సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సిబ్బంది అందరూ మున్సిపల్ ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) విజ్ఞప్తి చేసింది. తమ టీ–పోల్ సాఫ్ట్‌వేర్ tsec.gov.inలో మున్సిపల్ ఎన్నికల సిబ్బంది తమ వివరాలు నమోదు చేసుకొని పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని (ఫారం–12) పొందవచ్చని తెలిపింది. ఈ ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత రిటర్నింగ్ అధికారికి నిర్ణీత సమయానికి సమర్పించి, తదుపరి తమ పోస్టల్ పత్రాన్ని పొందే వరకు పర్యవేక్షించుకోవచ్చని తెలిపింది.
పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని పొందేందుకు సిబ్బంది తమ ఆర్వోలు/ మున్సిపల్ కమిషనర్ నుంచి ఫారం–12ను పొంది, అందులో వివరాలను పొందుపరచి వారికి సమర్పించాక.. వారికి పోస్ట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని పంపుతారని తెలియజేసింది. దానిపై సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకుని నిర్ణీత కవర్‌లో పెట్టి కౌంటింగ్ మొదలయ్యేలోగా రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని సూచించింది. గతేడాది జరిగిన పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించిన సిబ్బంది చాలా తక్కువ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్‌ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నందున, మున్సిపల్ ఎన్నికల్లో సిబ్బంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకోవాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment