'త్వరలోనే మొత్తం కంచె వేసేస్తాం'
అశోక్ నగర్(పశ్చిమ బెంగాల్): త్వరలోనే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచెను పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. బంగ్లా సరిహద్దు నుంచి అక్రమంగా భారత్లోకి చొరబాట్లు ఎక్కువవుతున్న నేపథ్యంలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో ఈ పని వేగవంతచేసేందుకు ప్రణాళికను పూర్తిచేస్తున్నామని చెప్పారు.
గురువారం బెంగాల్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ నకిలీ ఇండియా కరెన్సీని, మత్తుపదార్థాల రవాణాను, అక్రమ చొరబాట్లను తగ్గించడంలో భారత్కు సహకరించాలని తాము బంగ్లాదేశ్ను కోరినట్లు చెప్పారు. భారత్-బంగ్లా సరిహద్దులో కేవలం ఫెన్సింగ్ మాత్రమే కాకుండా ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు.
తాము బంగ్లాదేశ్ తో ఎంతమంచి సంబంధాలు నెరుపుతామో మున్ముందు మరింత చూస్తారని, ఇప్పటికే సరిహద్దు వెంట జరుగుతున్న అక్రమాలను నిలువరించేందుకు బంగ్లాదేశ్ భారత్ కు ఎంతో సహాయం చేస్తుందని, ఈ ఒక్క విషయం భారత దౌత్య విధానానికి నిదర్శనం అని చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వలస వచ్చిన మైనారిటీలకు ఇప్పటి వరకు సామాజిక భద్రత లేదని, త్వరలోనే వారికి భారత పౌరసత్వం ఇచ్చే పనిప్రారంభిస్తామని చెప్పారు.