ముందుకు సాగని ‘ఇండోర్’ | new government neglect on indoor stadium | Sakshi
Sakshi News home page

ముందుకు సాగని ‘ఇండోర్’

Published Sat, Jul 26 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 10:52 AM

new government neglect on indoor stadium

ఇల్లెందు : క్రీడారంగాన్ని ప్రోత్సహించాలంటే అందుకు అనువైన సదుపాయాలు అందుబాటులో ఉండాలి. ఇందుకోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికకు అవసరమైన పోటీలు నిర్వహించేందుకు ఇండోర్ స్టేడియం నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లాలో రెండు స్టేడియాల నిర్మాణ పనులు మాత్రమే ప్రారంభం కాగా, మిగిలిన వాటి  పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

  జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక్కో స్టేడియం నిర్మాణానికి రూ.1.10 కోట్ల చొప్పున మంజూరు చేసింది. 2012-13 మార్చిలో స్టేడియాల నిర్మాణానికి పలు చోట్ల స్థలాలను అన్వేషించారు. జిలాల్లో ఖమ్మం, కొత్తగూడెం, వైరాలో ఇప్పటికే ఉన్న స్టేడియాలను అధునికీకరించి, మిగతా నియోజకవర్గాల్లో నూతనంగా నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో పినపాక, మధిర నియోజకవర్గం చింతకానిలో స్థలాలు లభించటంతో   నిర్మాణం చేపట్టారు. ఇక ఇల్లెందు, భద్రాచలం, పాలేరు, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రాల్లో స్థలాలు లభించక పనులు ప్రారంభించ లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వమైనా.. చొరవ తీసుకుని స్టేడియాలను నిర్మిస్తుందా అని క్రీడాభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

 2012-13లో జిల్లాలో ఒక్కో స్టేడియం నిర్మాణానికి రూ. 1.10 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇక ఇప్పటికే నిర్మితమై ఉన్న ఖమ్మం స్టేడియం ఆధునికీకరణకు రూ.20 లక్షలు, కొత్తగూడెంనకు రూ.5 ల క్షలు, వైరాకు రూ.60 లక్షలు మంజూరు చేశారు. మిగితా వాటిలో ఒక్కో స్టేడియం నిర్మాణానికి 5 నుంచి 10 ఎకరాల స్థలం అవసరం కాగా, ఆ భూమి దొరకకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు.

 స్థల సమస్యతోనే నిర్మాణాల్లో జాప్యం : డీఎస్‌ఓ
 ఈ విషయమై జిల్లా డీఎస్‌ఓ కబీర్‌దాస్‌ను వివరణ కోరగా ...చింతకాని, పినపాకలో స్టేడియాలు నిర్మాణంలో ఉన్నట్లు చెప్పారు. మిగతా స్టేడియాల నిర్మాణానికి స్థలాలు లభించకపోవటం సమస్యగా మారిందన్నారు. ఇటీవల నూతన రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన క్రీడల కార్యక్రమంలో ప్రతి పంచాయతీ కేంద్రంలో 2 నుంచి 3 ఎకరాలు, మండల కేంద్రంలో 5 నుంచి 7 ఎకరాలకు తగ్గకుండా స్థలాలు సేకరించాలని జిల్లా వ్యాప్తంగా  రెవెన్యూ  అధికారులకు లేఖలు పంపించిందన్నారు. అయితే నూతన ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే స్టేడియాల నిర్మాణం ఆధారపడి ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement