‘నేను చెప్పింది చేస్తే కాంగ్రెస్ మళ్లీ కళకళ’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హితోపదేశం చేశారు. రాహుల్ కూడా సోనియా గాంధీ అంతటి ఓపికను తెచ్చుకోవాలని, కొన్ని ప్రజలకు అనుకూలమైన విధానాలు నేర్చుకోవాలని అన్నారు. పార్టీ కార్యాలయంలో సోనియా రోజుకు రెండు నుంచి మూడు గంటలు గడిపి పరిస్థితులపై అంచనాలు వేసేవారని, రాహుల్ కూడా అలాంటి నడవడిక నేర్చుకుంటే మంచిదని సూచించారు. పార్టీ నాయకులు వెంట ఉండాలంటే మరిన్ని నాయకత్వ లక్షణాలు రాహుల్ అలవర్చుకోవాలని అన్నారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె ‘రాహుల్‌గాంధీ మరింత చేరువయ్యేలా ఉండాలి’ అని ఆమె అన్నారు. తల్లి సోనియా మాదిరిగానే రాహుల్ కూడా పార్టీ కార్యాలయంలో రెండు మూడు గంటలు గడిపి పార్టీ నేతలతో మమేకవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తాను చెప్పిన సలహాను పాటిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మళ్లీ కళకళలాడుతాయని చెప్పారు. ఇదే మానియా అన్ని పార్టీల కార్యాలయాల్లో చోటుచేసుకుంటుందని అన్నారు. అయితే, రాహుల్‌కు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, అయితే, అవి ఆకట్టుకునేలా సమపాల్లలో తగినంత లేవని చెప్పారు.