంఖ్యలో నాయకులు, ఎమ్మెల్యేలు, కేడర్‌తో పరిపుష్టంగా కనిపిస్తోంది. అన్ని నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించిన గులాబీ దళానికి పెద్ద బలగమే కనిపిస్తోంది. సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అభ్యర్థి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయ్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, రాములు నాయక్, జెడ్పీ చైర్మన్‌ కవిత, డీసీసీబీ మాజీ చైర్మన్‌ విజయబాబు, గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు అండగా ఉన్నారు. వీరంతా నామా నాగేశ్వరరావు విజయానికి కృషి చేస్తే సానుకూల ఫలితం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, నామా అభ్యర్థిత్వమే ఇక్కడ సమస్య అవుతుందా అనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గ ప్రజలు గుర్రుగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ టీడీపీ నుంచి తీసుకువచ్చి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామాను బరిలోకి దించడం సామాన్య ప్రజలతో పాటు టీఆర్‌ఎస్‌ కేడర్‌కు కూడా రుచించడం లేదనే వాదన ఉంది. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.తారక రామారావు.. పథకం ప్రకారమే నామా నాగేశ్వరరావును బరిలో దించారని, జిల్లాలోని పార్టీ నేతలంతా ఆయన విజయానికి కృషి చేస్తారని, నామా విజయం తథ్యమని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, వైరా, పాలేరు నియోజకవర్గాల్లో వైరి వర్గాలుగా తలపడిన రెండు గ్రూపులూ ఇప్పుడు తమ గూటికే రావడం కచ్చితంగా లాభిస్తుందని అంచనా వేస్తున్నారు.

‘పొంగులేటి’ కదలికలను బట్టి..
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ రాజకీయాన్ని పరిశీలిస్తే ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం సాధించాలంటే మాత్రం సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం పరిపూర్ణంగా ఉండాల్సిందేనని అర్థమవుతుంది. ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, పాలేరు.. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఆయనకు సొంత కేడర్‌ ఉంది. ఎంపీగా గెలిచిన ఐదేళ్లలో ఆయన పట్టు నిలుపుకునేందుకు మంచి ప్రయత్నమే చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా కేడర్‌కు అందుబాటులో ఉంటూ తనకంటూ ఎప్పుడు పిలిచినా పలికే కేడర్‌ను తయారు చేసుకున్నారు. ముఖ్యంగా అశ్వారావుపేట, మధిర, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థుల కన్నా ఎక్కువ పట్టు సాధించారు. గ్రామీణ ప్రాంత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, సొంత ఖర్చుతో కొన్ని గ్రామాల సమస్యలు పరిష్కరించడం, ఏ కష్టమున్నా, కార్యక్రమమున్నా తానున్నాంటూ ఆర్థిక సాయం చేయడంతో ఎంపీగా పొంగులేటి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, కారణమేదైనా టీఆర్‌ఎస్‌ ఆయనకు టికెట్‌ నిరాకరించడంతో పొంగులేటి కేడర్‌ అంతా పూర్తిగా నైరాశ్యంలో ఉంది. తమ నాయకుడు పోటీ చేయడం లేదన్న నిస్తేజం నుంచి ఆయన అనుచరులు ఇంకా కోలుకోలేదు. పొంగులేటి కూడా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంతోనే బహిర్గతమయ్యారు తప్ప ఇప్పటి వరకు ఎక్కడా తన అనుచరులకు దిశానిర్దేశం చేయలేదు. అయితే, ఏప్రిల్‌ 4న ఖమ్మంలో జరిగే బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ పొంగులేటికి ఇచ్చే ప్రాధాన్యం, హామీ గురించి ఆయన అనుచరగణం ఎదురుచూస్తోంది. ఆ సభ తర్వాతే పొంగులేటి అనుచరుల్లో పూర్తి స్థాయి కదలిక వచ్చే అవకాశం ఉంది.

అసెంబ్లీ స్థానాల్లో ఎవరి బలమెంత?
ఖమ్మం: పట్టణ ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు సానుకూలత కనిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ (టీఆర్‌ఎస్‌) గట్టి పట్టున్న నాయకుడు. ఆయనకు తోడు ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా కేడర్‌ ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుక వర్గం కూడా ఉన్నా కాంగ్రెస్‌ సంస్థాగతంగా పట్టు కోల్పోయింది. అయితే, ఇక్కడ నామా, రేణుకల్లో కమ్మ సామాజిక వర్గం ఎవరిని ఎంచుకుంటుంది..? మైనార్టీలు, మున్నూరు కాపులు ఎవరివైపు మొగ్గు చూపుతారనేవి అభ్యర్థుల జాతకాలను తారుమారు చేయనున్నాయి.

పాలేరు: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డిని గెలిపించాయి. ఇప్పుడు ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించగా, టీడీపీ కేడర్‌ కూడా నామాతో పాటు టీఆర్‌ఎస్‌ గూటికి చేరింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు తప్ప నేతలు లేని పరిస్థితి. అయితే, ఉపేందర్‌రెడ్డి పార్టీ మార్పుపై ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. మొత్తానికి పాలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌దే పైచేయి అయ్యే అవకాశాలు మెండుగాకనిపిస్తున్నాయి.

మధిర: రెడ్డి, ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం ఎటు మొగ్గుచూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నందున కాంగ్రెస్‌కు మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. అయితే, టీఆర్‌ఎస్‌ కూడా బలంగానే కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గుచూపిన రెడ్డి సామాజికవర్గం ఈసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్‌ రాకపోవడంతో టీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉందని స్థానిక పరిస్థితులు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకకు కూడా ఇక్కడి ప్రజలతో నేరుగా సంబంధాలున్నాయి. నామాకు ఇక్కడ మెజార్టీ రావాలంటే పొంగులేటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటేనే సాధ్యమవుతుంది.

వైరా: ఈ నియోజకవర్గంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంచి పట్టుంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు గత ఎన్నికల్లో సహకరించి పనిచేసింది కాంగ్రెస్‌ నేతలే. అయినా, మహాకూటమి తరఫున నిలబడ్డ సీపీఐ అభ్యర్థికి 25 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే, రాములు నాయక్, ఆయన ప్రత్యర్థి మదన్‌లాల్‌కు కలిపి లక్ష ఓట్ల వరకు వచ్చాయి. ఇప్పుడు ఇద్దరూ టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. అయితే, మదన్‌లాల్‌ కంటే ఎక్కువ పొంగులేటి టీఆర్‌ఎస్‌ పక్షాన ఇక్కడ ప్రభావం చూపగలరు. కాంగ్రెస్‌ అభ్యర్థి పక్షాన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్థానిక కాంగ్రెస్‌ నాయకత్వం సహకారం తప్పనిసరి.

కొత్తగూడెం: ఇక్కడ కూడా కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరారు. కొత్తగూడెంలో కాంగ్రెస్‌ అంటేనే వనమా.. వనమా అంటేనే కాంగ్రెస్‌ అనే పరిస్థితి. కానీ, ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో యడవెల్లి కృష్ణతో పాటు నలుగురైదుగురు నేతలు మాత్రమే పార్టీలో మిగిలారు. వనమా, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ఇక్కడ కూడా మంచి పట్టున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు కలిసి పనిచేస్తే ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ తప్పదు. అయితే, వనమాతో పాటు కొందరు నేతలే వెళ్లారని, కేడర్‌ తమతోనే ఉందని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది.

సత్తుపల్లి: ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్‌ఎస్‌ పక్షానే చేరారు. ఈయనతో డీసీసీబీ మాజీ చైర్మన్‌ విజయబాబు కలిసి పనిచేస్తున్నారు. వీరిద్దరితో పాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు ఇక్కడ నామా విజయం కోసం పనిచేస్తే ఇక్కడా టీఆర్‌ఎస్‌కు మంచి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. అయితే, పార్టీ మారిన సండ్రపై నియోజకవర్గ ప్రజల్లో కొంత అసహనం కనిపిస్తోంది. నామా కూడా ఎన్నికల ముందే పార్టీ మారి బరిలో నిలవడంతో ఇక్కడి ఓటర్లు కొంత ప్రతికూల అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తోంది.

అశ్వారావుపేట: ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే అటు పార్టీగా కన్నా ఎంపీ పొంగులేటి వర్గంగానే బలంగా కనిపిస్తుంది. ఇక్కడ స్థానిక నేతలు ఎక్కువ మంది పొంగులేటి అనుచరులే. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన తాటి వెంకటేశ్వర్లు కూడా ఆయన వెంట ఉన్న నాయకుడే. తాటితో పాటు ఆలపాటి రాము ఇతర నేతలు సహకారం సంపూర్ణంగా లభించాల్సి ఉంటుంది. ఇక, ఎమ్మెల్యేగా గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ), పార్టీ కేడర్‌ కాంగ్రెస్‌కు ఇక్కడ బలాలుగా కనిపిస్తున్నాయి. ప్రజల్లో మాత్రం మిశ్రమ స్పందన కనిపించింది.

16 సార్లు.. 10 మంది ఎంపీలు
ఖమ్మం లోక్‌సభకు మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగితే 10 మంది మాత్రమే ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. అంటే ఇక్కడ వరుసగా గెలవడం పరిపాటి అయిపోయింది. కానీ, 1991 తర్వాత ఇక్కడి రాజకీయాల్లో మార్పు వచ్చింది. అప్పటివరకు పదిసార్లు ఎన్నికలు జరిగితే నలుగురే ఎంపీలుగా గెలుపొందారు. కానీ 91లో పి.వి.రంగయ్యనాయుడు గెలిచిన తర్వాత ఒక్కసారి తప్ప ప్రతిసారీ ఖమ్మం ఎంపీ మారుతూనే వచ్చారు. 91లో రంగయ్యనాయుడు, 96లో తమ్మినేని వీరభద్రం, 98లో నాదెండ్ల భాస్కరరావు, 99లో రేణుకా చౌదరి గెలిచారు. 2004లోనూ రేణుకాచౌదరి గెలవగా, 2009లో నామా నాగేశ్వరరావు, 2014లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు. ఇప్పుడు సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి బరిలో లేకపోవడంతో 2019 ఎన్నికల్లోనూ ఖమ్మం ఎంపీ మారబోతున్నారు.

కాంగ్రెస్‌: కేడర్‌..లీడర్‌ కరువు
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా ఓ వైపు నిలబడగా, ఖమ్మం జిల్లా ప్రజానీకం మాత్రం మరోవైపు నిలబడింది. ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి అభ్యర్థులు 8 మంది ఇక్కడ విజయం సాధించారు. ఒకరు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, మరొకరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచారు. ఖమ్మం లోక్‌సభ పరిధిలోని కొత్తగూడెం, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందగా, సత్తుపల్లి, అశ్వారావుపేటల్లో కాంగ్రెస్‌ మద్దతుతో టీడీపీ గెలిచింది. వైరాలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి కాంగ్రెస్‌ శ్రేణుల పూర్తి సహకారంతో విజయం సాధించారు. అంటే ఖమ్మం లోక్‌సభ పరిధిలో ఒక్క ఖమ్మం అసెంబ్లీ తప్ప మిగిలిన అన్ని చోట్లా కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఖమ్మంలో కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌పై ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. లోక్‌సభ పరిధిలో పోలైన ఓట్ల ఆధారంగా కూడా కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ కంటే ఆధిక్యత ఉంది. ఈ పరిస్థితుల్లో ఖమ్మం లోక్‌సభ పరిధిలో తమ విజయం నల్లేరు మీద నడకే అని రాజకీయ వర్గాలు భావించాయి. కానీ, రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది.

కాంగ్రెస్‌ రెబల్‌ లావుడ్యా రాములు నాయక్‌ (వైరా), కొత్తగూడెం, పాలేరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్‌రెడ్డి, సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిపోయారు. తాజాగా కాంగ్రెస్‌ కీలకనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా పార్టీ వీడిపోవడంతో ఆ ప్రభావం కూడా రేణుక విజయావకాశాలపై పడనుంది. ప్రస్తుతం మధిర, అశ్వారావుపేటల్లో మాత్రమే కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు మిగిలారు. ఆ రెండు స్థానాలు తప్ప అన్నిచోట్లా ఎమ్మెల్యేలు, నేతలు టీఆర్‌ఎస్‌ గూటికి చేరడంతో కాంగ్రెస్‌ కకావికలమైంది. కనీసం ప్రచారానికి, పోలింగ్‌ వ్యవస్థ నిర్వహణకు కేడర్‌ లేక కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితుల్లో అధిష్టానంతో పోరాడి మరీ టికెట్‌ తెచ్చుకున్న రేణుకాచౌదరి గెలుపు కోసం కష్టపడుతున్నారు. నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్న కొంతమంది నేతలు, కేడర్‌ను ఉత్తేజితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఖమ్మం లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్‌ ప్రచారం నియోజకవర్గ స్థాయి సమావేశాల వరకు మాత్రమే వచ్చింది.

ఏడాదికి  మూడు నెలలే పని– రాజు, జ్యూస్‌ వ్యాపారి, అశ్వారావుపేట
జ్యూస్‌ వ్యాపారం ఏడాది మొత్తానికి మూడు నెలలే ఉంటుంది. మిగిలిన 9 నెలలు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. మాలాంటి సీజనల్‌ వ్యాపారులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలి. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం మంచి విధానాలు రూపొందించాలి. అలాంటి వారికే మా ఓటు వేస్తాం.

మాలాంటోళ్లకష్టాలు తీరిస్తే బాగుండు– పానుగంటి నర్సింహారావు, సత్తుపల్లి
ఎర్రని అగ్గిలో కూడా పని చేయాల్సిందే.. ఎండా లేదు.. వానా లేదు.. పగలస్తమానం కష్టపడితేనే కడుపునిండేది. మా గురించి అసలు ఎవరూ పట్టించుకోవటం లేదు. పని ఉంటే తింటున్నాం.. లేకపోతే పస్తులుండాల్సిందే. గతంలో మా కమ్మర కులం ఎస్టీలో ఉండేది. ఇప్పుడు తీసేశారు. మళ్లీ ఎస్టీలో చేర్చితేనే మా బతుకులు బాగుపడతాయి.

చిరువ్యాపారులకు ఆసరా కావాలి– జోజి, కొబ్బరి బోండాల వ్యాపారి, వైరా
మాలాంటి చిరు వ్యాపారులను ప్రభుత్వాలు ఆదుకోవాలి. అధికార పార్టీకి దగ్గర ఉన్న వారికి, పలుకుబడి ఉన్న వారికే ప్రభుత్వ సాయం, రుణాలు అందుతున్నాయి. మాలాంటి వారిని పట్టించుకున్న వారే లేరు. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు.

రుణాలు ఇచ్చి ఆదుకోవాలి– అక్కిరాజు శివకృష్ణ, పండ్ల వ్యాపారి, సత్తుపల్లి
మా కుటుంబం అంతా పండ్లు, కొబ్బరి బోండాల వ్యాపారంపైనే ఆధారపడి బతుకుతున్నాం. 30 ఏళ్లుగా ఇదే వృత్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. వడ్డీలకు తెచ్చి వ్యాపారాలు చేస్తున్నాం.. ఏం మిగలడం లేదు. అప్పు తీర్చడానికే సరిపోతుంది. మాలాంటోళ్లకు బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తే కొంతలో కొంత కష్టం తీరుతుంది.

పార్టీలు మారడం తప్ప ప్రజలకేం ఒరిగేది లేదు– ఖాజా, టీ వ్యాపారి
నా టీకొట్టు దగ్గరకు వచ్చే నాయకులు, కార్యకర్తలు రోజుకో పార్టీ కండువా కప్పుకొని వస్తున్నారు. ఇదేమిటంటే మా ఎమ్మెల్యే పార్టీ మారాడు.. మా ఎంపీ పార్టీ మారాడు.. మేమూ మారిపోయామంటున్నారు. ఒక ఎన్నికల్లో పోటాపోటీగా తిరిగిన వారు కలిసి తిరుగుతున్నారు. ప్రజలే అమాయకులు.. వీరి స్వార్థం కోసం ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు.

లోక్‌సభ ఓటర్లు
పురుషులు  7,39,525
మహిళలు    7,73,503
ఇతరులు    66
మొత్తం ఓటర్లు 15,13,094
లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లుఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి,అశ్వారావుపేట, కొత్తగూడెం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement