ఓట్ల మోహం.. తీరని దాహం.. | Water Problems In Velerupaadu | Sakshi
Sakshi News home page

ఓట్ల మోహం.. తీరని దాహం..

Published Wed, Apr 10 2019 9:52 AM | Last Updated on Wed, Apr 10 2019 10:49 AM

Water Problems In Velerupaadu - Sakshi

సాక్షి, వేలేరుపాడు: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఆ గ్రామానికి కాలినడకన నేతలు వెళతారు. గుక్కెడు నీటి కోసం ఆ గ్రామ కొండరెడ్లు పడుతున్న కష్టాలు కళ్లారా చూస్తారు. కష్టాలు తీరుస్తామని హామీలు ఇస్తారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ గ్రామం వైపు కన్నెత్తి చూడకుండా మిన్నకుండి పోతారు. ఇది 50 ఏళ్లుగా నాయకులకు పరిపాటిగా మారింది. వేలేరుపాడు మండలంలోని అటవీ ప్రాంతంలో అత్యంత మారుమూలన ఉన్న కాకిస్‌నూరు గ్రామ దుస్థితి ఇది. ఎలాంటి రహదారి, విద్యుత్‌ సౌకర్యంలేని ఈ గ్రామానికి గోదావరి మార్గం గుండా వెళ్లాల్సిందే. వేలేరుపాడు మండలం టేకుపల్లి దాటాక గోదావరి ఒడ్డునుంచి రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తే పెద్దగుట్టపై ఈ గ్రామం కనిపిస్తుంది. ఇక్కడ 120 కొండరెడ్ల కుటుంబాలు ఉన్నాయి.

గ్రామం ఏర్పడి దాదాపు వందేళ్లు అవుతోంది. గ్రామస్తులు మొదటి నుంచి తాగునీటి కోసం కష్టాలు పడుతూనే ఉన్నారు. గ్రామానికి చేరువలో ఉన్న పాపికొండల కాలువ నీరే వీరికి తాగునీరు. ఈ కాలువ వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఆ సమయంలో నీరంతా బురద రంగులో ఉండటంతో వీరు తాగరు. వర్షం నీటిని మాత్రమే తాగునీరుగా వినియోగిస్తారు. అదెలా అంటే ఓ పలుచటి గుడ్డను నాలుగువైపులా తాళ్లతో కట్టి మధ్యలో రాయి ఉంచుతారు. దాని కింద బిందె పెట్టి నీళ్లు పట్టుకుంటారు. ఆ నీటిని వర్షాకాలం సీజన్‌లో తాగుతారు. ఆ తర్వాత రోజుల్లో పాపికొండల కాలువ నీరు వీరికి దిక్కు. అటవీ ప్రాంతంలో భారీ గుట్టల నడుమ ఆకులు అలమలు పడి పారే  ఈ కాలువ చెలమల్లో నీటిని తోడుకుని తాగుతున్నారు. చెలమల నుంచి నీటి బిందెలతో మహిళలు గుట్టపైకి ఎక్కుతూ పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కలుషిత నీరు తాగడం వల్ల రోగాలబారినా పడుతున్నారు. ఈ గ్రామంలో కనీసం మంచినీటి చేతిపంపు వేయించేందుకు కూడా ఎవరూ ప్రయత్నించిన దాఖలాలు  కూడా లేవు. కొత్త పాలకులు అయినా ఇటుగా దృష్టి సారించాలని వీరంతా కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement