సాక్షి, ఏలూరు టౌన్ : పశ్చిమలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా వినియోగించుకునేందుకు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజలు భయాందోళలనకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇక ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు, రాజకీయపార్టీలు, అధికారులు ఎన్నికల నిబంధనలు విధిగా పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
∙జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, 144 సీఆర్‌పీసీ సెక్షన్ అమలులో ఉన్నందున నలుగురుకి మించి ఒకచోట గుమ్మిగూడి ఉండకూడదు
∙పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు సెల్‌ఫోన్లు తీసుకురాకూడదు
∙మహిళలు, పురుషులు వేర్వేరుగా క్యూలైన్ పాటించి పోలీస్ శాఖతో సహకరించాలి
∙మద్యం సేవించి ఓటు వేయటానికి రాకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు
∙పోలింగ్ కేంద్రానికి ఎలాంటి మారణాయుధాలు తీసుకురాకూడదు. వాటర్‌బాటిల్స్, ఇంకు బాటిల్స్ కేంద్రలోకి నిషేదం
∙రాజకీయపార్టీలకు చెందిన స్టిక్కర్లు, టోపీలు, కండువాలు, జెండాలతో పోలింగ్ కేంద్రానికి రాకూడదు
∙ఓటరు కార్డుపై మీ వివరాలు సరిగా ఉంటే ఓటర్ ఐడీ కార్డుతోనే ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది
∙ఓటరు స్లిప్‌తో ఓటు వేసేందుకు వెళితే ఓటరు ఏదైనా ఒక గుర్తింపుకార్డును విధిగా తీసుకువెళ్లాల్సి ఉంది
∙పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ గుర్తింపు కార్డు, ఫొటోతో కూడిన బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, హెల్త్‌కార్డు, పెన్షన్ డాక్యుమెంట్ తదితర గుర్తింపు కార్డులు
∙పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లైన్ లోపల మాత్రమే ఓటర్లుకు ప్రవేశం ఉంటుంది
∙ఓటు వేసిన వెంటనే పోలింగ్ కేంద్రాన్ని విడిచి వెళ్ళాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రంలో ఉండేందుకు అనుమతి ఉండదు
∙పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల అవతల మాత్రమే ఓటు వేసేందుకు వచ్చేవారి వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంది
∙పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో రాజకీయ పార్టీలకు చెందిన వారు టెంట్లు వంటివి ఏర్పాటు చేసుకుని, చిన్న టేబుల్, రెండు కుర్చీలు ఏర్పాటు చేసుకుని, ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉండాలి, పార్టీలకు చెందిన జెండాలు, బ్యానర్లు ప్రదర్శించకూడదు
∙రాజకీయపార్టీలకు చెందిన వారు పోలింగ్ కేంద్రాల సమీపంలో టెంట్లు ఏర్పాటు చేసి టిఫిన్లు, భోజనాలు వంటివి ఏర్పాటు చేయకూడదు
∙ఓటరు స్లిప్పులు ఇచ్చేవారు వాటిపై ఎటువంటి పార్టీ గుర్తులు, రంగులు, అభ్యర్థి పేర్లు ఉండేలా ఇవ్వకూడదు
∙పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్‌క్యాస్టింగ్ ఉన్నందున ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోబడతాయి
∙ఓటర్లు ఓటు వేసే సమయంలో ఫొటోలు తీయటం, సోషల్‌మీడియాలో పోస్ట్ చేయటం చట్టరీత్యా నేరంగా పరిగణింపబడుతుంది
∙రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను ఏ విధమైన వాహనాల్లోనూ పోలింగ్ కేంద్రానికి తరలించకూడదు
∙ఓటర్లకు మద్యం, డబ్బులు, వస్తువులు పంపిణీ చయటం నేరం, అలా చేస్తే ఇరువురిపైనా నిబంధనల మేరకు చర్యలు తప్పవు
Comments
Please login to add a commentAdd a comment