Pravesh Verma
-
నాయకులం కాము..
సాక్షి, న్యూఢిల్లీ: అజయ్ మాకెన్, మహాబల్ మిశ్రా, ప్రవేశ్ వర్మ.. వీళ్లంతా నిత్యం రాజకీయాల్లో చురుగ్గా కనిపిస్తుంటారు. అయితే ఎన్నికల నామినేషన్ల పత్రాల్లో తమను తాము వ్యాపారవేత్తలు, సామాజిక సేవకులుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా తమ అఫిడవిట్లలో వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడుతున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో పలువురు తమ నామినేషన్లతోపాటు సమర్పించిన అఫిడవిట్లలో తమను తాము రాజకీయ నాయకులుగా పేర్కొనలేదు. ఢిల్లీ రాజకీయా ల్లో తలపండిన జైప్రకాశ్ అగర్వాల్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తన వృత్తిని ‘సామాజిక సేవకుడు’గా పేర్కొన్నారు. 1984లో ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన ఆయన నార్త్ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండోసారి పోటీచేస్తున్నారు. అగర్వాల్ మాత్రమే కాదు ఈస్ట్ ఢిల్లీ నుంచి రెండుసార్లు గెలిచి మూడోసారి పోటీకి సిద్ధపడిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ కూడా తనను తాను ‘సామాజిక సంస్కరణవాది’ ‘డెయిరీ రైతు’గా పేర్కొన్నారు. న్యూఢిల్లీ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్, వెస్ట్ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ మహాబల్ మిశ్రా తనను వ్యాపారవేత్తగా పేర్కొన్నారు. ఆప్ అభ్యర్థులు రాజ్‌మోహన్ గాంధీ, జర్నైల్ సింగ్ తమను రచయితలుగా పేర్కొన్నారు. చాందినీచౌక్ నుంచి పోటీ చేస్తోన్న కపిల్ సిబల్ తన వృత్తిని కేం ద్రమంత్రిని పేర్కొనగా, ఆయన ప్రత్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ తాను వైద్యుడు, ఎమ్మెల్యేనని చెప్పుకున్నారు. మీనాక్షి లేఖి తనను న్యాయవాదిగా పేర్కొనగా, ప్రవేశ్‌వర్మ వ్యాపారవేత్తనని తెలిపారు. చాం దినీచౌక్ నుంచి పోటీచేస్తున్న ఆప్ అభ్యర్థి ఆశుతోష్, న్యూఢిల్లీ నుంచి పోటీచేస్తోన్న ఆశిష్ ఖేతాన్ మాత్ర మే తమను రాజకీయ నేతలుగా పేర్కొన్నారు. -
లోకల్ లొల్లి..
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ బీజేపీలో ‘లోకల్’ చిచ్చు రాజుకుంటోంది. ‘కష్టపడి వంట తాము చేస్తే భోజనం వేరేవారికి పెడుతున్నారని.. రాష్ట్రంలో పార్టీ వేళ్లూనుకోవడానికి కష్టపడిన స్థానిక నాయకులను కాదని ఎన్నికల సమయంలో తమ నెత్తిపై బయటనుంచి వ్యక్తులను తెచ్చి కూర్చోబెడుతున్నారని స్థానిక కార్యకర్తలు పార్టీ అగ్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా అభ్యర్థులకు వ్యతిరేకంగా స్థానిక పార్టీ కార్యాలయాల ముందు కార్యకర్తలు ఆందోళనలకు దిగుతున్నారు.వాయవ్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి దళిత నాయకుడు ఉదిత్‌రాజ్‌కు టికెట్ కేటాయించడంపై బీజేపీ అధినాయకత్వంపై కొందరు పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పశ్చిమ ఢిల్లీ నుంచి ప్రవీణ్ వర్మ, దక్షిణ ఢిల్లీ నుంచి రమేష్ భిద్రీలకు స్థానం కల్పించడంపై కూడా స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదిత్‌రాజ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కొందరు పార్టీ కార్యకర్తలు మంగళవారం అశోక్రోడ్లోని పార్టీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. తమ నియోజకవర్గానికి ‘పారాచ్యూట్ అభ్యర్థి’ని దింపాల్సిన అవసరం లేదని, వెంటనే అతడికి టికెట్ కేటాయింపును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ఢిల్లీలో వాయవ్య ఢిల్లీ లోక్‌సభ స్థానం ఒక్కటే రిజర్వుడ్. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు పార్టీలో చాలామంది స్థానిక దళిత నేతలు ఉన్నారు. ఎక్కడ నుంచో కొత్త వ్యక్తిని తీసుకువచ్చి ఇక్కడ అభ్యర్థిగా కూర్చోబెట్టాల్సిన అవసరం లేద’ని ఆందోళనకారుల్లో ఒకరు వ్యాఖ్యానించారు. రాజ్ మాజీ ప్రభుత్వోద్యోగి. ఇటీవలనే పార్టీలో చేరారు. అలాగే పంత్ మార్గ్ 5లో ఉన్న పార్టీ రాష్ట్ర యూనిట్ కార్యాలయం ముందు మంగళవారం మాజీ ఎమ్మెల్యే ఎస్సీఎల్ గుప్తా అనుచరులుగా భావిస్తున్న కొందరు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రస్తుత తుగ్లకాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమేష్ భిద్రీకి టికెట్ కేటాయించడంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భిద్రీ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని, గుప్తాకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.కాగా, ఈ ఆందోళన విషయంపై గుప్తా మాట్లాడుతూ.. తనకు ఆందోళన విషయం తెలియదన్నారు. తన కోసం ఆందోళన చేయాలని ఎవరినీ కోరలేదన్నారు.‘పార్టీ నిర్ణయం తీసుకుంది.. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది..’ అని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గంలో సైతం వర్గపోరాటం తప్పడంలేదు. ఇక్కడ జనక్‌పురి ఏరియా ఎమ్మెల్యే జగదీష్ ముఖి మద్దతుదారులు పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. స్థానిక పంజాబీ ఓటర్లను పార్టీ అధిష్టానం మరిచిపోయిందని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ నుంచి జాట్ కులస్తుడైన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడైన ప్రవేశ్ వర్మకు టికెట్ కేటాయించడంపై పంజాబీ కులస్తుల నాయకుడైన ప్రేమ్ ప్రకాశ్ శర్మ బహిరంగంగానే తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు. గత పార్లమెంటరీ ఎన్నికల్లో ముఖీ అపజయానికి పరోక్షంగా ప్రవేశ్ వర్మ పావులు కదిపాడని ఆయన ఆరోపించారు. అటువంటి వ్యక్తికి ఇప్పుడు టికెట్ ఇవ్వడమంటే పార్టీ ఒక సీటును పోగొట్టుకోవడానికి ఎన్నికలకుముందే సిద్ధపడినట్లేనని శర్మ పరోక్షంగా తమ అయిష్టతను అధిష్టానానికి కుండబద్దలు కొట్టారు. స్థానికులకు టికెట్లు కేటాయిస్తే తాము వారి గెలుపునకు పూర్తి బాధ్యత వహిస్తామన్నారు.