డీపీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన లవ్లీ
Published Sun, Dec 29 2013 11:17 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) అధ్యక్షుడిగా మాజీమంత్రి, గాంధీనగర్ ఎమ్మెల్యే అర్విందర్‌సింగ్ లవ్లీ ఆదివారం బాధ్యతలను చేపట్టారు. ఇటీవల జరిగిన ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత డీపీసీసీ ఇన్‌చార్జి పదవికి జయప్రకాశ్ అగర్వాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. యువతకు పెద్ద పీట వేయడంతో నగర పరిధిలో పార్టీని గాడిలోపెట్టే బాధ్యతను షీలాదీక్షిత్ సన్నిహితుడైన అర్విందర్‌సింగ్ లవ్లీకి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అప్పగించాలని నిర్ణయించారు. దీంతో స్థానిక డీడీయూ మార్గ్‌లోని రాజీవ్ భవన్ డీపీసీసీ కార్యాలయంలో లవ్లీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ద్వివేది, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, కేంద్రమంత్రి కపిల్ సిబల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్‌మాకెన్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతాయుతంగా పనిచేస్తా
ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించిన అర్విందర్‌సింగ్ లవ్లీ అతి పిన్న వయస్సులోనే డీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వందలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి లవ్లీ ప్రసంగించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గౌరవం తగ్గకుండా పనిచేస్తానన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేదాకా ఉద్యమిస్తానన్నారు. దేశ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉందన్నారు. యువనేత, కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భావి ప్రధాని అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఢిల్లీ విధానసభలోపలా, వెలుపలా బాధ్యతాయుతంగా పనిచేస్తామన్నారు. ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామన్నారు.
ముభావంగా షీలాదీక్షిత్
ఇటీవల జరిగిన ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఎంతో నిరాశగా కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో తప్పనిసరై పాల్గొంటున్నా మునుపటి ఉత్సాహం ఆమెలో కనిపించడం లేదని ఆదివారం డీపీసీసీ కార్యాలయంలో కార్యక్రమానికి వచ్చిన పలువురు కార్యకర్తలు చర్చించుకున్నారు. పదవి పోయినప్పటి నుంచి షీలాదీక్షిత్ మీడియా మందుకు సైతం అంతగా రావడం లేదనే అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. లవ్లీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో షీలా నిరాశగా కనిపించారు.
Advertisement