సోనియా గాంధీ అసహనం!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో అలజడి తలెత్తడంతో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్-కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ల మధ్య చోటు చేసుకున్న అంశం కాస్తా తారాస్థాయికి చేరడంతో సోనియా జోక్యం చేసుకున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ ఎన్నికల ఇంఛార్జి పీసీ చాకో పార్టీ ఓటమిపై నివేదిక సమర్పించిన సమయంలో సోనియా గాంధీ ఆ విషయాలను అడిగి తెలుసుకున్నారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం పార్టీకి మంచి కాదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఆ జగడాన్ని ఆపాలని ఆమె గట్టిగా హెచ్చరించారు.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచార రధసారథి అజయ్ మాకెన్ బాధ్యతలను షీలా తప్పుబట్టడంతో నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. మాకెన్ సరైన దిశలో పార్టీని నడిపించడంలో విఫలమయ్యారని ఆరోపించడమే కాకుండా అతన్ని చూసి తాను జాలిపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో చాకో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె నోరు మూసుకుని ఉండటం మంచిదంటూ ఆయన ఎదురుదాడికి దిగారు. దీంతో నేతల మధ్య చోటు చేసుకున్న విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయని గ్రహించిన సోనియా గాంధీ ఆ వార్ కు ఇక్కడతో పుల్ స్టాప్ పెట్టాలని సూచించారు.