సాక్షి, హైదరాబాద్ : ‘కికీ చాలెంజ్ వల్ల మీ జీవితాలే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఎవరు ఈ కికీ చాలెంజ్‌ను తీసుకోవద్దు. కికీ చాలెంజ్ అంటూ డ్యాన్స్ చేసినా, దీనికి సంబంధించిన వీడియోలను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసినా కఠిన చర్యలు తప్పవం’టూ హెచ్చరించారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. నేరాల నియంత్రణలో భాగంగా ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్’ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణలో నేరాల నియంత్రణ కోసం నూతన సాఫ్ట్‌వేర్ ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్’ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగా దాదాపు లక్ష ఫోటోలను ఈ సిస్టంలో అప్‌లోడ్ చేస్తున్నాం. పాత నేరస్తుల వివరాలను, వారి ఫింగర్ ప్రింట్స్ వివరాలను కూడా డేటా బేస్ ద్వారా ఈ సిస్టమ్‌లో పొందుపరుస్తాం. ఫలితంగా నేరస్తులను గుర్తుపట్టడం తేలిక అవుతుంది.
మిస్సింగ్ కేసులు, క్రిమినల్ కేసులు, గుర్తు తెలియని వ్యక్తులకు సంబంధించిన నేరాలను త్వరితగతిన పరిష్కరించడానికి ఈ టెక్నాలజీ ఎంతో సహకరిస్తుంది. ఇక మీదట తెలంగాణలో నేరం చేయాలంటే ఎవరైనా భయపడాల్సిందే. నేరాలను అదుపు చేయడానికి ఈ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుంది’.
దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ పోలీస్ శాఖ ఈ ‘ఫేషియల్ రేకగ్నైజేషన్ సిస్టమ్’ను ఏర్పాటు చేస్తుందని మహేందర్ రెడ్డి తెలిపారు. నేటి నుంచే ‘టీఎస్ కాప్’ యాప్‌కు ఈ సిస్టమ్‌ను అనుసంధానం చేస్తున్నామన్నారు. అంతేకాక త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టిగేషన్ అధికారులందరికి ఈ సిస్టమ్ గురించి శిక్షణ ఇచ్చి వాడుకలోకి తీసుకొస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment