న్యూఢిల్లీ: జాతీయ రాజధాని వాసుల బాధలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ ఆరోపించారు. నగరంలోని చావ్రీ బజార్‌లో సోమవారం నిర్వహించిన జనజాగృతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఢిల్లీవాసుల సంక్షేమానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ)ఎన్నికల సమయంలో అధికార యం త్రాంగాన్ని ఆ పార్టీ దుర్వినియోగం చేసిందన్నారు. అందువల్లనే ఆ ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విజయం సాధించగలిగిందన్నారు. తమ పార్టీ అనుబంధ విభాగం ఎన్‌ఎస్‌యూఐ తరఫున బరిలోకి దిగిన వ్యక్తి కేవలం 700 ఓట్ల తేడాతోనే ఓడిపోయాడని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
బీజేపీ నాయకులు మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. తద్వారా సమాజంలోని అన్నివర్గాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ఈ కారణంగా అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని విమర్శించారు. అనంతరం డీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ మాట్లాడుతూ బీజేపీ మతవిద్వేష ప్రకటనల విషయంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. తమ పార్టీని కుదేలు చేసేందుకు ఆ రెండు పార్టీలు పరోక్షంగా చేతులు కలిపాయని ఆయన ఆరోపించారు.
‘బీజేపీ పట్టించుకోవడం లేదు’
Published Tue, Sep 16 2014 10:52 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement