ముఖాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్!
Published Sat, Aug 17 2013 2:12 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా సొల్యూషన్స్ రంగంలో ఉన్న అమెరికా కంపెనీ వాయిస్ ఆఫ్ బిగ్‌డేటా(వీవోబీడీ) వ్యక్తులను కచ్చితంగా గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఫేషియల్ సిగ్నేచర్ పేరుతో రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్ పనితీరును ప్రస్తుతం అంచనా వేసే పనిలో కంపెనీ నిమగ్నమైంది. అక్టోబరులో అమెరికాలో అందుబాటులోకి తీసుకొస్తామని, ఆ తర్వాత భారత్‌లో ప్రవేశపెడతామని కంపెనీ సీఈవో శ్రీనివాస్ కిషన్ తెలిపారు. వాయిస్ ఆఫ్ బిగ్‌డేటా కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సందర్భంగా శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.
ఫేషియల్ సిగ్నేచర్‌తో 80-90 శాతం కచ్చితత్వం ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటికే అమర్చిన కెమెరాలతోనూ ఇది సాధ్యపడుతుందని వివరించారు. పోలీసు రికార్డుల్లో ఉన్న ఒక నేరస్తుడు ఏదైనా ప్రదేశానికి వెళ్లినప్పుడు అతన్ని సులభంగా గుర్తించి అప్రమత్తం చేసేందుకు దోహదం చేస్తుందని వివరించారు. ఇక దుకాణాల్లో అయితే కస్టమర్ ఏ వస్తువులను కొంటున్నారు, ఏ వస్తువుల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు, అతను/ఆమె తరచూ వచ్చే కస్టమరా? వంటి విషయాలు ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. భారత్‌లో పేటెంటు కోసం దరఖాస్తు చేశామని, అమెరికాలోనూ దాఖలు చేయనున్నామని పేర్కొన్నారు.
Advertisement