ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రజలను ఎన్నికల క్రతువులో భాగస్వామ్యం చేస్తోంది. ఇప్పటికే ఓటర్లు హైల్ప్‌లైన్, సీ విజిల్, పీడబ్ల్యూడీ యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఎన్నికల నిర్వహణను కూడా ప్రజలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో ‘మై ఓట్ క్యూ’ పేరుతో కనిపిస్తోంది. వివరాలేంటో తెలుసుకుందాం......
సాక్షి, తాడేపల్లిగూడెం: పోలింగ్ ప్రక్రియకు ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి అడుగు పెట్టింది మొదలు తిరిగి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు పోల్ మేనేజ్‌మెంట్‌ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి అంశాన్ని ‘మై ఓట్ క్యూ’ యాప్‌లో నమోదు చేసి అప్‌లోడ్ చేయాలి. గతంలో ఈ ప్రక్రియ మ్యాన్యువల్‌గా జరిగేది. ఈ ఎన్నికల్లో ఆన్‌లైన్ ద్వారా యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి అధికారిక లాగిన్ ఒకటి, పబ్లిక్ లాగిన్ ఒకటి ఉంటాయి. గోప్యంగా అధికారులకు వెళ్లిన సమాచారం వారి లాగిన్‌లో మాత్రమే కనిపిస్తాయి. మిగిలినవి ప్రజలు చూసేందుకు వీలుగా ఉంటాయి.
గంట గంటకూ అప్‌డేట్
ఓటరు తాను ఓటు వేసే పోలింగ్ కేంద్రంలో ఎంత మంది ఓటర్లు క్యూలైన్లో ఉన్నారో మై ఓట్ క్యూ యాప్‌లో చూసుకోవచ్చు. దీని వల్ల ఓటరు పోలింగ్ కేంద్రం వద్ద ఎక్కువ సమయం క్యూలైన్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. తక్కువ మంది ఉన్నారని గమనిస్తే అప్పుడు ఓటు వేసేందుకు వెళ్లవచ్చు. ప్రిసైడింగ్ అధికారి ఈ యాప్‌లో ప్రతి గంట సమయంలో ఎంతమంది క్యూలైన్‌లో ఉన్నారో తెలియజేస్తారు. ఇది అటు ఎన్నికల సంఘానికి కూడా తెలుస్తుంది. పోల్ మేనేజ్‌మెంట్‌లో ఇదో భాగం.
పోలింగ్ శాతం తెలుసుకోవచ్చు
గతంలో పోలింగ్ శాతం వివరాలను అధికారులు ప్రకటించిన తర్వాత తెలిసేది. ప్రస్తుతం ప్రతి పౌరుడు ఎప్పటికప్పుడు పోలింగ్ శాతం వివరాలు తెలుసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌లో మాక్ పోల్ మొదలు ప్రతి అంశాన్ని పీఓ నమోదు చేస్తారు. పోలింగ్ శాతం ప్రతి గంటకు ఇందులో అందుబాటులో ఉంచనున్నారు. గంట గంటకు పోలింగ్ శాతం కూడా ఈ యాప్‌లో చూసుకోవచ్చు. పోలింగ్ శాతం కోసం ఎదురుచూపులు చూడాల్సిన అవసరం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment