జీటీబీ ఆస్పత్రిని సందర్శించిన జంగ్
Published Tue, Apr 22 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడాల్సిన అవసరముందని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన గురు తేజ్ బహదూర్(జీటీబీ) ఆస్పత్రిని సందర్శించారు. దాదాపు రెండు గంటలకుపైగా ఆస్పత్రిలోనే గడిపిన జంగ్ అక్కడి వైద్యులు, సిబ్బంది, రోగులతో మాట్లాడారు. అనారోగ్యంతో కుంగిపోయిన రోగులకు వైద్యుడి స్పర్శ ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుందని, కొన్నిసార్లు ఆ స్పర్శ అద్భుతాలు కూడా చేస్తుందన్నారు. ఆస్పత్రికి రోగి వచ్చిననాటి నుంచి నయమై అడుగు బయటపెట్టేవరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపైనే ఉందన్నారు. అనంతరం ఆస్పత్రిలోని వివిధ ఔట్ పేషెంట్ విభాగాలను, డయాబెటిక్, మెటబాలిక్ కేర్ బ్లాక్, మాతాశిశు విభాగం, ఫార్మసీ తదితర విభాగాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆస్పత్రిని ఆదర్శ ఆస్పత్రిగా తీర్చిదిద్దే ఓ ప్రణాళికకు సంబంధించిన ప్రెజెంటేషన్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ జంగ్‌కు చూపారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను గవర్నర్‌కు వివరించారు. సీనియర్ వైద్యులు, సర్జన్‌లు, ఇతర సిబ్బంది కూడా తమ అవసరాలను జంగ్ ముందు ఏకరువు పెట్టుకున్నారు. రోగుల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిందని, అయితే అందుకు సరిపడా వైద్య సదుపాయాలు, కిచెన్, లాండ్రీ, పార్కింగ్ సదుపాయాలను కూడా విస్తరించాలన్నారు. జంగ్ స్పందిస్తూ... రోగుల సంఖ్య పెరిగినప్పుడు దాని భారం ఆస్పత్రిలోని ప్రతి విభాగంపై పడుతుందని, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను చేసుకుంటూ పోవడమే పరి ష్కారమన్నారు.
ఓపీడీలో సేవలను సమర్థవంతంగా అందించాలని సూచించారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత సులభతరం చేయాలన్నారు. ఫార్మసీ వద్ద కూడా రోగులు మందుల కోసం బారులుతీరుతున్న దృశ్యా లు కనిపించాయని, అవసరమైతే కౌంటర్ల సంఖ్య ను పెంచి ఈ సమస్యను పరిష్కరించాలని సూచిం చారు. ఆస్పత్రి పరిసరాల్లో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే విషయమై అక్కడికక్కడే అదనపు పోలీస్ కమిషనర్‌తో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Advertisement