లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడుతున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో పలువురు తమ నామినేషన్లతోపాటు సమర్పించిన అఫిడవిట్లలో తమను తాము రాజకీయ నాయకులుగా పేర్కొనలేదు.
సాక్షి, న్యూఢిల్లీ: అజయ్ మాకెన్, మహాబల్ మిశ్రా, ప్రవేశ్ వర్మ.. వీళ్లంతా నిత్యం రాజకీయాల్లో చురుగ్గా కనిపిస్తుంటారు. అయితే ఎన్నికల నామినేషన్ల పత్రాల్లో తమను తాము వ్యాపారవేత్తలు, సామాజిక సేవకులుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా తమ అఫిడవిట్లలో వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడుతున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో పలువురు తమ నామినేషన్లతోపాటు సమర్పించిన అఫిడవిట్లలో తమను తాము రాజకీయ నాయకులుగా పేర్కొనలేదు. ఢిల్లీ రాజకీయా ల్లో తలపండిన జైప్రకాశ్ అగర్వాల్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తన వృత్తిని ‘సామాజిక సేవకుడు’గా పేర్కొన్నారు. 1984లో ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన ఆయన నార్త్‌ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండోసారి పోటీచేస్తున్నారు.
అగర్వాల్ మాత్రమే కాదు ఈస్ట్ ఢిల్లీ నుంచి రెండుసార్లు గెలిచి మూడోసారి పోటీకి సిద్ధపడిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ కూడా తనను తాను ‘సామాజిక సంస్కరణవాది’ ‘డెయిరీ రైతు’గా పేర్కొన్నారు. న్యూఢిల్లీ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్, వెస్ట్‌ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ మహాబల్ మిశ్రా తనను వ్యాపారవేత్తగా పేర్కొన్నారు. ఆప్ అభ్యర్థులు రాజ్‌మోహన్ గాంధీ, జర్నైల్ సింగ్ తమను రచయితలుగా పేర్కొన్నారు.
చాందినీచౌక్ నుంచి పోటీ చేస్తోన్న కపిల్ సిబల్ తన వృత్తిని కేం ద్రమంత్రిని పేర్కొనగా, ఆయన ప్రత్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ తాను వైద్యుడు, ఎమ్మెల్యేనని చెప్పుకున్నారు. మీనాక్షి లేఖి తనను న్యాయవాదిగా పేర్కొనగా, ప్రవేశ్‌వర్మ వ్యాపారవేత్తనని తెలిపారు. చాం దినీచౌక్ నుంచి పోటీచేస్తున్న ఆప్ అభ్యర్థి ఆశుతోష్, న్యూఢిల్లీ నుంచి పోటీచేస్తోన్న ఆశిష్ ఖేతాన్ మాత్ర మే తమను రాజకీయ నేతలుగా పేర్కొన్నారు.