Villages develop
-
నూతన అర్బన్ పాలసీ పై కేసీఆర్ సమీక్ష
-
అర్బన్ పాలసీ అదరాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేనివిధంగా ప్రజలకు పారదర్శకమైన సేవలు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరిగేలా తెలంగాణ నూతన అర్బన్ పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అర్బన్ పాలసీతోపాటు కొత్త రూరల్ పాలసీ, కొత్త రెవెన్యూ పాలసీలను కూడా రూపొందించాలన్నారు. నూతన అర్బన్ పాలసీలో భాగంగా నూతన మున్సిపల్ చట్టం, నూతన కార్పొరేషన్ల చట్టం, నూతన హైదరాబాద్ నగర కార్పొరేషన్ చట్టం తీసుకురావాలని, హెచ్ఎండబ్ల్యూఏతోపాటు ఇతర నగరాల అభివృద్ధి సంస్థల పాలనకు సంబంధించి కూడా కొత్త చట్టం రూపొందించాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లోనే ఈ చట్టాల ముసాయిదా తయారు చేయాలన్న కేసీఆర్... త్వరలోనే అసెంబ్లీని సమావేశపరిచి కొత్త చట్టాలు తెస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర నూతన అర్బన్ పాలసీ రూపకల్పనపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా... అవినీతికి ఏమాత్రం ఆస్కారం కలిగించని విధంగా, అక్రమ కట్టడాలకు ఏమాత్రం వీలులేని విధంగా, పచ్చదనం–పరిశుభ్రత వెల్లివిరిసేలా నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దడానికి ఉపయోగపడే కొత్త చట్టాలు ఉండాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు. ఈ చట్టాల ప్రకారమే నగర పాలన జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. బాధ్యతలను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా చట్టమే కల్పిస్తుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిస్థితిని చక్కదిద్దే బృహత్తర ప్రయత్నంలో కలెక్టర్లు క్రియాశీల బాధ్యత పోషించేలా చట్టంలో నిబంధనలు పెడతామని చెప్పారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు నిధులు ఖర్చు చేయకుండా ఆయా నగరాలు, పట్టణాల ప్రాధాన్యతలు, సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసమే నిధులు వెచ్చించాలన్నారు. మున్సిపాలిటీలకు ఆదాయం రావాలని, వచ్చిన ఆదాయం సద్వినియోగం కావాలని చెప్పారు. రాష్ట్రంలో పద్ధతి ప్రకారం నగర–పట్టణ పాలన సాగేందుకు నూతన పాలసీ, కొత్త చట్టాలు ఉపయోగపడాలని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ఏర్పడిన వెంటనే రాష్ట్ర ప్రాధాన్యతలను గుర్తించాం. సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించుకున్నాం. మంచినీటి సమస్యను తీర్చుకున్నాం. సాగునీటి కోసం ప్రాజెక్టులు కడుతున్నాం. పారిశ్రామికాభివృద్ధి కోసం టీఎస్ ఐపాస్ చట్టం చేసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మరో మెట్టు ఎక్కాలి. దీనికోసం మంచి విధానాలు రావాలి. కొత్తగా పంచాయతీరాజ్ చట్టం చేసుకున్నాం. ఇదే విధంగా రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు కూడా రావాలి. పరిపాలన పారదర్శకంగా, వేగంగా, అవినీతికి ఆస్కారంలేని విధంగా సాగాలి’’అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ సమ్మేళనాలు... తెలంగాణ పల్లెలు పచ్చదనంతో, పరిశుభ్రతతో కళకళలాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు గ్రామాల వికాసానికి పూనుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు గ్రామాల వికాసానికి, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించడానికి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ సమ్మేళనాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు చోట్ల సమ్మేళనాలు నిర్వహిస్తామని, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్పర్సన్లతోపాటు పంచాయతీ కార్యదర్శులు, ఈఓపీఆర్డీలు, ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, సీఈఓలను ఈ సమ్మేళనాలకు ఆహ్వానిస్తామని చెప్పారు. జిల్లా పరిషత్తులను, గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామాల అభివృద్ధికి ఏటా దాదాపు రూ. 7 వేల కోట్లను, ఐదేళ్లలో రూ. 35 వేల కోట్లను ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిధులను సమర్థంగా వినియోగించుకొనే విధంగా స్థానిక సంస్థలు తయారు కావాలని చెప్పారు. గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా తయారు కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలనే విషయంపైనా సమ్మేళనాల్లో చర్చించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. సమ్మేళనాల తరువాత అధికారులతో కూడిన 100 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తామని, అవి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతాయన్నారు. పచ్చదనం, పరిశుభ్రత విషయంలో అలసత్వం ప్రదర్శించినట్లు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో మూడు నెలల్లో మార్పు కనిపించాలన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఇందుకోసం త్వరలోనే హైదరాబాద్‌లో కలెక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలకశాఖ డైరెక్టర్ శ్రీదేవి, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పల్లెలు పచ్చదనంతో, పరిశుభ్రతతో కళకళలాడాలి. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు గ్రామాల వికాసానికి పూనుకోవాలి. -
రమణంపల్లి పునర్నిర్మాణానికి అడుగులు
మాడ్గుల: వంద సంవత్సరాల క్రితం కనుమరుగైన రమణంపల్లి గ్రామం పునర్నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడి నుంచి వివిధ గ్రామాలకు వలస వెళ్లిన వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థ సహకారంతో ముందుకు వస్తున్నారు. మాడ్గుల మండలం సుద్దపల్లి–ఆర్కపల్లి గ్రామాల సమీపంలో రమణంపల్లి గ్రామం ఉన్నట్లు రికార్డుల్లో మాత్రమే పేర్కొనబడి ఉంది. ఆ గ్రామంలో పూర్వం అంటువ్యాధుల బారిన పడడంతో స్థానికులు గ్రామాన్ని వదిలిపెట్టి సుద్దపల్లి, ఆర్కపల్లికి వెళ్లి అక్కడే తలదాచుకుని కాలక్రమేణ ఆయా గ్రామాల్లోనే స్థిరపడ్డారు. అయితే వారు తమ పూర్వీకుల గ్రామాన్ని పునర్నిర్మించుకోవాలనే సంకల్పంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రమణంపల్లి గ్రామం ఉన్న ప్రదేశాన్ని గతంలో గ్రామీణ పునర్నిర్మాణ సంస్థ (వీఆర్ఓ) వారు కొనుగోలు చేసి ఆ సంస్థ ప్రతినిధితో పాటు ఇద్దరు స్థానికుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ స్థలంలో మొదటి విడత 20 మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరికే ఆ సంస్థ ఇళ్లు నిర్మించి ఇచ్చింది. మిగతా వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో లబ్ధి పొందిన కుటుంబాలు సైతం పరిసర ప్రాంతంలో పెద్ద అడవి ఉందన్న భయంతో ఇళ్లలోకి వెళ్లలేదు. దీంతో ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. కాగా, ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. వారి కుటుంబీకుల పేర విరాసత్ కావడంతో సదరు వ్యక్తులు తమ సొంత ఆస్తులుగా భావిస్తూ తమను ఇళ్లకు రానివ్వడం లేదని లబ్ధిదారుల వారసులు ఆరోపిస్తున్నారు. మాకు కేటాయించిన ఇళ్లను అçప్పగించాలి మాకు గతంలో వీఆర్ఓ సంస్థ వారు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. దొంగలు, అడవి జంతువుల బెడదతో పాటు విద్యుత్ సౌకర్యం లేదని మేము ఇళ్లలోకి వెళ్లలేదు. ప్రస్తుతం ఆ భయం లేనందును మాకు కేటాయించిన ఇళ్లలోకి వెళ్తాం. మా ఇళ్లను కొంతమంది కబ్జా చేసుకుని స్థలం తమదేనంటూ బెదిరిస్తున్నారు. –ఏదుల రాములమ్మ, సుద్దపల్లి వారసులకు ఇళ్లు ఇప్పించేందుకు కృషి గతంలో వీఆర్ఓ సంస్థ వారు డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన స్థలంలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఎంపిక చేసిన లబ్ధిదారుల వారసులకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు కృషిచేస్తున్నాం. సంస్థ కొనుగోలు చేసిన భూమికి సంస్థ ప్రతినిధితో పాటు ఇద్దరు వ్యక్తులను గార్డియన్‌గా పెడితే వారి వారసులు భూమి తమదని చెప్పడం విడ్డూరం. గ్రామసభల ద్వారా అర్హులను గుర్తించి సంస్థ సహకారంతో డబుల్బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తాం. – యాచారం వెంకటేశ్వర్లుగౌడ్, సర్పంచ్, సుద్దపల్లి -
ఎన్నాళ్లీ కంకర కష్టాలు
లింగంపేట : ‘దేవుడు వరమిచ్చినా–పూజారి కనికరించడం లేదు’ అన్నట్లుగా మారింది భవానిపేట–కంచుమల్ రోడ్డు దుస్థితి. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు, తండాల రోడ్లకు వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా గుత్తేదారుల అలసత్వం ప్రజలకు శాపంగా మారుతోంది. బంగారు తెలంగాణలో భాగంగా గ్రామాలకు వెళ్లే రోడ్లను బీటీ రోడ్లుగా మారుస్తున్నారు. ఇందులో భాగంగా లింగంపేట మండలంలోని భవానిపేట నుంచి కంచుమల్ మీదుగా గాంధారి మండలం గండివేట్ వరకు ఉన్న రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో స్థానిక ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి రూ.2.20 కోట్లు నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. దశాబ్దాలుగా మరమత్తులకు నోచుకోని రోడ్డు బీటీ రోడ్డుగా మారుస్తున్నారని పలు గ్రామాలు, తండాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కానీ గుత్తేదారు నిర్లక్ష్యంతో ఏడాది దాటినా పనులు పూర్తి కావడం లేదు. కాంట్రాక్టర్ రోడ్డును తవ్వించి దానిపై కంకర వేసి మరిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అభివృద్ధికి నోచుకోని గ్రామాలు లింగంపేట మండల పరిదిలోని భవానిపేట నుంచి గండివేట్ వరకు బీటీ రోడ్డు పూర్తయితే పలు గ్రామాలు అభివృద్ధికి నోచుకుంటాయి. భవానిపేట, జల్దిపల్లి, రాంపూర్, మంబోజిపేట, కంచుమల్, కొండాపూర్, గాంధారి మండలం సీతాయిపల్లి, గండివేట్తో పాటు పలు తండాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఈ రోడ్డు వెంట సుమారు 12 కీలోమీటర్లు ప్రతి రోజు లింగంపేట మండల కేంద్రానికి, ఎల్లారెడ్డికి వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు పనులను ప్రారంభించారు. సంవత్సరం గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. ఎక్కడ వేసిన కంకర అక్కడే ఉండడంతో ప్రతి రోజు వాహనాలు అదుపు తప్పి పడిపోయి ప్రయాణికులు గాయాలపాలవుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు రోడ్డుపై కంకర వేసి వదిలేయడంతో పలు గ్రామాలు, తండాలకు చెందిన గర్భిణులు ప్రతి నెల చెకప్ కోసం అసుపత్రులకు వెళ్లాలంటే, రోగులను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై ప్రయాణం చేసే వాహనాలు సైతం దెబ్బతింటున్నాయని వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం తిరిగే ద్విచక్ర వాహనాలు, ఆటోలు వారం రోజులకే చెడిపోతున్నాయని వాహన దారులు వాపోతున్నారు. రోడ్డు పనులు బాగు చేయాలని అధికారులను, నాయకులను పలుమార్లు కోరినా విసిగించుకుంటున్నారే తప్పా పనులు ప్రారంభించడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు, వాహన చోదకులు కోరుతున్నారు. -
అభివృద్ధికి ఎక్కడ.. ?
బెల్లంపల్లిరూరల్ : బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకోకుండా పోతోంది. మండలంలో పెద్ద గ్రామ పంచాయతీ అయినప్పటికీ కనీస సౌకర్యాలు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకెనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు 6 వేల మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఎంపీపీ సొంత గ్రామమైనా అభివృద్ధి ఏమీ జరగలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధ్వానంగా రోడ్లు.. గ్రామంలో కొన్నేళ్ల క్రితం నిర్మించిన అంతర్గత రోడ్లు ఇప్పుడు అధ్వానంగా మారాయి. కంకరతేలి, గుంతలుగా మారి నడక సాగించడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వాహన చోదకులు అదుపు తప్పి గుంతలలో పడిన ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని వాడల్లో ఇప్పటి వరకు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. ఎస్సీ కాలనీ, నేతకాని వాడలలో సమస్యలు తీష్ట వేశాయి. మరికొన్ని వాడల్లో మట్టి రోడ్లు వేసినా గుంతలుగా మారాయి. స్ధానిక ప్రజా నిధులు వారి అనుచరుల వాడల్లో మాత్రమే సీసీ రోడ్లు నిర్మించారనే ఆరోపణలు గ్రామస్తులు చేస్తున్నారు. రోడ్లపైనే మురికి నీరు.. గ్రామంలో మురికి నీరు పారేందుకు డ్రైనేజీ వ్యవస్థ లేదు. అక్కడక్కడ మాత్రమే మురికి నీటి కాలువలు ఉన్నా అవి చెత్తతో నిండడంతో రోడ్లపై మురికి నీరు పారుతోంది. మురికి నీటి కాలువలు నిర్మించక పోవడంతో ఆ మురికి నీరంతా రోడ్లపై పారుతూ కంపు కొడుతోంది. పారిశుధ్యం అస్తవ్యస్తం కావడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందాయి.ఏళ్లు గడుస్తున్నా కాలువల నిర్మాణం జరగడం లేదు. తాగు నీటి సమస్య తీవ్రం.. గ్రామంలో రెండు ఓవర్ హెడ్ ట్యాంక్‌లు ఉన్నాయి. వీటి ద్వారా గ్రామస్తులకు మంచి నీరందించాల్సి ఉండగా ట్యాంకుల నిర్వాహణ సరిగా చేపట్టడం లేదు. పక్షం రోజులకోసారి క్లోరినేషన్ చేయాల్సి ఉండగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో నీటిలో చిన్న చిన్న పురుగులు వస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామీణులకు తాగునీటిని అందించడంలో ప్రజా ప్రతినిధులకు పట్టింపు లేనట్లు కనిపిస్తోంది. ఎంపీపీ స్వగ్రామంలో ఈ తీరైన సమస్యలు విలయతాండవం చేస్తుండడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్, ఎంపీపీ గ్రామాభివృద్ధికి చిత్తశుద్ధితో వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. -
సగానికిపైగా బడ్జెట్ గ్రామాలకే!
న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. బడ్జెట్లో సగానికిపైగా గ్రామీణ ప్రాంతాలకే కేటాయించారు. వ్యవసాయంతో పాటు గ్రామీణాభివృద్ధి రంగాలకు పెద్దపీట వేశారు. 2018–19కిగాను మొత్తం బడ్జెట్లో సగానికిపైగా.. ఏకంగా 14.34 లక్షల కోట్లను గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర పథకాల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3.17 లక్షల కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మిస్తామని, 51 లక్షల కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. కొత్తగా 1.75 కోట్ల గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తామని, 1.88 కోట్ల టాయిలెట్లు నిర్మిస్తామని ప్రకటించారు. 2018–19లో మొత్తంగా 321 కోట్ల పనిదినాలు కల్పిస్తామన్నారు. ‘‘దేశంలోని గ్రామీణ ప్రాంతా ల్లో గరిష్ట స్థాయిలో జీవనోపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి, వ్యవసాయం, దాని అను బంధ రంగాలు, మౌలిక సదుపాయాలకు భారీ గా నిధులు కేటాయించాం..’’ అని జైట్లీ ప్రకటిం చారు. గ్రామీణాభివృద్ధి శాఖకు గతేడాది కన్నా రూ.7 వేల కోట్లు అదనంగా.. మొత్తం రూ.1.12 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. -
స్వరాజ్యం: మూడూళ్ల ముచ్చట!
అభివృద్ధి అంటే అందరికీ నగరాలు, పట్టణాలే గుర్తొస్తాయి. కానీ 70 శాతానికి పైగా గ్రామాలతో నిండిన భారత దేశంలో పట్టణాల్ని, నగరాల్ని కాస్త అభివృద్ధి చేసేసి.. దేశం ప్రగతి పథంలో నడుస్తోందని చెప్పేస్తే ఎలా? గాంధీజీ అన్నట్లు గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు.. అవి ప్రగతి బాటలో నడిస్తేనే.. దేశం అభివృద్ధి చెందినట్లు! ఐతే ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని చూస్తూ కూర్చుంటే లాభం లేదు! మనం ముందడుగు వేస్తే అభివృద్ధి దానంతటదే నడుచుకుంటూ వస్తుంది. స్వయం కృషితో ప్రగతి పథంలో నడుస్తున్న ఈ మూడు గ్రామాలే అందుకు ఉదాహరణ. కట్టెవాడి... మహారాష్ట్రలోని బారామతికి 9 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ గ్రామం. ఒకప్పుడు ఇది సమస్యల నిలయం. గ్రామంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత.. గుంతలు పడిన రోడ్లు.. కలుషిత నీరు.. ఇలా అన్నీ అసౌకర్యాలే. సామాజిక కార్యకర్త సునేత్ర వాహిని ప్రయత్నం ఆ గ్రామాన్ని సమూలంగా మార్చేసింది. సునేత్ర కొందరు ఔత్సాహికులతో కలిసి గ్రామాన్ని శుభ్రం చేయడానికి పూనుకోవడంతో ఊరి ప్రజల్లో చైతన్యం వచ్చింది. వాళ్లు కూడా తమ వంత పాత్ర పోషించి ప్రగతి పథాన నడిపేందుకు నడుం బిగించారు. ఇప్పుడు ఆ గ్రామంలో ఇంటింటికీ మంచి నీటి సౌకర్యముంది. గ్రామంలోని 700 ఇళ్లకూ మరుగుదొడ్లు ఉన్నాయి. ఇవి కాక 22 పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. రోడ్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా మారాయి. ఎక్కడా చెత్త కనిపించదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఊరిలో చదువుకోని చిన్నారి ఒక్కరూ లేరు. గ్రామంలో వందల సంఖ్యలో చెట్లు నాటి పెంచుతున్నారు. పంచాయతీ నిధులతో పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. కట్టెవాడిలో ప్లాస్టిక్ వాడరు. సోలార్ పవర్ ద్వారా విద్యుత్ అందిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా సివిల్ లా సూట్ ఏర్పాటు చేసుకుని ఇక్కడే సమస్యలు పరిష్కరించుకుంటారు. పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లెక్కరు. ఈ గ్రామాన్ని మహారాష్ట్రలో తొలి పర్యావరణ గ్రామంగా గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక పురస్కారంతో గౌరవించింది. మాలీనాంగ్... దేశ సరిహద్దుల్లో, ఈశాన్య రా్రష్టం మేఘాలయలోని ఓ చిన్న పల్లెటూరు. 2004 వరకు ఈ గ్రామానికి రోడ్డు లేదు. పాఠశాల కూడా లేదు. చెప్పాలంటే గ్రామంలో ఏ సౌకర్యమూ లేదు. ఐతే అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఆ ఊరి సొంతం. ఆ గ్రామంలోని ఓ కొండపైకి ఎక్కి చూస్తే బంగ్లాదేశ్ కనిపిస్తుంది. చుట్టూ అడవి, ఊరి నిండా వెదురు చెట్లు ఎంతో శోభనిస్తాయి. ఈ ప్రత్యేకతలతో తమ గ్రామాన్ని తామే అభివృద్ధి చేసుకోవచ్చని ఆలస్యంగా గ్రహించిన గ్రామస్థులు రంగంలోకి దిగారు. వాళ్లే రోడ్డు వేసుకున్నారు. గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నారు. వారి కృషిని గుర్తించి ప్రభుత్వం కూడా కొంత సహకారమందించింది. ఇప్పుడు మాలీనాంగ్ ఓ పర్యాటక ప్రదేశంగా మారింది. ఈ గ్రామాన్ని సందర్శించాలంటే రూ.50 టికెట్ తీసుకుని వెళ్లాలిప్పుడు. 8వ తరగతి వరకు స్కూలు నిర్మించుకున్న గ్రామస్థులు.. తమ ఇళ్లను కూడా అందంగా తీర్చిదిద్దుకున్నారు. విశేషమేంటంటే.. మాలీనాంగ్ ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పురస్కారం అందుకుంది. పుంసరి... 24 గంటలూ ప్రతి ఇంటికీ ఉచితంగా వైఫై ద్వారా ఇంటర్నెట్ వాడుకునే సౌకర్యం, సీసీ టీవీ కెమెరాలు, వాటర్ ప్రూఫ్ పబ్లిక్ స్పీకర్లు.. రెండు పాఠశాలలు, మినరల్ వాటర్, ఇంకా ఎన్నెన్నో సౌకర్యాలు.. ఇవన్నీ చూస్తే ఏదో ఒక కంపెనీ కాలనీలాగా, ఉద్యోగుల క్వార్టర్స్లాగా అనిపిస్తుంది కదా... కానీ పొరబాటు. ఇవి గుజరాత్‌లోని పుంసరి గ్రామంలో ఉన్న సౌకర్యాలు. గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ సౌకర్యాలు ప్రభుత్వం సమకూర్చినవి కావు. కొన్నేళ్ల క్రితం ఆ ఊరి భూములు కొన్ని ఫ్లాట్లు వేసి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుకు విరాళాలు కూడా కలిపి గ్రామస్థులు సమకూర్చుకున్న సౌకర్యాలు. ప్రభుత్వం నడిపే ఆర్టీసీ బస్సుల్ని నమ్ముకోకుండా.. సొంతంగా బస్సును కూడా ఏర్పాటు చేసుకున్నారు. రోడ్లు వేసుకున్నారు. కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు. హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు రూపాయలిస్తే 20 లీటర్ల మినరల్ వాటర్ దొరుకుతుంది. గ్రామస్థులంతా సోలార్ పవర్ బల్పులు వాడుతూ విద్యుత్ పొదుపు చేస్తున్నారు. అవసరమైనపుడు ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని పుంసరిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దారు పంచాయతీ సభ్యులు. 2012లో పుంసరి దేశంలోనే అత్యుత్తమ పంచాయతీగా రాష్ట్రపతి పురస్కారం గెలుచుకుంది.