న్యూఢిల్లీ: పెనుదుమారం ప్రభావం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న ప్రాంతాలకు నీరు, విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌కు కాంగ్రెస్ పార్టీ విన్నవించింది. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. నగరంలోని అనేక ప్రాంతాలు నీటి కొరత, విద్యుత్ సరఫరాలో కోత సమస్యను ఎదుర్కొంటున్నాయని ఈ బృందం ఎల్జీకి తెలియజేసింది. బాధిత ప్రజలను ఆదుకునేందుకు సత్వరమే తగు చర్యలు తీసుకోవాలని కోరింది. ఎల్జీతో సమావేశం అనంతరం ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్వీందర్ సింగ్ లవ్లీ మీడియాతో మాట్లాడుతూ నగరానికి విద్యుత్ సరిగా సరఫరా కావడం లేదని, నగరానికి విద్యుత్‌ను సరఫరా చేస్తున్న సంస్థలను ఈ విషయమై నిలదీయాలని కోరినట్టు చెప్పారు.
ఒకవేళ ఆయా విద్యుత్ సరఫరా సంస్థలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోయినట్టయితే వాటిపై తప్పనిసరిగా చర్యలకు ఉపక్రమించాల్సిందిగా కోరామని చెప్పారు. ఈ విషయమై ఆయా డిస్కంలతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవసరమైతే వీధుల్లోకి వస్తామన్నారు. పెనుగాలి దుమారం తర్వాత నగరంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్ర నీటికొరత, విద్యుత్ కోత సమస్య తలెత్తిందన్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు నీటి సరఫరాను నిలిపివేయాల్సిందిగా ఎల్జీని కోరామన్నారు. అనంతరం డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ మాట్లాడుతూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే నీటి చార్జీలను 50 శాతం త గ్గిస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను పెడతారి పట్టిస్తోందన్నారు. నెలసరి 400 యూనిట్ల కంటే ఎక్కువ వాడని వారికే ఆప్ సబ్సిడీ ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. నగరవాసుల సమస్యలపై మాట్లాడుతూ ఒకవేళ విద్యుత్, నీటి సరఫరా నగరంలో ఇంకా మెరుగుపడకపోతే తమ పార్టీ ఆందోళనకు దిగుతుందని ఆయన హెచ్చరించారు.
అంతరాయం లేకుండా చూడండి
Published Tue, Jun 3 2014 10:01 PM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement
Advertisement