న్యూఢిల్లీ:
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ బీజేపీలో ‘లోకల్’ చిచ్చు రాజుకుంటోంది. ‘కష్టపడి వంట తాము చేస్తే భోజనం వేరేవారికి పెడుతున్నారని.. రాష్ట్రంలో పార్టీ వేళ్లూనుకోవడానికి కష్టపడిన స్థానిక నాయకులను కాదని ఎన్నికల సమయంలో తమ నెత్తిపై బయటనుంచి వ్యక్తులను తెచ్చి కూర్చోబెడుతున్నారని స్థానిక కార్యకర్తలు పార్టీ అగ్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆయా అభ్యర్థులకు వ్యతిరేకంగా స్థానిక పార్టీ కార్యాలయాల ముందు కార్యకర్తలు ఆందోళనలకు దిగుతున్నారు.వాయవ్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి దళిత నాయకుడు ఉదిత్‌రాజ్‌కు టికెట్ కేటాయించడంపై బీజేపీ అధినాయకత్వంపై కొందరు పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే పశ్చిమ ఢిల్లీ నుంచి ప్రవీణ్ వర్మ, దక్షిణ ఢిల్లీ నుంచి రమేష్ భిద్రీలకు స్థానం కల్పించడంపై కూడా స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదిత్‌రాజ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కొందరు పార్టీ కార్యకర్తలు మంగళవారం అశోక్‌రోడ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
తమ నియోజకవర్గానికి ‘పారాచ్యూట్ అభ్యర్థి’ని దింపాల్సిన అవసరం లేదని, వెంటనే అతడికి టికెట్ కేటాయింపును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘ఢిల్లీలో వాయవ్య ఢిల్లీ లోక్‌సభ స్థానం ఒక్కటే రిజర్వుడ్. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు పార్టీలో చాలామంది స్థానిక దళిత నేతలు ఉన్నారు. ఎక్కడ నుంచో కొత్త వ్యక్తిని తీసుకువచ్చి ఇక్కడ అభ్యర్థిగా కూర్చోబెట్టాల్సిన అవసరం లేద’ని ఆందోళనకారుల్లో ఒకరు వ్యాఖ్యానించారు.
రాజ్ మాజీ ప్రభుత్వోద్యోగి. ఇటీవలనే పార్టీలో చేరారు. అలాగే పంత్ మార్గ్ 5లో ఉన్న పార్టీ రాష్ట్ర యూనిట్ కార్యాలయం ముందు మంగళవారం మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీఎల్ గుప్తా అనుచరులుగా భావిస్తున్న కొందరు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రస్తుత తుగ్లకాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమేష్ భిద్రీకి టికెట్ కేటాయించడంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
భిద్రీ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని, గుప్తాకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.కాగా, ఈ ఆందోళన విషయంపై గుప్తా మాట్లాడుతూ.. తనకు ఆందోళన విషయం తెలియదన్నారు. తన కోసం ఆందోళన చేయాలని ఎవరినీ కోరలేదన్నారు.‘పార్టీ నిర్ణయం తీసుకుంది.. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది..’ అని ఆయన వ్యాఖ్యానించారు.
పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గంలో సైతం వర్గపోరాటం తప్పడంలేదు. ఇక్కడ జనక్‌పురి ఏరియా ఎమ్మెల్యే జగదీష్ ముఖి మద్దతుదారులు పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. స్థానిక పంజాబీ ఓటర్లను పార్టీ అధిష్టానం మరిచిపోయిందని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ నుంచి జాట్ కులస్తుడైన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడైన ప్రవేశ్ వర్మకు టికెట్ కేటాయించడంపై పంజాబీ కులస్తుల నాయకుడైన ప్రేమ్ ప్రకాశ్ శర్మ బహిరంగంగానే తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు. గత పార్లమెంటరీ ఎన్నికల్లో ముఖీ అపజయానికి పరోక్షంగా ప్రవేశ్ వర్మ పావులు కదిపాడని ఆయన ఆరోపించారు.
అటువంటి వ్యక్తికి ఇప్పుడు టికెట్ ఇవ్వడమంటే పార్టీ ఒక సీటును పోగొట్టుకోవడానికి ఎన్నికలకుముందే సిద్ధపడినట్లేనని శర్మ పరోక్షంగా తమ అయిష్టతను అధిష్టానానికి కుండబద్దలు కొట్టారు. స్థానికులకు టికెట్లు కేటాయిస్తే తాము వారి గెలుపునకు పూర్తి బాధ్యత వహిస్తామన్నారు.
లోకల్ లొల్లి..
Published Wed, Mar 19 2014 11:25 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement