Jaiprakash Agarwal
-
‘లోకల్ పై' నిర్లక్ష్యం
లోక్‌సభ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కేటాయించే స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను (ఎంపీ ల్యాడ్ నిధులు) వెచ్చించడంలో ఢిల్లీ ఎంపీలు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. తూర్పుఢిల్లీ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్, పశ్చిమఢిల్లీ ఎంపీ మహాబల్ మిశ్రా మాత్రమే స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను పూర్తిగా ఖర్చు చేసినట్టు తేలింది. దక్షిణఢిల్లీ ఎంపీ రమేశ్ కుమార్ అందరికంటే తక్కువగా నిధులను ఖర్చు చేసినట్టు వెల్లడయింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వశాఖ గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడయింది. దీని నివేదిక ప్రకారం ఢిల్లీ లోక్‌సభ ఎంపీలకు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల కింద రూ.93.75 కోట్లు కేటాయించగా, వాటిలో 70 శాతం డబ్బును మాత్రమే ఖర్చు చేశారు. మిగతా రూ.28.80 కోట్లు మురిగిపోయాయి. రాష్ట్రంలోని ఏడు లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ నాయకులే ఎంపీలుగా గెలిచిన సంగతి తెలిసిందే. తూర్పుఢిల్లీ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్, పశ్చిమఢిల్లీ ఎంపీ మహాబల్ మిశ్రా స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను పూర్తిగా ఖర్చు పెట్టారు. డీపీసీసీ మాజీ అధ్యక్షుడు కూడా అయిన అగర్వాల్‌కు రూ.18.39 కోట్లను స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులుగా కేటాయించగా, రూ.16.69 కోట్లు ఖర్చు చేసినట్టు తేలింది. మిశ్రా నియోజకవర్గానికి రూ.13.31 కోట్లు కేటాయించగా, రూ.10.26 కోట్లు వినియోగించారు. ఈ విషయంలో ఎంపీ రమేశ్ కుమార్ బాగా వెనకబడ్డారు. ఆయనకు మొత్తం రూ.10.32 కోట్లు కేటాయించగా, రూ.3.71 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆఖరున నిలిచారు. అందుకే దక్షిణఢిల్లీ పరిధిలోని ప్రాంతాల్లో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. ‘మాకు తెలిసి ఇక్కడ ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మూత్రశాలలు, రోడ్లు, వీధిదీపాల వంటి కనీస సదుపాయాలు కూడా మా ప్రాంతాల్లో కనిపించవు’ అని ఛత్తర్పూర్వాసి ఆశిష్ బాత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తూర్పుఢిల్లీ ఎంపీ సందీప్ దీక్షిత్ పనితీరు కూడా మెరుగ్గా ఏమీ లేదు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం రూ.7.89 కోట్లను స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులుగా కేటాయించగా, కేవలం రూ.3.67 కోట్లు వినియోగించారు. కేంద్రమంత్రి, చాందినీచౌక్ ఎంపీ కపిల్ సిబల్‌కు రూ.18.24 కోట్లు ఇవ్వగా, 13.47 కోట్లు ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇన్చార్జ్, న్యూఢిల్లీ ఎంపీ అజయ్‌మాకెన్ పనితీరు కాస్త మెరుగ్గానే ఉంది. ఆయన నియోజకవర్గానికి రూ.20.96 కోట్లు అందజేయగా, రూ.16.61 కోట్లు వినియోగించారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి, వాయవ్యఢిల్లీ ఎంపీ కృష్ణ తీరథ్‌కు రూ.9.99 కోట్లు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులుగా కేటాయించగా, రూ.5.66 కోట్లను ఖర్చు పెట్టించగలిగారు. ఈమె నియోజకవర్గ పరిధిలోకి వచ్చే రోహిణి, రిఠాలా, నంగ్లోయి బన్వానా, నరేలా ప్రాంతాలవాసు లు కొందరు మాట్లాడుతూ నిధులు ఖర్చు చేసింది నిజమే అయినా, ఇందుకు సక్రమ విధానాన్ని అనుసరించలేదని విమర్శించారు. ‘డ్రైనేజీలను ఇప్పటికీ బాగు చేయకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. అందుకే ఏటా భారీగా మలేరియా, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. పైప్లైన్లు వేయడానికి కార్పొరేషన్లు ఇష్టమొచ్చినట్టు రోడ్లు తవ్వుతున్నాయి. ఫలితంగా ఏర్పడే శిథిలాల ను ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని రోహిణిలోని సెక్టార్ 3 నివాసి శిఖ అన్నారు. ఇక్కడి పార్కుల్లో రాత్రిపూట గూండాలు, తాగుబోతులు సంచరి స్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆక్షేపించారు. -
నాయకులం కాము..
సాక్షి, న్యూఢిల్లీ: అజయ్ మాకెన్, మహాబల్ మిశ్రా, ప్రవేశ్ వర్మ.. వీళ్లంతా నిత్యం రాజకీయాల్లో చురుగ్గా కనిపిస్తుంటారు. అయితే ఎన్నికల నామినేషన్ల పత్రాల్లో తమను తాము వ్యాపారవేత్తలు, సామాజిక సేవకులుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా తమ అఫిడవిట్లలో వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడుతున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో పలువురు తమ నామినేషన్లతోపాటు సమర్పించిన అఫిడవిట్లలో తమను తాము రాజకీయ నాయకులుగా పేర్కొనలేదు. ఢిల్లీ రాజకీయా ల్లో తలపండిన జైప్రకాశ్ అగర్వాల్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తన వృత్తిని ‘సామాజిక సేవకుడు’గా పేర్కొన్నారు. 1984లో ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన ఆయన నార్త్ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండోసారి పోటీచేస్తున్నారు. అగర్వాల్ మాత్రమే కాదు ఈస్ట్ ఢిల్లీ నుంచి రెండుసార్లు గెలిచి మూడోసారి పోటీకి సిద్ధపడిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ కూడా తనను తాను ‘సామాజిక సంస్కరణవాది’ ‘డెయిరీ రైతు’గా పేర్కొన్నారు. న్యూఢిల్లీ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్, వెస్ట్ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ మహాబల్ మిశ్రా తనను వ్యాపారవేత్తగా పేర్కొన్నారు. ఆప్ అభ్యర్థులు రాజ్‌మోహన్ గాంధీ, జర్నైల్ సింగ్ తమను రచయితలుగా పేర్కొన్నారు. చాందినీచౌక్ నుంచి పోటీ చేస్తోన్న కపిల్ సిబల్ తన వృత్తిని కేం ద్రమంత్రిని పేర్కొనగా, ఆయన ప్రత్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ తాను వైద్యుడు, ఎమ్మెల్యేనని చెప్పుకున్నారు. మీనాక్షి లేఖి తనను న్యాయవాదిగా పేర్కొనగా, ప్రవేశ్‌వర్మ వ్యాపారవేత్తనని తెలిపారు. చాం దినీచౌక్ నుంచి పోటీచేస్తున్న ఆప్ అభ్యర్థి ఆశుతోష్, న్యూఢిల్లీ నుంచి పోటీచేస్తోన్న ఆశిష్ ఖేతాన్ మాత్ర మే తమను రాజకీయ నేతలుగా పేర్కొన్నారు. -
డీపీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన లవ్లీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) అధ్యక్షుడిగా మాజీమంత్రి, గాంధీనగర్ ఎమ్మెల్యే అర్విందర్‌సింగ్ లవ్లీ ఆదివారం బాధ్యతలను చేపట్టారు. ఇటీవల జరిగిన ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత డీపీసీసీ ఇన్చార్జి పదవికి జయప్రకాశ్ అగర్వాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. యువతకు పెద్ద పీట వేయడంతో నగర పరిధిలో పార్టీని గాడిలోపెట్టే బాధ్యతను షీలాదీక్షిత్ సన్నిహితుడైన అర్విందర్‌సింగ్ లవ్లీకి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అప్పగించాలని నిర్ణయించారు. దీంతో స్థానిక డీడీయూ మార్గ్‌లోని రాజీవ్ భవన్ డీపీసీసీ కార్యాలయంలో లవ్లీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ద్వివేది, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, కేంద్రమంత్రి కపిల్ సిబల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్‌మాకెన్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా పనిచేస్తా ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించిన అర్విందర్‌సింగ్ లవ్లీ అతి పిన్న వయస్సులోనే డీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వందలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి లవ్లీ ప్రసంగించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గౌరవం తగ్గకుండా పనిచేస్తానన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేదాకా ఉద్యమిస్తానన్నారు. దేశ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉందన్నారు. యువనేత, కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భావి ప్రధాని అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఢిల్లీ విధానసభలోపలా, వెలుపలా బాధ్యతాయుతంగా పనిచేస్తామన్నారు. ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామన్నారు. ముభావంగా షీలాదీక్షిత్ ఇటీవల జరిగిన ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఎంతో నిరాశగా కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో తప్పనిసరై పాల్గొంటున్నా మునుపటి ఉత్సాహం ఆమెలో కనిపించడం లేదని ఆదివారం డీపీసీసీ కార్యాలయంలో కార్యక్రమానికి వచ్చిన పలువురు కార్యకర్తలు చర్చించుకున్నారు. పదవి పోయినప్పటి నుంచి షీలాదీక్షిత్ మీడియా మందుకు సైతం అంతగా రావడం లేదనే అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. లవ్లీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో షీలా నిరాశగా కనిపించారు.