ప్రకృతి మెడలో పచ్చల హారం... | Nature medalopaccala denominator ... | Sakshi
Sakshi News home page

ప్రకృతి మెడలో పచ్చల హారం...

Published Thu, Apr 3 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM

ప్రకృతి మెడలో పచ్చల హారం...

ప్రకృతి మెడలో పచ్చల హారం...

పాపి కొండలు

అమాయకపు కొండరెడ్ల ఆచారాలు, గలగలా పారే గోదావరి తల్లి ఒడిలో లాంచీ ప్రయాణం, పచ్చని పండ్ల చెట్లు, ఆనందంగా ఆహ్వానించే గిరిజనులు, అలవోకగా గిరిజనుల చేతిలో తయారైన వెదురు వస్తువులు... ఇన్ని అందాల సమాహారమే పేరంటపల్లి, పాపికొండలు. ఈ ప్రదేశాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఈ అనుభూతులన్నీ కావాలనుకుంటే ఖమ్మం జిల్లాలోని వేలేరుపాడు మండలంలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్ళాల్సిందే. కూనవరం నుంచి లాంచీలో బయలుదేరితే గోదావరి శబరి సంగమం మొదలుకొని పురాతన రామగిరి, వాలి సుగ్రీవ గుట్టలు, పేరంటపల్లి, శివాలయం, పాపికొండలు, కొల్లూరు కాటేజీలను చూడవచ్చు.
 
ప్రశాంతతకు నిలయం

 
ఎన్నో  ప్రకృతి అందాలకు పెట్టింది పేరు పేరంటపల్లి. ఇక్కడ 36 కొండ రెడ్ల కుటుంబాలున్నాయి. వీరంతా వెదురు వస్తువుల తయారీతో తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ పనస, జీడిమామిడి తోటలతో పాటు దట్టమైన చెట్లతో నిండిన పచ్చని కొండల నడుమ ప్రశాంతతకు నిలయమైన రామకృష్ణ మునివాటిక ఉంది. నిష్టా నియమాలతో గ్రామంలోని కొండ రెడ్ల మహిళలే ఆశ్రమ బాధ్యతలు నిర్వహిస్తారు. ఎలాంటి కానుకలూ స్వీకరించరు. ఇక్కడ నిశ్శబ్దాన్ని పాటించాలి.
 
జలపాతం గలగలలు
 
ఈ ఆశ్రమానికి దగ్గర్లోనే పారే జలపాతం పర్యాటకులను ఆహ్లాదపరుస్తోంది. ఎక్కడో కొండల్లో నుంచి జాలువారే ఈ జలపాతం మండు వేసవిలో సైతం మంచును తలపిస్తుంది. ఈ నీటిలో పర్యాటకులు స్నానమాచరించి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.
 
రమణీయ గంధం  పాపికొండల అందం
 
గోదావరి తల్లి సుడులు తిరుగుతూ... గిరుల నడుమ గలగలా పరుగులు తీసే ప్రదేశమే పాపికొండలు. ఇక్కడ గోదావరి వెడల్పు తక్కువగా ఉంటుంది. మైదాన ప్రాంతంతో మూడు కిలో మీటర్ల మేర వెడల్పుతో విస్తరించి ఉన్న గోదావరి, ఇక్కడ 200 మీటర్ల వెడల్పులోనే ఒదిగిపోతుంది. ఇక్కడ  ఎప్పుడూ నీళ్ళు సుడులు తిరుగుతుంటాయి. ఈ ప్రాంతంలో గోదావరికి దారి చూపుతున్నట్లు ఉండే రెండు కొండలనే పాపికొండలుగా పిలుస్తారు. లాంచీ శబ్దం తప్ప మరే శబ్దం ఇక్కడ విన్పించదు. ఈ కొండలను చూస్తే మనసు పరవశించిపోతుంది.
 
సినీ దృశ్యాలు పుష్కలం
 
సినిమాల చిత్రీకరణకు పనికొచ్చే సుందర దృశ్యాలు యాత్రలో పుష్కలంగా కన్పిస్తాయి.  ఈ ప్రాంతంలోనే అనేక సినిమాల షూటింగ్‌లు జరిగాయి. అనాటి ‘అందాలరాముడు’, నేటి ‘గోదావరి’, ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’.., ఇంకా అనేక సినిమాలలో ఈ సుందర ప్రకృతి సౌందర్యాలను కెమరాలో బంధిం చారు. సినిమాల్లో చూపించే లాంచీ ప్రయాణాలు ఇక్కడ చిత్రీకరించినవే. అనేక టీవీ సీరియల్స్ చిత్రీకరణ కూడా ఈ ప్రాంతంలో జరుగుతుంటుంది.
 
ఎలా  చేరుకోవచ్చంటే...
 
కూనవరానికి 17 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోచవరం నుంచి లాంచీపై వెళితే రెండు గంటల్లో పేరంటపల్లి చేరుకోవచ్చు. ఖమ్మంజిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో కృష్ణదేవర, కనిష్క, అక్బర్ అనే పేర్లు ఉన్న మూడు లాంచీలు పాపికొండల వరకు తిరుగుతున్నాయి. ఖమ్మంలో విహారి టూర్స్ ద్వారా కూడా టికెట్ బుకింగ్‌లను టూరిజం శాఖ నిర్వహిస్తోంది. పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.150 చొప్పున చెల్లిస్తే పాపికొండల వరకు తీసుకెళ్ళి మరలా భద్రాచలంలో దించుతారు. భోజనంతో పాటు టిఫిన్ కూడా లాంచీలోనే పెడతారు. ఖమ్మంలో టికెట్లు బుక్ చేయాలంటే 9492101066, 9440281518, సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించాలి. భద్రాచలంలో అయితే 9553089342 నెంబర్‌కు సంప్రదించాలి. ప్రతీ వారం టూరిజం శాఖ ప్యాకేజ్ టూర్లు కూడా నిర్వహిస్తోంది. అదే విధంగా వేలేరుపాడు మండలంలోని కొయిదా నుంచి కూడా పడవలు నడుస్తున్నాయి. కొయిదా నుంచి అయితే 45 నిమిషాల్లో పేరంటపల్లి వెళ్ళవచ్చు. వేలేరుపాడు మండలం మీదుగా అయితే సమయం ఆదా అవుతుంది. ఇక్కడి నుంచి కూడా ప్రైవేట్ పడవలు నడుస్తున్నాయి.
 
రాజమండ్రి నుంచి అయితే ఇలా..
 
తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి నుంచి పాపికొండలకు చేరుకోవాలంటే అక్కడి నుంచి కూడా టూరిజం లాంచీలు, లగ్జరీ బోట్లు తిరుగుతున్నాయి. రాజమండి నుంచి పట్ట్టిసీమ, పోచమ్మగండి మీదుగా పేరంటపల్లి పాపికొండలకు చేరుకోవాలంటే రానూ పోనూ 13 గంటల సమయం పడుతుంది. రాజమండ్రి, పురుషోత్తమ పట్టణం, పట్టిసీమ నుంచి ఏపీ టూరిజం ప్రైవేట్ ఏసీ బోట్లను నడుపుతోంది. ఈ బోట్లలో రానూ పోనూ ప్రయాణానికి ఒక్కొక్కరూ రూ.650 వరకు చెల్లించాలి. ఉదయం 7 గంటలకు రాజమండ్రిలో బయలుదేరితే రాత్రి 9 గంటలకు తిరిగి చేరుస్తారు. ఇక్కడి నుండి 15 ప్రైవేట్ లాంచీలు కూడా తిరుగుతున్నాయి.  రాజమండ్రిలో విహారయాత్రనిర్వాహకుల వద్ద టిక్కెట్లు బుక్ చేయాలంటే 9866148177, 9866146177 నెంబర్లను సంప్రదించాలి. పర్యాటకులకు భోజన వసతితో పాటు ఒక రోజు ఉండాలంటే గెస్ట్‌హౌస్ సౌకర్యం కూడా కొల్లూరులో కల్పిస్తారు.
 - ఎం.ఏ సమీర్
 సాక్షి ప్రతినిధి, వేలేరుపాడు ఖమ్మం జిల్లా

 
విశ్రాంతికి  వెదురు గుడిసెలు

కొల్లూరులో వెదురు బొంగులతో తయారు చేసిన గడ్డి గుడిసెల్లో హాయిగా విశ్రాంతి పొందవచ్చు. వెదురుతో నిర్మించే ఈ హట్స్ పర్యాటకులకు గెస్ట్‌హౌస్‌లుగా మారాయి. వీటిలో ఒక రోజు ఉండాలంటే భోజనం, వసతి సౌకర్యం కూడా  కల్పిస్తారు. ఇక్కడ ఒక్కొక్కరికి రూ.600 చెల్లిస్తే అన్ని వసతులతో ఆతిథ్యం కల్పిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement