సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉంటూ సంఘటిత, అసంఘటిత రంగాల్లో కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రధాన నగరాలు కరోనా గుప్పిట చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఈ ఏడాది జనవరి చివరి వారంలో దేశంలో తొలి కరోనా కేసు నమోదు కాగా... ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఈ వైరస్ విస్తరించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులతో పాటు ప్రధాన నగరాలు ఇంచుమించు రెడ్‌జోన్ పరిధిలోకి చేరుతున్నాయి. ప్రధాన నగరాలు కరోనా వ్యాప్తికి కారకాలుగా మారుతుండటంతో కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య, మున్సిపల్, పోలీస్ విభాగాలు కరోనాను రూపుమాపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రథమ శ్రేణి నగరాల్లోనే అత్యధికం...
దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్యను విశ్లేషిస్తే దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబై, చెన్నై, అహ్మదాబాద్, పుణే, హైదరాబాద్, బెంగళూర్ వంటి ప్రధాన నగరాల్లోనే 40 శాతం కేసులు పాజిటివ్‌గా తేలాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పరంగా చూస్తే ముంబై అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానంలో.. హైదరాబాద్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి. వీటితో పాటు భోపాల్, ఆగ్రా, జైపూర్, సూరత్‌లోనూ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. దేశంలో నమోదైన కేసుల్లో 52 శాతం పైగా కేసులు 13 నగరాల్లోనే నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కట్టడి చేసేందుకు తంటాలు...
కరోనా కట్టడికి దేశంలో 170 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం హాట్‌స్పాట్‌లుగా గుర్తిం చింది. వీటితో పాటు కొన్ని ప్రధాన నగరాలను కూ డా రెడ్‌జోన్లుగా ప్రకటిస్తూ... బయటపడేందుకు అనురించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా కేసులు బయటపడిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి... కరోనా విస్తరించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టం చేస్తున్నాయి. అయితే ప్రధాన నగరాల్లో విచ్చలవిడిగా పట్టణీకరణ జరగడం, జనసాంద్రత, జనసంచారం ఎక్కువగా ఉండటంతో వైరస్ అదుపులోకి రావడంలేదు. దీంతో భౌతిక దూరం, కంటైన్మెంట్, లాక్‌డౌన్ మినహా మరో మార్గం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
ప్రపంచమంతా ఇదే పరిస్థితి...
కరోనా కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లోనూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితినే సృషిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్, చికాగో, డెట్రాయిట్, వాషింగ్టన్ డీసీ తదితర నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితోపాటు యూరప్‌కు చెందిన లండన్, మిలాన్, రోమ్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment