mahabal Mishra
-
కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల రెండోజాబితాను బుధవారం విడుదల చేసింది. ఇందులో మాజీ ఎంపీ మహబల్ మిశ్రా, మాజీ స్పీకర్ యోగానంద్ శాస్త్రితోపాటు 25 మంది పేర్లు ఉన్నాయి. కాగా, ఆప్ అధినేత కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఈసారి రాష్ట్ర మాజీ మంత్రి కిరణ్వాలియాకు టికెట్ కేటాయించారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పోటీచేసి కేజ్రీవాల్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ద్వారకా నుంచి మిశ్రా, మాలవీయనగర్ నుంచి శాస్త్రి పోటీచేయనున్నారు. మరో మాజీ స్పీకర్ చౌదరీ ప్రేమ్ సింగ్ రిజర్వ్డ్ స్థానమైన అంబేద్కర్‌నగర్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే కోండ్లీ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ అమ్రిష్ సింగ్ గౌతమ్, కస్తూర్బానగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే నీరజ్ బసోయా ఉంటారని పార్టీ పేర్కొంది. దీంతో ఢిల్లీ విధానసభలోని 70 స్థానాలకు గాను 49 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. మాజీ కేంద్ర మంత్రి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ అయిన అజయ్ మాకెన్ సదర్ బజార్ నుంచి పోటీచేయనున్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి అయిన కృష్ణకాంత్ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడుతున్నా అతడి అభ్యర్థిత్వాన్ని ఇంకా ఖరారు చేయలేదు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన రామ్‌వీర్ షౌకీన్ భార్య రీతా షౌకీన్‌కు ముండ్కా నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించారు. రామ్‌వీర్ ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.అలాగే వజీపూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే హరిశంకర్ గుప్తా, త్రినగర్ నుంచి అనిల్ భరద్వాజ్ పార్టీ తరఫున పోటీచేయనునున్నారు. అలాగే తిమర్పూర్ నుంచి సురేందర్ పాల్ సింగ్ బరిలో ఉంటారు. కాగా, ఈ జాబితాలో కొందరు కొత్తవారికి సైతం స్థానం కల్పించడం గమనార్హం. -
‘లోకల్ పై' నిర్లక్ష్యం
లోక్‌సభ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కేటాయించే స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను (ఎంపీ ల్యాడ్ నిధులు) వెచ్చించడంలో ఢిల్లీ ఎంపీలు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. తూర్పుఢిల్లీ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్, పశ్చిమఢిల్లీ ఎంపీ మహాబల్ మిశ్రా మాత్రమే స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను పూర్తిగా ఖర్చు చేసినట్టు తేలింది. దక్షిణఢిల్లీ ఎంపీ రమేశ్ కుమార్ అందరికంటే తక్కువగా నిధులను ఖర్చు చేసినట్టు వెల్లడయింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వశాఖ గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడయింది. దీని నివేదిక ప్రకారం ఢిల్లీ లోక్‌సభ ఎంపీలకు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల కింద రూ.93.75 కోట్లు కేటాయించగా, వాటిలో 70 శాతం డబ్బును మాత్రమే ఖర్చు చేశారు. మిగతా రూ.28.80 కోట్లు మురిగిపోయాయి. రాష్ట్రంలోని ఏడు లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ నాయకులే ఎంపీలుగా గెలిచిన సంగతి తెలిసిందే. తూర్పుఢిల్లీ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్, పశ్చిమఢిల్లీ ఎంపీ మహాబల్ మిశ్రా స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను పూర్తిగా ఖర్చు పెట్టారు. డీపీసీసీ మాజీ అధ్యక్షుడు కూడా అయిన అగర్వాల్‌కు రూ.18.39 కోట్లను స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులుగా కేటాయించగా, రూ.16.69 కోట్లు ఖర్చు చేసినట్టు తేలింది. మిశ్రా నియోజకవర్గానికి రూ.13.31 కోట్లు కేటాయించగా, రూ.10.26 కోట్లు వినియోగించారు. ఈ విషయంలో ఎంపీ రమేశ్ కుమార్ బాగా వెనకబడ్డారు. ఆయనకు మొత్తం రూ.10.32 కోట్లు కేటాయించగా, రూ.3.71 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆఖరున నిలిచారు. అందుకే దక్షిణఢిల్లీ పరిధిలోని ప్రాంతాల్లో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. ‘మాకు తెలిసి ఇక్కడ ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మూత్రశాలలు, రోడ్లు, వీధిదీపాల వంటి కనీస సదుపాయాలు కూడా మా ప్రాంతాల్లో కనిపించవు’ అని ఛత్తర్పూర్వాసి ఆశిష్ బాత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తూర్పుఢిల్లీ ఎంపీ సందీప్ దీక్షిత్ పనితీరు కూడా మెరుగ్గా ఏమీ లేదు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం రూ.7.89 కోట్లను స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులుగా కేటాయించగా, కేవలం రూ.3.67 కోట్లు వినియోగించారు. కేంద్రమంత్రి, చాందినీచౌక్ ఎంపీ కపిల్ సిబల్‌కు రూ.18.24 కోట్లు ఇవ్వగా, 13.47 కోట్లు ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇన్చార్జ్, న్యూఢిల్లీ ఎంపీ అజయ్‌మాకెన్ పనితీరు కాస్త మెరుగ్గానే ఉంది. ఆయన నియోజకవర్గానికి రూ.20.96 కోట్లు అందజేయగా, రూ.16.61 కోట్లు వినియోగించారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి, వాయవ్యఢిల్లీ ఎంపీ కృష్ణ తీరథ్‌కు రూ.9.99 కోట్లు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులుగా కేటాయించగా, రూ.5.66 కోట్లను ఖర్చు పెట్టించగలిగారు. ఈమె నియోజకవర్గ పరిధిలోకి వచ్చే రోహిణి, రిఠాలా, నంగ్లోయి బన్వానా, నరేలా ప్రాంతాలవాసు లు కొందరు మాట్లాడుతూ నిధులు ఖర్చు చేసింది నిజమే అయినా, ఇందుకు సక్రమ విధానాన్ని అనుసరించలేదని విమర్శించారు. ‘డ్రైనేజీలను ఇప్పటికీ బాగు చేయకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. అందుకే ఏటా భారీగా మలేరియా, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. పైప్లైన్లు వేయడానికి కార్పొరేషన్లు ఇష్టమొచ్చినట్టు రోడ్లు తవ్వుతున్నాయి. ఫలితంగా ఏర్పడే శిథిలాల ను ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని రోహిణిలోని సెక్టార్ 3 నివాసి శిఖ అన్నారు. ఇక్కడి పార్కుల్లో రాత్రిపూట గూండాలు, తాగుబోతులు సంచరి స్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆక్షేపించారు. -
నాయకులం కాము..
సాక్షి, న్యూఢిల్లీ: అజయ్ మాకెన్, మహాబల్ మిశ్రా, ప్రవేశ్ వర్మ.. వీళ్లంతా నిత్యం రాజకీయాల్లో చురుగ్గా కనిపిస్తుంటారు. అయితే ఎన్నికల నామినేషన్ల పత్రాల్లో తమను తాము వ్యాపారవేత్తలు, సామాజిక సేవకులుగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని వారు స్వయంగా తమ అఫిడవిట్లలో వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడుతున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో పలువురు తమ నామినేషన్లతోపాటు సమర్పించిన అఫిడవిట్లలో తమను తాము రాజకీయ నాయకులుగా పేర్కొనలేదు. ఢిల్లీ రాజకీయా ల్లో తలపండిన జైప్రకాశ్ అగర్వాల్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో తన వృత్తిని ‘సామాజిక సేవకుడు’గా పేర్కొన్నారు. 1984లో ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన ఆయన నార్త్ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండోసారి పోటీచేస్తున్నారు. అగర్వాల్ మాత్రమే కాదు ఈస్ట్ ఢిల్లీ నుంచి రెండుసార్లు గెలిచి మూడోసారి పోటీకి సిద్ధపడిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ కూడా తనను తాను ‘సామాజిక సంస్కరణవాది’ ‘డెయిరీ రైతు’గా పేర్కొన్నారు. న్యూఢిల్లీ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్, వెస్ట్ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ మహాబల్ మిశ్రా తనను వ్యాపారవేత్తగా పేర్కొన్నారు. ఆప్ అభ్యర్థులు రాజ్‌మోహన్ గాంధీ, జర్నైల్ సింగ్ తమను రచయితలుగా పేర్కొన్నారు. చాందినీచౌక్ నుంచి పోటీ చేస్తోన్న కపిల్ సిబల్ తన వృత్తిని కేం ద్రమంత్రిని పేర్కొనగా, ఆయన ప్రత్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ తాను వైద్యుడు, ఎమ్మెల్యేనని చెప్పుకున్నారు. మీనాక్షి లేఖి తనను న్యాయవాదిగా పేర్కొనగా, ప్రవేశ్‌వర్మ వ్యాపారవేత్తనని తెలిపారు. చాం దినీచౌక్ నుంచి పోటీచేస్తున్న ఆప్ అభ్యర్థి ఆశుతోష్, న్యూఢిల్లీ నుంచి పోటీచేస్తోన్న ఆశిష్ ఖేతాన్ మాత్ర మే తమను రాజకీయ నేతలుగా పేర్కొన్నారు.