సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఉద్యోగ కాల పరిమితి ముగియనున్న 2,500 మంది హోం గార్డ్‌లకు ఢిల్లీ ప్రభుత్వం మరో ఏడాదిపాటు అవకాశం ఇచ్చింది. హోం గార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ బలగం డైరక్టర్ జనరల్ జతీందర్ కుమార్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌ంగ్ సహాయంతో ప్రత్యేక కేసు కింద పరిగణించి హోం గార్డుల ఉద్యోగ కాల పరిమితిని పొడిగించినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఫిబ్రవరిలో కాలపరిమితి ముగియనున్న 2,500 హోం గార్డు వాలంటీర్లకు మేలు జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు హోంగార్డు అధికారులను విశిష్ట సేవలకు ఇచ్చే రాష్ట్రపతి పతకంతో, 8 మంది అధికారులను నిష్కామ సేవా పతకాలతో ఆయన సన్మానించారు.
పదోన్నతిపై ఎల్జీకి ప్రతిపాదన
పది సంవత్సరాల అనుభవం కలిగి 45 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి దాటని హోం గార్డుల పదోన్నతి విషయం కూడా లెప్టినెంట్ గవర్నర్ ముందుంచనున్నట్లు శర్మ తెలిపారు. మిగతా అన్ని బలగాల మాదిరిగానే హోంగార్డుల సంస్థ కూడా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామని అన్నారు. ఈ విషయాన్ని తాము లెప్టినెంట్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో పనిచేసిన 2,000 మంది హోం గార్డుల సేవలను ఆయన అభినందించారు. ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ సహాయంతో హోంగార్డుల ఉద్యోగకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ రెండు రోజుల కింద నిర్ణయం వెలువడిందని ఆయన తెలిపారు.
హోంగార్డ్‌లకు శుభవార్త
Published Sat, Dec 6 2014 10:38 PM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM
Advertisement