Jagdish Mukhi
-
కమలం కంచుకోటకు బీటలు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీకి తలమానికమైన జనక్‌పురిని బీజేపీకికంచుకోటగా పేర్కొంటారు. ఆ పార్టీ సీనియర్ నేత జగ్దీశ్ముఖి ఇక్కడి నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచారు. ముఖిని ఓడించడం కోసం ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నించింది. అయితే ఆ పార్టీ బరిలోకి దించినఅభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముఖి కంచుకోటకు బీటలు బారిందనే విషయం గత ఎన్నికల్లోనేస్పష్టమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి రాజేష్ రుషి గత ఎన్నికల్లో ఆయనకు గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 2,644 ఓట్ల ఆధిక్యంతో ముఖి గెలుపొందారు. ఈసారి కూడా ఆప్ రుషినే బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ ముఖి అల్లుడు సురేష్ కుమార్‌ను బరిలోకి దించింది. మామా అల్లుళ్ల పోరుపై జనక్‌పురి వాసులే కాకుండా ఢిల్లీవాసులు కూడా చర్చించుకుంటున్నారు. రాష్ట్రపతి పాలన అనంతరం ముఖ్యమంత్రి పీఠం జగ్దీశ్ ముఖికి కట్టబెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే ఊహాగాపాలు వినిపించాయి. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి ముఖి త నవంతు ప్రయత్నం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ వర్సెస్ ముఖి పోస్టర్లతో కొన్నాళ్లు ప్రచారం కూడా చేసింది. అయితే తాజాగా కిరణ్ బేడీని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో సీఎంపై ముఖి ఆశలు కల్లలేనని తేలిపోయింది. కిరణ్ బేడీ సీఎం అభ్యర్థిత్వంపై ముఖి తన అసంతృప్త్తిని అధిష్టానానికి సూచనప్రాయంగా వ్యక్తం చేసినప్పటికీ చివరికి పార్టీ ఆదేశాన్ని శిరసావహించారు. ఒకప్పుడు జనక్‌పురిని కాలనీ ఆఫ్ పార్క్స్ అనేవారు. 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అనధికార కాలనీలను కూడా ఇందులో చేర్చడంతో ఈ నియోజకవర్గంలో ఓటర్ల నేపథ్యం మారిపోయింది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1.70 లక్షలు. అందులోనూ పంజాబీ ఓటర్లు ఎక్కువ. ఇక రెండో స్థానంలో సిక్కులు, మూడోస్థానంలో పూర్వాంచలీయులు ఉన్నారు. -
'ఆప్'పై న్యాయపరమైన చర్య తీసుకోండి: బీజేపీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై న్యాయపరమైన చర్య తీసుకోవాలని తమ పార్టీ నాయకుడు జగదీష్ ముఖీకి బీజేపీ ఢిల్లీ శాఖ సూచించింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి జగదీష్ ముఖీ అంటూ ఆప్ ప్రచారం చేస్తోంది. ఆయన ఫోటోతో కూడిన పోస్టర్లను ఆటో రిక్షాల వెనుక అతికించి ఎన్నికల ప్రచారం సాగిస్తోంది. అయితే బీజేపీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. తాము సీఎం అభ్యర్థిని ప్రకటించనప్పటికీ ఆప్ నాయకులు ఇలాంటి ప్రచారం ఎలా చేస్తారని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ ప్రశ్నించారు. ఆప్ పై న్యాయపరమైన చర్య తీసుకోవాలని జగదీష్ ముఖీని కోరినట్టు వెల్లడించారు. కాగా తన లాయర్లతో పాటు జగదీష్ ముఖీ సోమవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడను కలిశారు. -
సీఎం రేసులో ముందున్న జగ్దీశ్ ముఖి
ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఎల్జీ ఆహ్వానిస్తే తాము సిద్ధమంటూ బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరనే విషయమై చర్చలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి రేసులో బీజేపీ సీనియర్ నేత జగ్దీశ్ ముఖి అందరికంటే ముందున్నారు. ముఖి పేరును అంగీకరించడానికి ఎమ్మెల్యేలంతా సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఈ సీనియర్ ఎమ్మెల్యే జనక్‌పురి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్, రమేష్ బిధూడీ, నంరద్కిషోర్ గర్గ్ పేర్లు కూడా వినిసిస్తున్నాయి. వీరందరికంటే ముఖి పేరే బలంగా వినిపిస్తోంది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం ముఖి గత కొంత కాలంగా కృషి చేస్తున్నందువల్ల ఆయనకే సీఎం పీఠం దక్కవచ్చని చెబుతున్నారు. ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనేది పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ నెల 11న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. -
లోకల్ లొల్లి..
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ బీజేపీలో ‘లోకల్’ చిచ్చు రాజుకుంటోంది. ‘కష్టపడి వంట తాము చేస్తే భోజనం వేరేవారికి పెడుతున్నారని.. రాష్ట్రంలో పార్టీ వేళ్లూనుకోవడానికి కష్టపడిన స్థానిక నాయకులను కాదని ఎన్నికల సమయంలో తమ నెత్తిపై బయటనుంచి వ్యక్తులను తెచ్చి కూర్చోబెడుతున్నారని స్థానిక కార్యకర్తలు పార్టీ అగ్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా అభ్యర్థులకు వ్యతిరేకంగా స్థానిక పార్టీ కార్యాలయాల ముందు కార్యకర్తలు ఆందోళనలకు దిగుతున్నారు.వాయవ్య ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి దళిత నాయకుడు ఉదిత్‌రాజ్‌కు టికెట్ కేటాయించడంపై బీజేపీ అధినాయకత్వంపై కొందరు పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పశ్చిమ ఢిల్లీ నుంచి ప్రవీణ్ వర్మ, దక్షిణ ఢిల్లీ నుంచి రమేష్ భిద్రీలకు స్థానం కల్పించడంపై కూడా స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదిత్‌రాజ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కొందరు పార్టీ కార్యకర్తలు మంగళవారం అశోక్రోడ్లోని పార్టీ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. తమ నియోజకవర్గానికి ‘పారాచ్యూట్ అభ్యర్థి’ని దింపాల్సిన అవసరం లేదని, వెంటనే అతడికి టికెట్ కేటాయింపును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ఢిల్లీలో వాయవ్య ఢిల్లీ లోక్‌సభ స్థానం ఒక్కటే రిజర్వుడ్. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు పార్టీలో చాలామంది స్థానిక దళిత నేతలు ఉన్నారు. ఎక్కడ నుంచో కొత్త వ్యక్తిని తీసుకువచ్చి ఇక్కడ అభ్యర్థిగా కూర్చోబెట్టాల్సిన అవసరం లేద’ని ఆందోళనకారుల్లో ఒకరు వ్యాఖ్యానించారు. రాజ్ మాజీ ప్రభుత్వోద్యోగి. ఇటీవలనే పార్టీలో చేరారు. అలాగే పంత్ మార్గ్ 5లో ఉన్న పార్టీ రాష్ట్ర యూనిట్ కార్యాలయం ముందు మంగళవారం మాజీ ఎమ్మెల్యే ఎస్సీఎల్ గుప్తా అనుచరులుగా భావిస్తున్న కొందరు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రస్తుత తుగ్లకాబాద్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమేష్ భిద్రీకి టికెట్ కేటాయించడంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భిద్రీ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని, గుప్తాకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.కాగా, ఈ ఆందోళన విషయంపై గుప్తా మాట్లాడుతూ.. తనకు ఆందోళన విషయం తెలియదన్నారు. తన కోసం ఆందోళన చేయాలని ఎవరినీ కోరలేదన్నారు.‘పార్టీ నిర్ణయం తీసుకుంది.. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది..’ అని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గంలో సైతం వర్గపోరాటం తప్పడంలేదు. ఇక్కడ జనక్‌పురి ఏరియా ఎమ్మెల్యే జగదీష్ ముఖి మద్దతుదారులు పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. స్థానిక పంజాబీ ఓటర్లను పార్టీ అధిష్టానం మరిచిపోయిందని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక్కడ నుంచి జాట్ కులస్తుడైన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహెబ్ సింగ్ వర్మ కుమారుడైన ప్రవేశ్ వర్మకు టికెట్ కేటాయించడంపై పంజాబీ కులస్తుల నాయకుడైన ప్రేమ్ ప్రకాశ్ శర్మ బహిరంగంగానే తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు. గత పార్లమెంటరీ ఎన్నికల్లో ముఖీ అపజయానికి పరోక్షంగా ప్రవేశ్ వర్మ పావులు కదిపాడని ఆయన ఆరోపించారు. అటువంటి వ్యక్తికి ఇప్పుడు టికెట్ ఇవ్వడమంటే పార్టీ ఒక సీటును పోగొట్టుకోవడానికి ఎన్నికలకుముందే సిద్ధపడినట్లేనని శర్మ పరోక్షంగా తమ అయిష్టతను అధిష్టానానికి కుండబద్దలు కొట్టారు. స్థానికులకు టికెట్లు కేటాయిస్తే తాము వారి గెలుపునకు పూర్తి బాధ్యత వహిస్తామన్నారు. -
నేడు స్పీకర్ ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం బీజేపీ జగ్దీశ్ ముఖిని బరిలోకి దింపడంతో స్పీకర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక శుక్రవారం జరుగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన జంగ్‌పురా ఎమ్మెల్యే ఎం.ఎస్. ధీర్, బీజేపీ తరఫున జగ్దీశ్ ముఖి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలో మైనారిటీ ప్రభుత్వం కొనసాగుతున్నందువల్ల అసెంబ్లీ స్పీకర్ పదవి ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ పదవిని దక్కించుకుని అసెంబ్లీలో తమది పైచేయి చేసుకోవడానికి పోటీపడుతున్నాయి. ఆప్‌కి బయటి నుంచి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఎన్నికపై తన వైఖరిని స్పష్టం చేయలేదు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోరితేనే స్పీకర్ ఎన్నికలో ఆప్‌కి మద్దతు ఇస్తానని ఆ పార్టీ అంటోంది.