సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఒక వైపు.. అబద్ధపు హామీలు, అందినంత దోచుకోవడం, రౌడీయిజం, నిరుద్యోగం, వేధింపులు... మరోవైపు రాజన్న రాజ్యం, చెప్పిన మాటపై నిలబడటం, మానవత్వం ఉన్న వారు, ప్రజల బాగు కోసం ఆలోచించే వారు... ఎవరు కావాలో ఓటరు తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రజల కోసం... ప్రాంతం కోసం... చేపట్టబోయే ఉన్నతిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించే వారు పాతతరం నాయకులు. అలాంటివారిని ఆదర్శంగా తీసుకొని నైతిక విలువలతో రాజకీయాలు చేసేవారు కొందరైతే, కుట్రలు కుయుక్తులు పన్నుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఓట్లు దండుకునే ఎత్తుగడలకు పాల్పడేవారు మరికొందరు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓటు ఆయుధంతో విజ్ఞులైన ఓటర్లు మెరుగైన తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది.
ప్రగతికి పట్టం కట్టేవారికి ఓటుతో పట్టాభిషేకం చేసేందుకు అవకాశం నేడే. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ మీ ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని సంధించే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. నమ్మి అన్ని సీట్లు గెలిపించిన జిల్లా ప్రజలను అధికార తెలుగుదేశం పార్టీ మోసం చేసింది. ప్రజలకు అధికార పార్టీ నేతలు చుక్కలు చూపించారు. అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు, జన్మభూమి కమిటీల పేరుతో చేస్తున్న అరాచకాలను ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఇసుక దోపిడీతో మొదలైన పాలన ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరించింది. నీరు, మట్టి, ఇసుక అన్నింటిని మింగేశారు. మళ్లీ అధికారం వస్తే గాలిని కూడా వదలరనే భయం సామాన్య ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
గత ఐదేళ్లలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతి పని తమ వాళ్లకు అప్పగించి కమీషన్లు తీసుకోవడంపైనే దష్టి పెట్టారు. ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాను ఒక రౌడీ రాజ్యంగా మార్చేశారు. తమ మాట వినని వారిపై దాడులు, హత్యలకు దిగడమే కాకుండా ఆఖరికి పోలీసులను కూడా తమ పని తాము చేయనివ్వలేదు. అడ్డుకున్న అధికారులపై దాడులు లేదా సస్పెన్షన్లు, వీఆర్ పేరుతో వేధింపులు కొనసాగాయి. తమకు నచ్చిన అధికారులు, తాము చెప్పిన పనులు చేసిన వారు మాత్రమే విధుల్లో కొనసాగగలిగారు. అప్పటి ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై దాడితో మొదలైన రౌడీ రాజ్యం చివరి వరకూ కొనసాగింది. తణుకు ఎమ్మెల్యే ఒక ఎస్‌ఐని నిర్బంధించి కింద కూర్చోపెడితే కేసు పెట్టిన ఎస్‌ఐని కుక్కునూరు బదిలీ చేశారు. ఆ తర్వాత వీఆర్‌కు పంపారు. పోడూరులో తమ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నాడని ఒక ఎస్‌ఐని వీఆర్‌కు పంపే వరకూ నిద్రపోని పరిస్థితి. మరోవైపు ఏలూరులో హత్యా రాజకీయాలు పెరిగిపోయాయి.
పట్టపగలే ఒక న్యాయవాది హత్యకు గురి అయ్యారు. మరోవైపు దెందులూరులో చింతమనేని ప్రభాకర్ అరాచకాలు చెప్పనవసరం లేదు. ఈ ఐదేళ్ల కాలంలో పోలవరం భజన తప్ప జిల్లాకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా సాగలేదు. మొన్నటి వరకూ పట్టిసీమను పట్టుకుని వేలాడిన ప్రభుత్వం ఇప్పుడు పోలవరం భజన చేస్తోంది. నిర్వాసితుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పట్ల వారు ఆగ్రహంగా ఉన్నారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ పేరుతో కోట్ల రూపాయల అవినీతికి తెరలేపారు. ఇక చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ విషయంలో రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కృష్ణా జిల్లాకు ఎక్కువ ధర ప్రకటించిన ప్రభుత్వం ఈ జిల్లా ప్రజలకు మాత్రం అన్యాయం చేసింది. సహజ వనరులు, మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నా పారిశ్రామికంగా వెనకబాటుతనం ఇంకా పోలేదు. కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. పరిశ్రమల కోసం భూమిని సేకరించే పని అడుగు ముందుకు పడలేదు. వ్యవసాయం గిట్టుబాటు అవ్వక రైతాంగం అక్వా వైపు చూస్తుండటంతో జిల్లాలో ఏడు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పటికే మూడు లక్షల ఎకరాల ఆయకట్టు చెరువులుగా మారిపోయింది. అనధికారికంగా రొయ్యల చెరువులు పెద్ద ఎత్తున తవ్వుతుండటంతో వాటిపక్కన ఉన్న పొలాలు కూడా ఉప్పుకయ్యలుగా మారిపోయి పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఇప్పటికీ అమలు కాలేదు.
మరోవైపు చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఐదేళ్లు అయినా ఒక్క పేదవాడికి ఇళ్ల స్థలం దక్కలేదు. పైగా గత ప్రభుత్వాలు ఇచ్చిన స్థలాలను సాకులు చూపి వెనక్కి తీసుకున్నారు. జిల్లాలో మెట్ట రైతులకు ప్రయోజనం చేకూర్చే చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. స్వయంగా 2004లో సీఎం చంద్రబాబు శంకుస్ధాపన చేసిన తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని వైఎస్సార్ హాయాంలో ఎనభైశాతం పనులు పూర్తి చేశారు. గడిచిన ఐదేళ్ల కాలంలో టీడీపీ సర్కారు మిగిలిన ఇరవైశాతం అసంపూర్తి పనులు చేసేందుకు చొరవ చూపలేదు. డెల్టా ఆధునికీకరణ పనులు ఎక్కడివక్కడే పెండింగ్‌లో ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్ల కాలంలో పది నుంచి 15 శాతం వరకు మాత్రమే పనులు పూర్తి అయ్యాయి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసిందేదైనా ఉంటే తమ సొంత ఇల్లు చక్కబెట్టుకోవడమే. కాలువలు, వాగులనూ, ఆఖరికి పోలవరం కుడికాల్వ గట్టుని కూడా వదలకుండా తవ్వేసి గోదావరికి గుండెకోత మిగిల్చారు. గోదావరి కాకుండా తమ్మిలేరు, జల్లేరు వాగులతోపాటు ఎర్రకాలువ, బైనేరు, తూర్పు, పడమర కాలువలను సైతం విడిచిపెట్టకుండా కోట్లు కూడబెట్టుకున్నారు.
మరోవైపు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజన్న పాలన లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వచ్చింది. నిత్యం ప్రజల పక్షాన ఉండి గత ఐదేళ్లలో ప్రత్యేక హోదాతో పాటు పలు ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తూ ప్రజల్లోనే ఉన్నారు. గత ఏడాది మే నెలలో జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తూ వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్ పాదయాత్ర జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పలికింది. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం.. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ అలుపెరగని పోరాటంపై ప్రజల్లో సానుకూలత.. వెరసి జగన్‌కు జనాభివూనం వెల్లివిరిసింది. ఆ పాదయాత్రలో దారిపొడువునా అవ్వాతాతలు, మహిళలు, యువత, పేదలు, రైతులు, చిరుద్యోగులు, వ్యాపారులు, వివిధ కుల వృత్తులవారు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, ఇలా అన్నివర్గాల వారు జగన్‌ను కలిసి తమ సమస్యలు వెళ్లబోసుకున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో తాము పడుతున్న బాధలు, ప్రభుత్వ అవినీతి, కబ్జాలు, ఇసుక దోపిడీ తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్లు, పింఛన్లు ఇవ్వడం లేదని, ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదని, ఉద్యోగాలు లేవని.. తాగు, సాగునీరు అందడం లేదని వాపోయారు. అందరి సమస్యలను ఓపిగ్గా వింటూ.. అందరినీ ఆదుకుంటానని ధైర్యం చెబుతూ జగన్ ముందుకు సాగారు. జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని ఆకివీడులో ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్త మయ్యాయి.
జిల్లాలో వైఎస్ జాడలు
జిల్లాను అభివృద్ధి పథంలో నడపడానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషిని జిల్లా మరువలేదు. ఆయన చనిపోయి పది సంవత్సరాలు గడిచినా ఇంకా జిల్లా ప్రజలు వైఎస్‌ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి అనేక సార్లు జిల్లాకు వచ్చిన మహానేత అడగకుండానే వరాలు ఇచ్చారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాలను కూడా సస్యశ్యామలం చేయాలనే తలంపుతో జిల్లా ప్రజల చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టును నిర్మించడానికి పూనుకున్న ఏకైక నాయకునిగా జిల్లా ప్రజల మనసుల్లో సుస్థిరస్థానం పొందారు. జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో సైతం వైఎస్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేశారు.
తమ్మిలేరు ఏటిగట్టు రివిట్‌మెంట్, వేసవిలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించడానికి సుమారు 100 ఎకరాల సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి వైఎస్ కోట్లాది నిధులు మంజూరు చేశారు. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా యువతకు విద్యావకాశాలు కల్పించాలని తపన పడ్డారు. ఒక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి మహానేత రూ. 600 కోట్లు మంజూరు చేసి చరిత్ర సృష్టించారు. మెట్ట ప్రాంతంలో ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ జంగారెడ్డిగూడెంలో సుమారు రూ.7.54 కోట్ల నిధులతో 100 పడకల ఆసుపత్రి నిర్మించడం ఆయనకు తప్ప వేరెవరికీ సాధ్యం కాదని ఆ ప్రాంత ప్రజలు చెబుతారు. జలయజ్ఞం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేయాలని భావించిన ఆయన పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జిల్లాకు అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకువచ్చి లేసుపార్కును అభివృద్ధి చేశారు.
పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి వద్ద గోదావరి ఏటిగట్టుకు రూ. 20 కోట్లతో రివిట్‌మెంట్ నిర్మించడానికి వైఎస్ తీసుకున్న చొరవ కారణంగా ఆ ప్రాంత ప్రజలు ముంపు బారి నుండి బయటకు పడగలిగారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా వేలాదిమంది ప్రజలు ఆపరేషన్లు చేయించుకోగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా లక్షలాది మంది విద్యార్ధులు ఉన్నత విద్యను అభ్యసించగలిగారు. ఆయన వల్ల లబ్ధి పొందని కుటుంబం ఒక్కటి కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. వైఎస్‌ను గుర్తుకు తెచ్చుకుంటూ జిల్లా ప్రజలు రాజన్న పాలన కోసం తపన పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment