ప్రభుత్వ సలహాతోనే వ్యవహరించండి: హైకోర్టు
ఇటు కేంద్ర ప్రభుత్వంతోను.. అటు కేంద్ర ప్రతినిధి లెఫ్టినెంట్ గవర్నర్తోను గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎట్టకేలకు పెద్ద ఊరట లభించింది. ఢిల్లీ ఏసీబీ విభాగం తప్పనిసరిగా కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచే ఆదేశాలు తీసుకుని, వాటిని పాటించాలే తప్ప.. కేంద్ర ప్రభుత్వం నుంచి కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఢిల్లీ మంత్రివర్గం సలహా, సహాయాలతోనే పనిచేయాలని జడ్జి వ్యాఖ్యానించారు. దీంతో కేజ్రీవాల్ కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. హైకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని ఆయన ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ అధికారులను ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏసీబీ అధికారులు విచారించడానికి వీల్లేదని, భూమికి సంబంధించిన అంశాలు, ఢిల్లీ పోలీసులు, కీలక అధికారుల నియామకం లాంటి అంశాల్లో వేలుపెట్టే అధికారం ఢిల్లీ సర్కారుకు లేదని గతవారం కేంద్రం చెప్పింది. ఈ అంశాల్లో ఢిల్లీ ప్రభుత్వం సలహాలను తీసుకోవాల్సిన అవసరం లెఫ్టినెంట్ గవర్నర్కు లేదని కూడా కేంద్రం తెలిపింది. అయితే.. అవినీతిపరులైన అధికారులను కాపాడేందుకే కేంద్రం ఇలా వ్యవహరిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.