కాంగ్రెస్‌లో నిఖార్సయిన నాయకుడు లేడు
సందీప్ దీక్షిత్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమ పార్టీలో నిఖార్సయిన నాయకుడు లేడని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ పార్టీలోని సంస్కృతి నాయకుల్లో అహంకారాన్ని పెంచుతోందన్నారు. ‘కాంగ్రెస్ పార్టీలో సగం మంది నాయకులు చచ్చిపోయిన చెక్కల వంటివారు. ఇంకా ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో 70 శాతంమందిదీ ఇదే పరిస్థితి. ఇటువంటి పరిస్థితి మావంటి వాళ్లకు భరింపనలవికాకుండా ఉంది. కొత్త నాయకులను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని అన్నారు. కాగా తన తల్లి షీలాదీక్షిత్‌పై అజయ్‌మాకెన్, పీసీ చాకో వంటి నాయకులు గురువారం తీవ్రస్థాయిలో మాట్లాడిన నేపథ్యంలో శుక్రవారం సందీప్ పైవిధంగా స్పందించారు.
పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువంటూ ఎద్దేవా చేశారు. ‘కొత్త వారిని పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే వారు ఎన్నికల ద్వారా రారు. ఎంపికల ద్వారానే వస్తారు. కొత్త ఆలోచనలు, కొత్త అంశాలను తీసుకొస్తారు. ఇటువంటి వారిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నరేంద్రమోదీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు.’ అని అన్నారు. సుపరిపాలన వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
2013 నాటి తీర్పు కొనసాగింపు షీలాదీక్షిత్‌పై మాకెన్ వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: ఎన్నికల పరాజయం కాంగ్రెస్‌లో రేపిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తనపై గురువారం చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకుడు అజయ్ మాకెన్ ఇంకా మరిచిపోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో షీలాపై మళ్లీ వ్యంగ్యాస్త్రాలను సంధించారు.శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 2013 నాటి విధానసభ ఎన్నికల్లో వచ్చిన తీర్పే పునరావృతమైందన్నారు.
‘నేను వ్యక్తిగతంగా వెళ్లి ఆమెను కలుస్తా. ఎక్కడ తప్పు జరిగిందో తెలియజేయమని అడుగుతా. మున్ముందు అటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతా’ అని అన్నారు.