అధ్వానంగా మురికి నీటి కాలువ
బెల్లంపల్లిరూరల్ : బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకోకుండా పోతోంది. మండలంలో పెద్ద గ్రామ పంచాయతీ అయినప్పటికీ కనీస సౌకర్యాలు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకెనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు 6 వేల మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఎంపీపీ సొంత గ్రామమైనా అభివృద్ధి ఏమీ జరగలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అధ్వానంగా రోడ్లు..
గ్రామంలో కొన్నేళ్ల క్రితం నిర్మించిన అంతర్గత రోడ్లు ఇప్పుడు అధ్వానంగా మారాయి. కంకరతేలి, గుంతలుగా మారి నడక సాగించడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వాహన చోదకులు అదుపు తప్పి గుంతలలో పడిన ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని వాడల్లో ఇప్పటి వరకు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. ఎస్సీ కాలనీ, నేతకాని వాడలలో సమస్యలు తీష్ట వేశాయి. మరికొన్ని వాడల్లో మట్టి రోడ్లు వేసినా గుంతలుగా మారాయి. స్ధానిక ప్రజా నిధులు వారి అనుచరుల వాడల్లో మాత్రమే సీసీ రోడ్లు నిర్మించారనే ఆరోపణలు గ్రామస్తులు చేస్తున్నారు.
రోడ్లపైనే మురికి నీరు..
గ్రామంలో మురికి నీరు పారేందుకు డ్రైనేజీ వ్యవస్థ లేదు. అక్కడక్కడ మాత్రమే మురికి నీటి కాలువలు ఉన్నా అవి చెత్తతో నిండడంతో రోడ్లపై మురికి నీరు పారుతోంది. మురికి నీటి కాలువలు నిర్మించక పోవడంతో ఆ మురికి నీరంతా రోడ్లపై పారుతూ కంపు కొడుతోంది. పారిశుధ్యం అస్తవ్యస్తం కావడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందాయి.ఏళ్లు గడుస్తున్నా కాలువల నిర్మాణం జరగడం లేదు.
తాగు నీటి సమస్య తీవ్రం..
గ్రామంలో రెండు ఓవర్ హెడ్ ట్యాంక్‌లు ఉన్నాయి. వీటి ద్వారా గ్రామస్తులకు మంచి నీరందించాల్సి ఉండగా ట్యాంకుల నిర్వాహణ సరిగా చేపట్టడం లేదు. పక్షం రోజులకోసారి క్లోరినేషన్ చేయాల్సి ఉండగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో నీటిలో చిన్న చిన్న పురుగులు వస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామీణులకు తాగునీటిని అందించడంలో ప్రజా ప్రతినిధులకు పట్టింపు లేనట్లు కనిపిస్తోంది. ఎంపీపీ స్వగ్రామంలో ఈ తీరైన సమస్యలు విలయతాండవం చేస్తుండడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్, ఎంపీపీ గ్రామాభివృద్ధికి చిత్తశుద్ధితో వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment