ఇల్లెందు: సమాజం నుంచి విమర్శలు, జనాల నుంచి తేడా చూపులు ఎదురైనా.. కలిసే బతకాలనుకుంది ఆ జంట. కారణంగా.. ఆ జంటలో ఒకరు యువకుడు, మరొకరు ట్రాన్స్‌జెండర్ కావడమే!. మూడు నెలలుగా ఆమెతో సహజీవనం చేస్తున్న ఓ యువకుడు.. చివరకు తన ప్రేమకథను సుఖాంతం చేసుకున్నాడు. పెద్దలను ఒప్పించి వాళ్ల సమక్షంలోనే మూడుముళ్లతో ఒక్కటయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో జరిగిందీ ఘటన.
జయశంకర్ భూపాలపల్లికి చెందిన రూపేశ్‌కు ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన అఖిల(రేవతి) అనే హిజ్రాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. స్నేహం చిగురించి అదికాస్త ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. రహస్యంగా.. ఇల్లెందులోని స్టేషన్‌బస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మూడు నెలలుగా సహజీవనం చేశారు.
చుట్టుపక్కల వాళ్లు ఎన్ని మాటలు అన్నా.. బయట ఇబ్బందులు ఎదురైనా ఆ జంట ఒకరి చెయ్యి మరొకరు వీడలేదు. అయితే, ఇలా ఎంతకాలం తల్లిదండ్రులను మోసం చేయాలి అనుకున్న రూపేశ్.. ధైర్యం తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నాడు. భయంభయంగానే వాళ్లకు చెప్పాడు. ముందు వాళ్లు కంగారుపడ్డారు.. తిట్టారు. అయితే తమ ప్రేమను విప్పి వాళ్లను ఒప్పించాడు. వారు కూడా అంగీకరించడంతో నిన్న(శుక్రవారం, మార్చి 11 2022) రూపేశ్-అఖిలకు ఘనంగా వివాహం జరిగింది. ఎవరు ఎమనుకున్నా.. తమ మనుసులు మంచివని, ఒకరినొకరు అర్థం చేసుకున్నామని, జీవితాంతం ఇలాగే కలిసి ఉంటామని చెబుతోంది ఆ జంట.
Comments
Please login to add a commentAdd a comment