స్వరాజ్యం: మూడూళ్ల ముచ్చట! | Villages in the country's powerhouse | Sakshi
Sakshi News home page

స్వరాజ్యం: మూడూళ్ల ముచ్చట!

Published Sun, Mar 23 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

స్వరాజ్యం: మూడూళ్ల ముచ్చట!

స్వరాజ్యం: మూడూళ్ల ముచ్చట!

అభివృద్ధి అంటే అందరికీ నగరాలు, పట్టణాలే గుర్తొస్తాయి. కానీ 70 శాతానికి పైగా గ్రామాలతో నిండిన భారత దేశంలో పట్టణాల్ని, నగరాల్ని కాస్త అభివృద్ధి చేసేసి.. దేశం ప్రగతి పథంలో నడుస్తోందని చెప్పేస్తే ఎలా? గాంధీజీ అన్నట్లు గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు.. అవి ప్రగతి బాటలో నడిస్తేనే.. దేశం అభివృద్ధి చెందినట్లు! ఐతే ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని చూస్తూ కూర్చుంటే లాభం లేదు! మనం ముందడుగు వేస్తే అభివృద్ధి దానంతటదే నడుచుకుంటూ వస్తుంది. స్వయం కృషితో ప్రగతి పథంలో నడుస్తున్న ఈ మూడు గ్రామాలే అందుకు ఉదాహరణ.
 
 కట్టెవాడి... మహారాష్ట్రలోని బారామతికి 9 కిలోమీటర్ల దూరంలో ఉండే ఓ గ్రామం. ఒకప్పుడు ఇది సమస్యల నిలయం. గ్రామంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత.. గుంతలు పడిన రోడ్లు.. కలుషిత నీరు.. ఇలా అన్నీ అసౌకర్యాలే. సామాజిక కార్యకర్త సునేత్ర వాహిని ప్రయత్నం ఆ గ్రామాన్ని సమూలంగా మార్చేసింది. సునేత్ర కొందరు ఔత్సాహికులతో కలిసి గ్రామాన్ని శుభ్రం చేయడానికి పూనుకోవడంతో ఊరి ప్రజల్లో చైతన్యం వచ్చింది. వాళ్లు కూడా తమ వంత పాత్ర పోషించి ప్రగతి పథాన నడిపేందుకు నడుం బిగించారు. ఇప్పుడు ఆ గ్రామంలో ఇంటింటికీ మంచి నీటి సౌకర్యముంది. గ్రామంలోని 700 ఇళ్లకూ మరుగుదొడ్లు ఉన్నాయి. ఇవి కాక 22 పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. రోడ్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా మారాయి. ఎక్కడా చెత్త కనిపించదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఏర్పాటు చేసుకున్నారు.
 
 ఊరిలో చదువుకోని చిన్నారి ఒక్కరూ లేరు. గ్రామంలో వందల సంఖ్యలో చెట్లు నాటి పెంచుతున్నారు. పంచాయతీ నిధులతో పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. కట్టెవాడిలో ప్లాస్టిక్ వాడరు. సోలార్ పవర్ ద్వారా విద్యుత్ అందిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా సివిల్ లా సూట్ ఏర్పాటు చేసుకుని ఇక్కడే సమస్యలు పరిష్కరించుకుంటారు. పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లెక్కరు. ఈ గ్రామాన్ని మహారాష్ట్రలో తొలి పర్యావరణ  గ్రామంగా గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక పురస్కారంతో గౌరవించింది.
 
 మాలీనాంగ్... దేశ సరిహద్దుల్లో, ఈశాన్య రా్రష్టం మేఘాలయలోని ఓ చిన్న పల్లెటూరు. 2004 వరకు ఈ గ్రామానికి రోడ్డు లేదు. పాఠశాల కూడా లేదు. చెప్పాలంటే గ్రామంలో ఏ సౌకర్యమూ లేదు. ఐతే అద్భుతమైన ప్రకృతి సౌందర్యం ఆ ఊరి సొంతం. ఆ గ్రామంలోని ఓ కొండపైకి ఎక్కి చూస్తే బంగ్లాదేశ్ కనిపిస్తుంది. చుట్టూ అడవి, ఊరి నిండా వెదురు చెట్లు ఎంతో శోభనిస్తాయి.
 
 ఈ ప్రత్యేకతలతో తమ గ్రామాన్ని తామే అభివృద్ధి చేసుకోవచ్చని ఆలస్యంగా గ్రహించిన గ్రామస్థులు రంగంలోకి దిగారు. వాళ్లే రోడ్డు వేసుకున్నారు. గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నారు. వారి కృషిని గుర్తించి ప్రభుత్వం కూడా కొంత సహకారమందించింది. ఇప్పుడు మాలీనాంగ్ ఓ పర్యాటక ప్రదేశంగా మారింది. ఈ గ్రామాన్ని సందర్శించాలంటే రూ.50 టికెట్ తీసుకుని వెళ్లాలిప్పుడు. 8వ తరగతి వరకు స్కూలు నిర్మించుకున్న గ్రామస్థులు.. తమ ఇళ్లను కూడా అందంగా తీర్చిదిద్దుకున్నారు. విశేషమేంటంటే.. మాలీనాంగ్ ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పురస్కారం అందుకుంది.
 
 పుంసరి... 24 గంటలూ ప్రతి ఇంటికీ ఉచితంగా వైఫై ద్వారా ఇంటర్నెట్ వాడుకునే సౌకర్యం, సీసీ టీవీ కెమెరాలు, వాటర్ ప్రూఫ్ పబ్లిక్ స్పీకర్లు.. రెండు పాఠశాలలు, మినరల్ వాటర్, ఇంకా ఎన్నెన్నో సౌకర్యాలు.. ఇవన్నీ చూస్తే ఏదో ఒక కంపెనీ కాలనీలాగా, ఉద్యోగుల క్వార్టర్స్‌లాగా అనిపిస్తుంది కదా... కానీ పొరబాటు. ఇవి గుజరాత్‌లోని పుంసరి గ్రామంలో ఉన్న సౌకర్యాలు. గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ సౌకర్యాలు ప్రభుత్వం సమకూర్చినవి కావు.
 
 కొన్నేళ్ల క్రితం ఆ ఊరి భూములు కొన్ని ఫ్లాట్లు వేసి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుకు విరాళాలు కూడా కలిపి గ్రామస్థులు సమకూర్చుకున్న సౌకర్యాలు. ప్రభుత్వం నడిపే ఆర్టీసీ బస్సుల్ని నమ్ముకోకుండా.. సొంతంగా బస్సును కూడా ఏర్పాటు చేసుకున్నారు. రోడ్లు వేసుకున్నారు. కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు. హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు రూపాయలిస్తే 20 లీటర్ల మినరల్ వాటర్ దొరుకుతుంది. గ్రామస్థులంతా సోలార్ పవర్ బల్పులు వాడుతూ విద్యుత్ పొదుపు చేస్తున్నారు. అవసరమైనపుడు ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని పుంసరిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దారు పంచాయతీ సభ్యులు. 2012లో పుంసరి దేశంలోనే అత్యుత్తమ పంచాయతీగా రాష్ట్రపతి పురస్కారం గెలుచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement