‘అందుకే సీఎం అభ్యర్థిత్వాన్ని వదులుకున్నా’
న్యూఢిల్లీ: మిగతా పార్టీకంటే ముందుగా, ఆరు నెలల కిందటే కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఘనవిజయానికి ప్రధాన కారకుడైన ‘వ్యూహకర్త’ ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను యూపీ సీఎం అభ్యర్తిగా నిలబెట్టారు. ఆమె ముఖచిత్రంతో రూపొందించిన భారీగా పోస్టర్లతో కొన్నాళ్లు ప్రచారం కూడా నిర్వహించారు. తీరా ఎన్నికలు సమీపించేనాటికి ఆమె పత్తాలేకుండాపోయారు. అటు ప్రశాంత్ కిషోర్‌కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌కు వెళ్లిపోయారు. కొన్ని గంటల కిందటే సీఎం అభ్యర్థిత్వాన్ని అధికారికంగా వదులుకున్న షీలా కాసేపు మీడియాతో మాట్లాడారు..
‘కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల ఎన్నికల పొత్తుపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నప్పుడే నేనొక మాట చెప్పా.. ఒక్క రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండరని! ఇప్పుడు పొత్తు ఖరారైంది. కాబట్టి నేను బరిలో ఉండను. యువతరానికి బాధ్యతలు అప్పగించేందుకే నేను సీఎం అభ్యర్థిత్వాన్ని వదులుకున్నా. దేశానికి రాహుల్, అఖిలేశ్ లాంటి యువ నాయకుల అవసరం చాలాఉంది. పార్టీ నిర్ణయంమే నాకు శిరోధార్యం. మనం నిర్ణయాలు తీసుకుంటాం, అవి నచ్చితే ప్రజలు మనల్ని ఆదరిస్తారు, లేదంటే తిరస్కరిస్తారని మా యువనేత రాహుల్ గాంధీ నాతో అన్నారు. ఆయన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. సీఎం అభ్యర్థిగా నేను తప్పుకోవడం సరైందా? కదా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారు’ అని వివరించారు షీలా దీక్షిత్.
ఇక అఖిలేశ్- ములాయం- శివపాల్ యాదవ్‌ల కలహాల గురించి స్పందిస్తూ.. అవి సమాజ్‌వాదీ పార్టీ అంతర్గత వ్యవహారాలని, వాటిపై తాను వ్యాఖ్యానించబోనని షీలా దీక్షిత్ అన్నారు. ప్రశాంత్ కిషోర్‌లాగే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ వ్యవహారాలకు దూరంగా ఉంటోన్న ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? అన్న ప్రశ్నకుమాత్రం సూటిగా బదులు చెప్పలేదు. పార్టీ ఆదేశిస్తే ప్రచారంలో పాల్గొంటానని క్లుప్తంగా అన్నారు. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో పొత్తులో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ 298స్థానాల్లోనూ, కాంగ్రెస్ 105 స్థానాల్లోనూ పోటీచేస్తున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 4వరకు యూపీలో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.