'యూపీలో మా అమ్మను అవమానించారు'
ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ దూసుకుపోయింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించగా, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. గోవా, మణిపూర్ లలో కాంగ్రెస్, బీజేపీలకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయితే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 300కు పైగా స్థానాల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కూటమికి అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. యూపీలో దారుణ వైఫల్యంపై ఢిల్లీ మాజీ సీఎం షీలాదిక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ ఓటమికి రాహుల్ గాంధీ సహా పార్టీ నేతలంగా బాధ్యత వహించాలన్నారు. యూపీలో షీలాదీక్షిత్‌ను అవమానించారని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ల వల్లే యూపీలో పార్టీ దారుణ ఓటమి చవిచూసిందని సందీప్ దీక్షిత్ ఆరోపించారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా మొదటగా షీలాదీక్షిత్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత సమాద్ వాదీ పార్టీతో కాంగ్రెస్ జతకట్టడంతో వారి అంచనాలు తారుమారయ్యాయి. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలకు గానూ బీజేపీ 322 సీట్లు, ఎస్పీ కూటమి 53 స్థానాలు, బీఎస్పీ 19, ఇతరులు ఐదు స్థానాల్లో విజయం సాధించాయి. మరో నాలుగు స్థానాల ఫలితాలు ఇంకా వెల్లడికాలేదు. ఓటమి అనంతరం అఖిలేశ్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.. 'ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాను. విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు. కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగుతుంది. కొత్త ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆశిస్తున్నానని' అఖిలేశ్ అన్నారు.