గోపాలపురం పోలింగ్ సిబ్బందికి సూచనలు ఇస్తున్న కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
సాక్షి, గోపాలపురం: ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎన్నికలు నిస్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. స్థానిక వెలుగు పాఠశాలలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి ఆయన తగిన సూచనలు, సలహాలు అందజేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి నిమిషం వరకూ ఎన్నికలు సజావుగా సాగేందుకు సిబ్బంది ప్రయత్నించాలన్నారు. మాక్ పోలింగ్ నిర్వహణ అనంతరం బూత్ ఏజెంట్లు పరిచయం, అనంతరం పోలింగ్ కొనసాగించాలన్నారు. పోలింగ్‌స్టేషన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా సంబంధిత పోలింగ్ అధికారికి గంటలోపు తెలియజేయాలన్నారు. ఈవీఎం, వీవీప్యాట్‌లు మొరాయిస్తే వెంటనే మార్చి పోలింగ్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాధు కరుణకుమారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
పోలింగ్ సామగ్రి పంపిణీ పరిశీలన
చింతలపూడి: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి చింతలపూడి హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఏర్పాట్లను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ బుధవారం పరిశీలించారు. నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.గణేష్‌కుమార్ పోలింగ్ సిబ్బంది విధుల కేటాయింపు వివరాలను తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని పంపిణీ చేస్తున్న తీరు, ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుపై ఆరా తీశారు. ఆయన వెంట తహసీల్దార్ రాజేశ్వరరావు ఉన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి
నిడదవోలు: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పట్టణంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో ఈవీఎంల పంపిణీ కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. నియోజకవర్గంలో ఉన్న 216 పోలింగ్ బూత్‌లలో అవసరమైన సదుపాయాలపై ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.దేవ సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఈవీఎంలు మొరాయిస్తే టెక్నీషియన్లను అందుబాటులో పెట్టుకోవాలని, అవసరమైతే ఇతర పోలింగ్ కేంద్రాలలో అదనంగా ఉన్న ఈవీఎంలను తెప్పించుకుని ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతంపై ఎప్పటికప్పుడు యాప్‌ల ద్వారా సమాచారం అందించాలన్నారు. అదే విధంగా మీడియాకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు.
పోలింగ్ నిర్వహణలో లోపాలకు తావివ్వకూడదు
నరసాపురం: పోలింగ్ నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావివ్వకుండా సజావుగా సాగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నరసాపురం, పాలకొల్లు, ఆచంట, భీమవరం నియోజకవర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకుడు డీసీ నేగి ఆదేశించారు. బుధవారం ఆయన నరసాపురంలో పర్యటించారు. వైఎన్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. పలు పోలింగ్‌బూత్‌లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలు కావాలని సూచించారు. సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్‌బూత్‌కు వచ్చే వారు అందరూ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు. నరసాపురం ఆర్డీఓ ఏఎన్ సలీంఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment