న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో పార్టీ పునరుద్ధరణకు సంబంధించి తన వద్ద ఓ వ్యూహం ఉందని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగినవారు ఘోర పరాజయం పాలవడానికి కపిల్ సిబల్, అజయ్ మాకెన్, సందీప్ దీక్షిత్‌లతోపాటు ఇతర ఎంపీలే కారణమని అన్నారు. అంతేతప్ప ఇందుకు పార్టీ కేంద్ర అధిషా ్టనం తప్పు ఎంతమాత్రం లేదన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో కొంతమంది రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండడంతో ఆయన పై విధంగా స్పందించారు.
ఢిల్లీకి సంబంధించినంతవరకూ పార్టీ సరైన ఫలితాలను సాధించలేకపోవడానికి ఓటమిపాలైన ఏడుగురు పార్టీ అభ్యర్థులే బాధ్యత వహించాలన్నారు. ఈ ఓటమికి ఎవరైన బాధ్యులు ఉన్నారంటే మాజీ ఎంపీలేనని, వారితోపాటు తాను కూడా అందులో ఒకరినన్నారు. కాగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థులంతా మూడోస్థానానికే పరిమితమైన సంగతి విదితమే. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) కార్యవర్గంలో యువతకు ప్రాధాన్యమిస్తానని అర్వీందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న పార్టీకి కొత్తరూపం తీసుకొస్తానన్నారు. ‘అజయ్ మాకెన్ రెండు సార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను సైతం నిర్వర్తించారు. బరిలోకి దిగినచోటే ఆయన ఓడిపోయారంటే అందుకు అధిష్టానం ఏవిధంగా బాధ్యత వహిస్తుంది’ అని ప్రశ్నించారు.
పోరాటాలకు సన్నద్ధం
ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ ప్రజా సమస్యలపై దృష్టి సారించింది. శుక్రవారం తుపాను బీభత్సం తరువాత మూడురోజుల నుంచి ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు, మరోవైపు నీటి ఎద్దడిపై దృష్టి సారించిన కాంగ్రెస్ పోరాటాలకు సిద్ధమవుతోంది. నజఫ్‌గఢ్, రోహిణి, ఉత్తమన్‌నగర్‌లతోపాటు ఢిల్లీ శివారు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రమైన కరెంటు కోతలను ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి మూడు నుంచి ఐదు గంటలపాటు వరుసగా విద్యుత్ కోత ఉంటోంది. ఈ నేపథ్యంలో నిరంతరాయంగా నీటి, విద్యుత్ సరఫరాను చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నగరంలో విద్యుత్ పరిస్థితి దారుణంగా ఉందని ఢిల్లీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ అన్నారు. డీపీసీసీ చీఫ్ అర్విందర్‌సింగ్ లవ్లీ అధ్యక్షతన ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలంతా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. గత మూడు నెలలుగా విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని, దీనికితోడు శుక్రవారం తుపాను నగరానికి 35 గంటలపాటు విద్యుత్ లేకుండా చేసిందని ఆయన అన్నారు. అయితే పునరుద్ధరణ పనులు పూర్తయ్యేవరకు మరో రెండు రోజులు పడుతుందని విద్యుత్ అదికారులు చెబుతున్నారని ముఖేష్ తెలిపారు.
ఓటమి బాధ్యత వారిదే!
Published Sun, Jun 1 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM
Advertisement
Advertisement