న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల రెండోజాబితాను బుధవారం విడుదల చేసింది. ఇందులో మాజీ ఎంపీ మహబల్ మిశ్రా, మాజీ స్పీకర్ యోగానంద్ శాస్త్రితోపాటు 25 మంది పేర్లు ఉన్నాయి. కాగా, ఆప్ అధినేత కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఈసారి రాష్ట్ర మాజీ మంత్రి కిరణ్‌వాలియాకు టికెట్ కేటాయించారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పోటీచేసి కేజ్రీవాల్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ద్వారకా నుంచి మిశ్రా, మాలవీయనగర్ నుంచి శాస్త్రి పోటీచేయనున్నారు.
మరో మాజీ స్పీకర్ చౌదరీ ప్రేమ్ సింగ్ రిజర్వ్‌డ్ స్థానమైన అంబేద్కర్‌నగర్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే కోండ్లీ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ అమ్రిష్ సింగ్ గౌతమ్, కస్తూర్బానగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే నీరజ్ బసోయా ఉంటారని పార్టీ పేర్కొంది. దీంతో ఢిల్లీ విధానసభలోని 70 స్థానాలకు గాను 49 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. మాజీ కేంద్ర మంత్రి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ అయిన అజయ్ మాకెన్ సదర్ బజార్ నుంచి పోటీచేయనున్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి అయిన కృష్ణకాంత్ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడుతున్నా అతడి అభ్యర్థిత్వాన్ని ఇంకా ఖరారు చేయలేదు.
గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన రామ్‌వీర్ షౌకీన్ భార్య రీతా షౌకీన్‌కు ముండ్కా నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించారు. రామ్‌వీర్ ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.అలాగే వజీపూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే హరిశంకర్ గుప్తా, త్రినగర్ నుంచి అనిల్ భరద్వాజ్ పార్టీ తరఫున పోటీచేయనునున్నారు. అలాగే తిమర్‌పూర్ నుంచి సురేందర్ పాల్ సింగ్ బరిలో ఉంటారు. కాగా, ఈ జాబితాలో కొందరు కొత్తవారికి సైతం స్థానం కల్పించడం గమనార్హం.
కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
Published Thu, Jan 15 2015 12:21 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement