మా మార్గదర్శకాలు మంచివే!
మా మార్గదర్శకాలు మంచివే!
Published Tue, Feb 25 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM
సాక్షి, న్యూఢిల్లీ: నర్సరీ అడ్మిషన్లకు సంబంధించి తాను జారీ చేసిన మార్గదర్శకాలను లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్‌జంగ్ సమర్థించుకున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. నర్సరీ అడ్మిషన్లలో మేనేజ్‌మెంట్ కోటాను రద్దు చేయడం సరైందేనని స్పష్టీకరిం చారు. విద్యను వాణిజ్యపరం చేయడాన్ని అనుమతించదరాదని పేర్కొన్నారు. నర్సరీ అడ్మిషన్లపై లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన మార్గదర్శకాలను రద్దు చేయాలని కోరుతూ యాక్షన్ కమిటీ ఆఫ్ అన్‌ఎయిడెడ్ రికగ్నైజ్డ్ పబ్లిక్ స్కూల్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై హైకోర్టు జారీచేసిన నోటీసుకు లెఫ్టినెంట్ గవర్నర్ సమాధానమిచ్చారు. ఈ కేసు తదుపరి విచారణ మార్చ్ 25న నిర్వహిస్తామని ఉన్నతన్యాయస్థానం తెలిపింది.
తాను జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ న్యాయస్థానాన్ని కోరారు. ‘విద్యను వ్యాపారంగా మార్చడం నిషిద్ధం. విద్యాసంస్థలను బోధన దుకాణాలుగా కొనసాగనివ్వరాదు. అది పిల్లలకు సమాన అవకాశాలను అందించకుండా చేస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిలో నర్సరీ అడ్మిషన్ల జారీకి డిసెంబర్ 18న లెఫ్టినెంట్ గవర్నర్ మార్గదర్శకాలను జారీ చేశారు. మేనేజ్‌మెంట్ కోటాను రద్దు చేయడంతోపాటు పాయింట్ల విధానానికి మార్గదర్శకాలు ప్రాధాన్యం ఇచ్చాయి. స్థానిక బాలలకు (నేబర్‌హుడ్) అడ్మిషన్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాయి. నేబర్‌హుడ్ కేటగిరీ కింద పాఠశాలకు ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో నివసించేవారికి అత్యధిక పాయింట్లను కేటాయించారు. వాటిని రద్దు చేయాలని ప్రైవేటు పాఠశాలలు సుప్రీంకోర్టును ఆశ్రయించినా, జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్లు మార్గదర్శకాల ప్రకారమే జరగాలని హైకోర్టు ఆదేశించింది. కేసుపై తరువాత విచారణ జరుపుతానని పేర్కొంది.
Advertisement