టీచర్ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థినులు
ఇల్లెందు: మా టీచర్ మాకే కావాలి... టీచర్లు లేకుంటే టీసీలు ఇవ్వండి.. వేరే బడికి వెళ్లిపోతాం.. అంటూ తరగతి గదిలోకి వెళ్లకుండా విద్యార్థినులు బైఠాయించారు. పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థినులు తమ ఉపాధ్యాయుల డిప్యుటేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం పాఠశాల ఆవరణలో బైఠాయించిన విద్యార్థినులు ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ను పాల్వంచకు డిప్యుటేషన్ మీద పంపుతున్నారని, తమకు బోధించే వారు ఉండరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆందోళన చేస్తున్న సమాచారం తెలుసుకున్న ఏటీడీఓ సత్యనారాయణ పాఠశాలకు చేరుకుని విద్యార్థినులతో చర్చించారు. అనంతరం డీడీ జహీరుద్ధీన్‌తో మాట్లాడారు. డిప్యూటేషన్‌పై ఎవరినీ పంపించమని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర, జిల్లా నాయకులు పృధ్వీ, సీతారామారాజు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో ఆరంభం నుంచి అన్నీ సమస్యలే ఉన్నాయన్నారు. ఇదే విషయమై ఐటీడీఏ డీడీ జహీరుద్ధీన్‌ను వివరణ కోరగా పాల్వంచలో విద్యార్థినులు ఎక్కువ ఉండి ఉపాధ్యాయులు లేకపోవటంతో అక్కడికి డిప్యుటేషన్ ఇచ్చామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment