Papi hills
-
పాపికొండల విహారయాత్ర ప్రారంభం..
సాక్షి, తూర్పుగోదావరి : గత 21 నెలలు గా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర తిరిగి ప్రారంభమైంది. గోదావరి నదికి హారతి ఇచ్చి పాపికొండల విహారయాత్ర ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. పాపికొండల విహారయాత్రకు వెళ్లే టూరిజం బోట్ల ట్రయిల్ రన్లో మంత్రి అవంతి పాల్గొన్నారు. కచ్చులూరు దుర్ఘటన, కొవిడ్ పరిస్థితుల కారణంగా పాపికొండల టూరిజం 21 నెలలుగా నిలిపి వేసినట్లు మంత్రి తెలిపారు. రేపటి నుంచి పాపికొండల బోటింగ్‌కు బుకింగ్స్ ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా గండిపోచమ్మ అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. చదవండి: పులిచింతల ప్రాజెక్ట్ వద్ద మరో వివాదం -
ఓట్ల మోహం.. తీరని దాహం..
సాక్షి, వేలేరుపాడు: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఆ గ్రామానికి కాలినడకన నేతలు వెళతారు. గుక్కెడు నీటి కోసం ఆ గ్రామ కొండరెడ్లు పడుతున్న కష్టాలు కళ్లారా చూస్తారు. కష్టాలు తీరుస్తామని హామీలు ఇస్తారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ గ్రామం వైపు కన్నెత్తి చూడకుండా మిన్నకుండి పోతారు. ఇది 50 ఏళ్లుగా నాయకులకు పరిపాటిగా మారింది. వేలేరుపాడు మండలంలోని అటవీ ప్రాంతంలో అత్యంత మారుమూలన ఉన్న కాకిస్‌నూరు గ్రామ దుస్థితి ఇది. ఎలాంటి రహదారి, విద్యుత్ సౌకర్యంలేని ఈ గ్రామానికి గోదావరి మార్గం గుండా వెళ్లాల్సిందే. వేలేరుపాడు మండలం టేకుపల్లి దాటాక గోదావరి ఒడ్డునుంచి రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తే పెద్దగుట్టపై ఈ గ్రామం కనిపిస్తుంది. ఇక్కడ 120 కొండరెడ్ల కుటుంబాలు ఉన్నాయి. గ్రామం ఏర్పడి దాదాపు వందేళ్లు అవుతోంది. గ్రామస్తులు మొదటి నుంచి తాగునీటి కోసం కష్టాలు పడుతూనే ఉన్నారు. గ్రామానికి చేరువలో ఉన్న పాపికొండల కాలువ నీరే వీరికి తాగునీరు. ఈ కాలువ వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఆ సమయంలో నీరంతా బురద రంగులో ఉండటంతో వీరు తాగరు. వర్షం నీటిని మాత్రమే తాగునీరుగా వినియోగిస్తారు. అదెలా అంటే ఓ పలుచటి గుడ్డను నాలుగువైపులా తాళ్లతో కట్టి మధ్యలో రాయి ఉంచుతారు. దాని కింద బిందె పెట్టి నీళ్లు పట్టుకుంటారు. ఆ నీటిని వర్షాకాలం సీజన్లో తాగుతారు. ఆ తర్వాత రోజుల్లో పాపికొండల కాలువ నీరు వీరికి దిక్కు. అటవీ ప్రాంతంలో భారీ గుట్టల నడుమ ఆకులు అలమలు పడి పారే ఈ కాలువ చెలమల్లో నీటిని తోడుకుని తాగుతున్నారు. చెలమల నుంచి నీటి బిందెలతో మహిళలు గుట్టపైకి ఎక్కుతూ పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కలుషిత నీరు తాగడం వల్ల రోగాలబారినా పడుతున్నారు. ఈ గ్రామంలో కనీసం మంచినీటి చేతిపంపు వేయించేందుకు కూడా ఎవరూ ప్రయత్నించిన దాఖలాలు కూడా లేవు. కొత్త పాలకులు అయినా ఇటుగా దృష్టి సారించాలని వీరంతా కోరుతున్నారు. -
గోదావరి గలగలలు...పచ్చందనాల సిరులు
గలగలపారే గోదావరి హొయలు.. పచ్చని పంటపొలాలు.. నలుదిశలా చాటే చారిత్రక వైభవం.. గిరులలోని తరుల సౌందర్యం.. గిరిపుత్రుల జీవనం.. జలపాతాల సోయగం.. కనులారా వీక్షించాలంటే తూర్పుకు పరుగులు తీసే గోదావరి వైపుగా మన అడుగులూ కదలాలి. తూర్పుగోదావరి జిల్లాకు కాకినాడ ముఖ్యపట్టణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లాలో గోదావరి జీవనవేదాన్ని కళ్లకు కడుతుంది. దేశంలోనే 2వ అతిపెద్ద కోస్తా తీరం ఈ జిల్లాలోనే ఉంది. ప్రకృతి మనోహర దృశ్యాలకు పరవశిస్తూ, చారిత్రక వైభవాలను తెలుసుకుంటూ ప్రకృతి ఒడిలో కొత్త ఉత్సాహాన్ని నింపుకోవడానికి బయల్దేరే పర్యాటకులు గోదావరి ఇసుకుతిన్నెలపై మరచిపోలేని అనుభూతులెన్నో మూట గట్టుకొని వెళ్లచ్చు. తూర్పుగోదావరి ప్రాంతంలో అతి ముఖ్యమైన 16 ప్రదేశాలను తిలకించడానికి కనీసం ఐదు పగళ్లు, నాలుగు రాత్రుళ్లు కేటాయించాలి. హైదరాబాద్ నుంచి 564 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. మొదటి రోజు: దేశంలో ఎక్కడ నుంచైనా రాజమండ్రికి చేరుకొని, అక్కడి హోటల్ గదిలో విశ్రాంతి తీసుకొని, ఉదయం 10గం.కు.. రాజమండ్రిలోని కందుకూరి వీరేశలింగం పుట్టిన ప్రదేశానికి చేరుకొని అక్కడ వితంతు వివాహాలు జరిపిన పెద్ద హాలును సందర్శించాలి. ఆ తర్వాత సెంట్రల్ జైల్, గోదావరి నదీ తీరంలో స్నాన ఘట్టాలు, కడియపులంక నర్సరీ... చుట్టి రావచ్చు. చుట్టుపక్కల 25 నుంచి 30 కి.మీ. దూరంలో గల ఈ ప్రదేశాలన్నీ చూడటానికి కనీసం మూడు గంటలు పడుతుంది. మధ్యాహ్నపు భోజనానికి నదీ తీరంలో గల రెస్టారెంట్‌కి చేరుకుంటే రుచికరమైన శాకాహార/మాంసాహార భోజనం లభిస్తుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 2.00 గంటలకు బయల్దేరి 26 కి.మీ దూరంలోని బుద్ధుడు నడయాడిన ప్రాంతాలు కాపవరం, కోరుకొండను సందర్శించాలి. అక్కడ నుంచి 58 కిమీ దూరంలో కొడవలిలో బౌద్ధ ప్రాంతాలను దర్శించి రాత్రికి తిరిగి రాజమండ్రి చేరుకోవాలి. రెండవ రోజు: ఉదయం 7 గంటలకు పట్టిసీమకు బోటులో బయల్దేరాలి. రాజమండ్రి నుంచి గోదావరి నది మీద బోటులో 40 కి.మీ ప్రయాణిస్తే పాపికొండలు చేరుతాం. పాపికొండల నడము ప్రవహించే నదీ సోయగం కళ్లారా చూడవలసిందే! ఇక్కడే పోలవరం డ్యామ్ ప్రాజెక్ట్ సైట్ ప్రాంతాలు, తూర్పు కనుమల అందాలు, గిరిజనుల గ్రామాలు సందర్శించి, వారి జీవనశైలులను తిలకించవచ్చు. ఇక పేరంటాలపల్లి శివాలయం, ఆశ్రమం సందర్శించి, దగ్గరలోని జలపాతాన్ని వీక్షించాక అటు నుంచి పాపికొండలలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి వెళ్లాలి. బోటులోనే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంకాలం స్నాక్స్, టీ లభిస్తాయి. సాయంత్రం దగ్గరలోని కొల్లూర్‌కు వెళ్లి, ఇసుకతిన్నెలమీద కట్టిన చిన్న చిన్న గుడిసెలలో ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని, గోదావరి అందాలను వీక్షించడం ఎప్పటికీ మరచిపోలేని మధురానుభూతి. మూడవ రోజు: ఉదయం 8:00 గంలకు కొల్లూరు నుంచి దేవీపట్నానికి బోటులో బయల్దేరాలి. ఈ ప్రయాణం కనీసం మూడు గంటలు పడుతుంది. ఇక్కడే రంప జలపాతానికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవాలి. మారేడుమిల్లి హిల్ స్టేషన్ (రంపచోడవరానికి 26 కి.మీ)లోని కాఫీ తోటలు, ఔషధ మొక్కలు, 10 కి.మీ దూరంలో గల పాములేరు అటవీ ప్రాంతం, పులుల స్థావరం, జలపాత అందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరచిపోతుంటారు. వాటిని సందర్శించి, అమృతధార జలపాతానికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లేవారికి ఈ మార్గం ఉల్లాసమైన అనుభూతిని మిగుల్చుతుంది. మారేడుమిల్లిలో టూరిజమ్ టెంట్ల కింద రాత్రి భోజనం చేసి, నక్షత్రాలను లెక్కపెట్టుకుంటూ హాయిగా నిద్రపోవడం మరో తీయని అనుభూతి. నాల్గవ రోజు: ఉదయం 5:00 గం.ల నుంచి పక్షుల కువకువల తో మేల్కొని, వాటిని వీక్షిస్తూ ఆ హాయిని, ఆనందాన్ని గుండెలనిండుగా నింపుకుంటారు పర్యాటకులు. ఇక్కడే అల్పాహారం చేసి, 130 కి.మీ దూరంలో గల బిక్కవోలుకు బయల్దేరాలి. బిక్కవోలులో చాళుక్యుల కాలంలో నిర్మించిన ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. నాటి కళా వైభవాన్ని కళ్లారా వీక్షించి కాకినాడకు గొల్లలమామిడాడ మీదుగా బయల్దేరుతూ పచ్చని పంటపొలాలను చూస్తూ ప్రయాణం కొనసాగించాలి. గంటన్నరలో కాకినాడ చేరుకొని మధ్యాహ్న భోజనం చేసి, అటు నుంచి 26 కి.మీ దూరంలో గల సామర్లకోటకి వెళితే ద్రాక్షారామం చారిత్రక వైభవాన్ని, ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతూ ఆహ్వానిస్తుంది. ఇక్కడ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ దేవాలయాలు అంత్యంత ప్రాముఖ్యం గలవి. వీటిని దర్శించుకొని 18 కి.మీ దూరంలో గల యానాం బయల్దేరాలి. యానాం ఉద్యానాలకు బ్యాంక్. ఇక్కడి పార్కులలో మనోల్లాసాన్ని పొందడంతో పాటు గోదావరి తీరాన గల 19వ శతాబ్దపు చర్చి సందర్శన అత్యంత ప్రధానమైనది. ఆ తర్వాత 28 కి.మీ దూరంలో ఉన్న కాకినాడకు తిరిగి వెళ్లి, రాత్రి అక్కడే బస చేయాలి. ఐదవ రోజు: ఉదయాన్నే రూమ్ చెక్ ఔట్ చేసి, అల్పాహారం ముగించుకొని ఆదుర్రుకు బయల్దేరాలి. కాకినాడ నుంచి 85 కి.మీ ప్రయాణిస్తే రాజోలు తాలూకాలో ఆదుర్రు గ్రామం వస్తుంది. ఇది చారిత్రక ప్రదేశం. ఇక్కడ 1700 ఏళ్ల నాటి బుద్ధుని స్థూపాలు ఉన్నాయి. పురావస్తు శాఖ 1953లో జరిపిన తవ్వకాల్లో నాటి మట్టి పాత్రలు, కుండలు బయటపడ్డాయి. ఇక్కడ మహాస్థూపం ఈ ప్రాంతానికి అతి పెద్ద ఆకర్షణ. రెండు గంటల పాటు ఇక్కడే తిరిగి, నాటి విశేషాలు తెలుసుకోవాలి. అటునుంచి మధ్యాహ్నం 2:00 గంలకు కాకినాడ నుంచి చెన్నైకి, ఇటు హైదరాబాద్‌కూ చేరుకోవచ్చు. ప్రయాణమార్గాలు: తూర్పుగోదావరికి రైలు, రోడ్డు, నీరు, వాయు మార్గాలు ఉన్నాయి. రాజమండ్రి, సామర్లకోటలో రైల్వే జంక్షన్లు. చెన్నై హౌరా రైల్వై లైన్ ఈ జిల్లా మీదుగా వెళుతుంది. రాజమండ్రిలోని ఎయిర్‌పోర్ట్‌కు హైదరాబాద్, చెన్నై, విజయవాడ, బెంగళూర్ల నుంచి చేరుకోవచ్చు. చూడదగిన ప్రాంతాలు 1.రాజమండ్రి పట్టణం సంస్కృతీ సంప్రదాయాలకు, చారిత్రక అంశాలకు ప్రాముఖ్యత 2.కడియపులంక నర్సరీ 3.గోదావరి నదిలో 70 కి.మీ దూరం బోటులో ప్రయాణం. పాపి కొండలు,గిరిజనుల గ్రామాలు, గిరిజనుల జీవనశైలి 4.రంపా, అమృతధార జలపాతాలు, ట్రెక్కింగ్, కాఫీ తోటలు 5.పాములేరు అటవీ సౌందర్యం 6.కాపవరం బుద్ధుని స్థూపానికి దారి 7.కొడవలి బుద్ధుని స్థూపం 8.బిక్కవోలులో వెయ్యేళ్ల నాటి దేవాలయాలు 9.ద్రాక్షారామంలో తూర్పుచాళుక్యుల కాలం నాటి భీమేశ్వరస్వామి దేవాలయం 10. కోరింగ వణ్యప్రాణి సంరక్షణకేంద్రం. 11. ఆదుర్రులో బుద్ధుని స్థూపం ఈ ట్రిప్‌లో దాదాపు 758 కి.మీ. దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అంతా రోడ్డు మార్గమే! ఇందుకోసం స్థానిక బస్సులు, ఆటోలు, కార్లను ఆశ్రయించాల్సి ఉంటుంది. కొంతమంది సభ్యులుగా కలిసి ఈ ప్రాంతాలు చుట్టి రావాలనుకునేవారికి మంచి వినోదం, ఆహ్లాదంతో పాటు విజ్ఞానయాత్రగానూ, చిరకాలం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దాదాపు రూ.10,000/- నుంచి రూ.15,000/- (వారి వారి అవసరాలను బట్టి) ఖర్చు అవుతుంది. - శ్రీను అరవపల్లి, టూర్ గైడ్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజమ్ -
ప్రకృతి మెడలో పచ్చల హారం...
పాపి కొండలు అమాయకపు కొండరెడ్ల ఆచారాలు, గలగలా పారే గోదావరి తల్లి ఒడిలో లాంచీ ప్రయాణం, పచ్చని పండ్ల చెట్లు, ఆనందంగా ఆహ్వానించే గిరిజనులు, అలవోకగా గిరిజనుల చేతిలో తయారైన వెదురు వస్తువులు... ఇన్ని అందాల సమాహారమే పేరంటపల్లి, పాపికొండలు. ఈ ప్రదేశాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఈ అనుభూతులన్నీ కావాలనుకుంటే ఖమ్మం జిల్లాలోని వేలేరుపాడు మండలంలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్ళాల్సిందే. కూనవరం నుంచి లాంచీలో బయలుదేరితే గోదావరి శబరి సంగమం మొదలుకొని పురాతన రామగిరి, వాలి సుగ్రీవ గుట్టలు, పేరంటపల్లి, శివాలయం, పాపికొండలు, కొల్లూరు కాటేజీలను చూడవచ్చు. ప్రశాంతతకు నిలయం ఎన్నో ప్రకృతి అందాలకు పెట్టింది పేరు పేరంటపల్లి. ఇక్కడ 36 కొండ రెడ్ల కుటుంబాలున్నాయి. వీరంతా వెదురు వస్తువుల తయారీతో తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ పనస, జీడిమామిడి తోటలతో పాటు దట్టమైన చెట్లతో నిండిన పచ్చని కొండల నడుమ ప్రశాంతతకు నిలయమైన రామకృష్ణ మునివాటిక ఉంది. నిష్టా నియమాలతో గ్రామంలోని కొండ రెడ్ల మహిళలే ఆశ్రమ బాధ్యతలు నిర్వహిస్తారు. ఎలాంటి కానుకలూ స్వీకరించరు. ఇక్కడ నిశ్శబ్దాన్ని పాటించాలి. జలపాతం గలగలలు ఈ ఆశ్రమానికి దగ్గర్లోనే పారే జలపాతం పర్యాటకులను ఆహ్లాదపరుస్తోంది. ఎక్కడో కొండల్లో నుంచి జాలువారే ఈ జలపాతం మండు వేసవిలో సైతం మంచును తలపిస్తుంది. ఈ నీటిలో పర్యాటకులు స్నానమాచరించి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. రమణీయ గంధం పాపికొండల అందం గోదావరి తల్లి సుడులు తిరుగుతూ... గిరుల నడుమ గలగలా పరుగులు తీసే ప్రదేశమే పాపికొండలు. ఇక్కడ గోదావరి వెడల్పు తక్కువగా ఉంటుంది. మైదాన ప్రాంతంతో మూడు కిలో మీటర్ల మేర వెడల్పుతో విస్తరించి ఉన్న గోదావరి, ఇక్కడ 200 మీటర్ల వెడల్పులోనే ఒదిగిపోతుంది. ఇక్కడ ఎప్పుడూ నీళ్ళు సుడులు తిరుగుతుంటాయి. ఈ ప్రాంతంలో గోదావరికి దారి చూపుతున్నట్లు ఉండే రెండు కొండలనే పాపికొండలుగా పిలుస్తారు. లాంచీ శబ్దం తప్ప మరే శబ్దం ఇక్కడ విన్పించదు. ఈ కొండలను చూస్తే మనసు పరవశించిపోతుంది. సినీ దృశ్యాలు పుష్కలం సినిమాల చిత్రీకరణకు పనికొచ్చే సుందర దృశ్యాలు యాత్రలో పుష్కలంగా కన్పిస్తాయి. ఈ ప్రాంతంలోనే అనేక సినిమాల షూటింగ్‌లు జరిగాయి. అనాటి ‘అందాలరాముడు’, నేటి ‘గోదావరి’, ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’.., ఇంకా అనేక సినిమాలలో ఈ సుందర ప్రకృతి సౌందర్యాలను కెమరాలో బంధిం చారు. సినిమాల్లో చూపించే లాంచీ ప్రయాణాలు ఇక్కడ చిత్రీకరించినవే. అనేక టీవీ సీరియల్స్ చిత్రీకరణ కూడా ఈ ప్రాంతంలో జరుగుతుంటుంది. ఎలా చేరుకోవచ్చంటే... కూనవరానికి 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోచవరం నుంచి లాంచీపై వెళితే రెండు గంటల్లో పేరంటపల్లి చేరుకోవచ్చు. ఖమ్మంజిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో కృష్ణదేవర, కనిష్క, అక్బర్ అనే పేర్లు ఉన్న మూడు లాంచీలు పాపికొండల వరకు తిరుగుతున్నాయి. ఖమ్మంలో విహారి టూర్స్ ద్వారా కూడా టికెట్ బుకింగ్‌లను టూరిజం శాఖ నిర్వహిస్తోంది. పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.150 చొప్పున చెల్లిస్తే పాపికొండల వరకు తీసుకెళ్ళి మరలా భద్రాచలంలో దించుతారు. భోజనంతో పాటు టిఫిన్ కూడా లాంచీలోనే పెడతారు. ఖమ్మంలో టికెట్లు బుక్ చేయాలంటే 9492101066, 9440281518, సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించాలి. భద్రాచలంలో అయితే 9553089342 నెంబర్‌కు సంప్రదించాలి. ప్రతీ వారం టూరిజం శాఖ ప్యాకేజ్ టూర్లు కూడా నిర్వహిస్తోంది. అదే విధంగా వేలేరుపాడు మండలంలోని కొయిదా నుంచి కూడా పడవలు నడుస్తున్నాయి. కొయిదా నుంచి అయితే 45 నిమిషాల్లో పేరంటపల్లి వెళ్ళవచ్చు. వేలేరుపాడు మండలం మీదుగా అయితే సమయం ఆదా అవుతుంది. ఇక్కడి నుంచి కూడా ప్రైవేట్ పడవలు నడుస్తున్నాయి. రాజమండ్రి నుంచి అయితే ఇలా.. తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి నుంచి పాపికొండలకు చేరుకోవాలంటే అక్కడి నుంచి కూడా టూరిజం లాంచీలు, లగ్జరీ బోట్లు తిరుగుతున్నాయి. రాజమండి నుంచి పట్ట్టిసీమ, పోచమ్మగండి మీదుగా పేరంటపల్లి పాపికొండలకు చేరుకోవాలంటే రానూ పోనూ 13 గంటల సమయం పడుతుంది. రాజమండ్రి, పురుషోత్తమ పట్టణం, పట్టిసీమ నుంచి ఏపీ టూరిజం ప్రైవేట్ ఏసీ బోట్లను నడుపుతోంది. ఈ బోట్లలో రానూ పోనూ ప్రయాణానికి ఒక్కొక్కరూ రూ.650 వరకు చెల్లించాలి. ఉదయం 7 గంటలకు రాజమండ్రిలో బయలుదేరితే రాత్రి 9 గంటలకు తిరిగి చేరుస్తారు. ఇక్కడి నుండి 15 ప్రైవేట్ లాంచీలు కూడా తిరుగుతున్నాయి. రాజమండ్రిలో విహారయాత్రనిర్వాహకుల వద్ద టిక్కెట్లు బుక్ చేయాలంటే 9866148177, 9866146177 నెంబర్లను సంప్రదించాలి. పర్యాటకులకు భోజన వసతితో పాటు ఒక రోజు ఉండాలంటే గెస్ట్‌హౌస్ సౌకర్యం కూడా కొల్లూరులో కల్పిస్తారు. - ఎం.ఏ సమీర్ సాక్షి ప్రతినిధి, వేలేరుపాడు ఖమ్మం జిల్లా విశ్రాంతికి వెదురు గుడిసెలు కొల్లూరులో వెదురు బొంగులతో తయారు చేసిన గడ్డి గుడిసెల్లో హాయిగా విశ్రాంతి పొందవచ్చు. వెదురుతో నిర్మించే ఈ హట్స్ పర్యాటకులకు గెస్ట్‌హౌస్‌లుగా మారాయి. వీటిలో ఒక రోజు ఉండాలంటే భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు. ఇక్కడ ఒక్కొక్కరికి రూ.600 చెల్లిస్తే అన్ని వసతులతో ఆతిథ్యం కల్పిస్తున్నారు.