ఫేక్‌ ఓటర్లకు ‘ఫేషియల్‌’ చెక్‌! | Facial Recognition System In Municipal Elections | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ఓటర్లకు ‘ఫేషియల్‌’ చెక్‌!

Published Fri, Jan 17 2020 3:23 AM | Last Updated on Fri, Jan 17 2020 11:18 AM

Facial Recognition System In Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతికతను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు తెలంగాణ వేదిక కానుంది. ఎన్నికల్లో దొంగ ఓట్లు, బోగస్‌ ఓట్లకు అడ్డుకట్ట వేయడం అనేది ఒక సమస్యగా మారిన విషయం తెలిసిందే. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా పరిమితంగా కొన్ని పోలింగ్‌ బూత్‌ల్లో అర్హులైన ఓటర్ల గుర్తింపునకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నా లజీ ఉపయోగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) నిర్ణయించింది. మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం కొంపల్లి మున్సిపాలిటీలోని పది పోలింగ్‌స్టేషన్లలో పోలింగ్‌ సందర్భంగా ఈ టెక్నాలజీని ఎస్‌ఈసీ పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలుచేయనుంది. ఇందులో వచ్చే ఫలితాలను బట్టి భవిష్యత్‌లో జరిగే వివిధ ఎన్నికల్లో ఈ సాంకేతికను ఉపయోగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏం చేస్తారు? 
పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్న కొంపల్లి మున్సిపాలిటీల్లోని ఎంపిక చేసిన 10 వార్డుల్లోని ఫొటో ఓటర్ల జాబితాలను డౌన్‌లోడ్‌ చేసుకుని అందుబాటులో పెట్టుకుంటారు. ఓటేసేందుకు వచ్చే వారిని స్మార్ట్‌ఫోన్‌ లేదా ట్యాబ్‌తో ఫొటో తీస్తారు. అనంతరం ఫేషియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ యాప్‌లో ఈ ఫొటోలను ఓటర్ల డేటాబేస్‌తో సరిచూస్తారు

 ఓటర్‌ ఫొటో దానితో మ్యాచ్‌ అయితే ఓటేసేందుకు అనుమతిస్తా రు. ఈ పైలెట్‌ ప్రాజెక్టు కోసం పది బూత్‌ల ఎంపికతో పాటు పదిమంది పోలింగ్‌ ఆఫీసర్లకు ఈ సాంకేతికతను ఉపయోగించేందుకు శిక్షణ ఇస్తామని ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ సాక్షికి తెలిపారు.

మూడు సాంకేతికతల కలబోత... 
‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌ డేటా, మెషిన్‌ లెర్నిం గ్‌ అండ్‌ డీప్‌ లెర్నింగ్‌’లను ఉపయోగించి ఈ మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్‌ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌) ఈ యాప్‌ను రూపొందించింది. సెల్ఫీ లేదా లైవ్‌ ఫొటో తీసుకోవడం ద్వారా లైవ్‌ అథెంటికేషన్, పేరు, చిరునామా, ఇతర డెమోగ్రాఫిక్‌ వివరాలతో, డేటాబేస్‌లోని 10, 15 ఏళ్ల క్రితం నాటి ఫొటోతో మ్యాచ్‌ చేస్తే ఈ వివరాలున్న వ్యక్తి సెల్ఫీ దిగిన వ్యక్తి ఒకరే అనే అథెంటికేషన్‌ వస్తుంది.

ఈ విషయంలో మనుషుల ప్రమేయం లేకుండా సిస్టమే అన్నీ చేస్తుంది. మూడు సంస్థలు వేర్వేరుగా రూపొందించిన సాంకేతికతలను ఒకచోట చేర్చి వాటిని టీఎస్‌టీఎస్‌ ఆధ్వర్యంలో మొబైల్‌యాప్‌తో అనుసంధానించారు. ప్రస్తుతం దీనిని కొంతమేరకు ట్రెజరీ విభాగం రిటైరైన ఉద్యోగుల పెన్షన్‌ విషయంలో లైవ్‌ అథెంటికేషన్‌ కోసం ఉపయోగిస్తుండగా, ఈ విభాగంలో మరింత విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించారు.

తాజాగా ఆసరా పింఛన్ల విషయంలోనూ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలించారు.  కొన్ని నెలల క్రితం సంగారెడ్డి జిల్లా కందిమండలం ఎద్దుమైలారం గ్రామంలో ఈ మొబైల్‌యాప్‌ను ఒక పైలెట్‌ ప్రాజెక్టు రూపంలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ పైలెట్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో విజయవంతం కావడంతో ఆసరా పింఛన్ల చెల్లింపునకు దీనిని విస్తృతస్థాయిలో ఉపయోగించాలనే ఆలోచనతో పంచాయతీరాజ్‌ శాఖ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement