సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీకి తలమానికమైన జనక్‌పురిని బీజేపీకికంచుకోటగా పేర్కొంటారు. ఆ పార్టీ సీనియర్ నేత జగ్‌దీశ్‌ముఖి ఇక్కడి నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచారు. ముఖిని ఓడించడం కోసం ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నించింది. అయితే ఆ పార్టీ బరిలోకి దించినఅభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముఖి కంచుకోటకు బీటలు బారిందనే విషయం గత ఎన్నికల్లోనేస్పష్టమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి రాజేష్ రుషి గత ఎన్నికల్లో ఆయనకు గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 2,644 ఓట్ల ఆధిక్యంతో ముఖి గెలుపొందారు. ఈసారి కూడా ఆప్ రుషినే బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ ముఖి అల్లుడు సురేష్ కుమార్‌ను బరిలోకి దించింది. మామా అల్లుళ్ల పోరుపై జనక్‌పురి వాసులే కాకుండా ఢిల్లీవాసులు కూడా చర్చించుకుంటున్నారు.
రాష్ట్రపతి పాలన అనంతరం ముఖ్యమంత్రి పీఠం జగ్‌దీశ్ ముఖికి కట్టబెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే ఊహాగాపాలు వినిపించాయి. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి ముఖి త నవంతు ప్రయత్నం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ వర్సెస్ ముఖి పోస్టర్లతో కొన్నాళ్లు ప్రచారం కూడా చేసింది. అయితే తాజాగా కిరణ్ బేడీని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో సీఎంపై ముఖి ఆశలు కల్లలేనని తేలిపోయింది. కిరణ్ బేడీ సీఎం అభ్యర్థిత్వంపై ముఖి తన అసంతృప్త్తిని అధిష్టానానికి సూచనప్రాయంగా వ్యక్తం చేసినప్పటికీ చివరికి పార్టీ ఆదేశాన్ని శిరసావహించారు. ఒకప్పుడు జనక్‌పురిని కాలనీ ఆఫ్ పార్క్స్ అనేవారు. 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అనధికార కాలనీలను కూడా ఇందులో చేర్చడంతో ఈ నియోజకవర్గంలో ఓటర్ల నేపథ్యం మారిపోయింది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1.70 లక్షలు. అందులోనూ పంజాబీ ఓటర్లు ఎక్కువ. ఇక రెండో స్థానంలో సిక్కులు, మూడోస్థానంలో పూర్వాంచలీయులు ఉన్నారు.
కమలం కంచుకోటకు బీటలు
Published Sat, Jan 24 2015 11:02 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement