అగ్రవర్ణాలకు పెద్దపీట | 27 seats for OCs in the second list of Congress | Sakshi
Sakshi News home page

అగ్రవర్ణాలకు పెద్దపీట

Published Sat, Oct 28 2023 2:03 AM | Last Updated on Sat, Oct 28 2023 7:01 PM

27 seats for OCs in the second list of Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 15న ప్రకటించిన 55 స్థానాలకు తోడు కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం మరో 45 స్థానాలను క్లియర్‌ చేయడంతో ఇప్పటివరకు మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. రెండో విడత జాబితాలో అగ్రవర్ణాలకు చెందిన నేతలకు పెద్ద పీట వేయగా, బీసీలకు 8 స్థానాలను, ఎస్సీ, ఎస్టీలకు 8, మైనార్టీలకు ఒక స్థానాన్ని కేటాయించింది.

ఇక ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గానికి 21, వెలమలకు 2, బ్రాహ్మణులకు 1, కమ్మ సామాజిక వర్గానికి మూడు టికెట్లను కేటాయించింది. ప్యారాచూట్లకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చినట్లు సీట్ల కేటాయింపు స్పష్టం చేస్తోంది. గతంలో చాలాకాలం కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసి, వివిధ కారణాలతో వేరే పార్టీల్లోకి వెళ్లి ఇటీవలే తిరిగి సొంతగూటికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (భువనగిరి)లకు టికెట్లు కేటాయించారు.

అలాగే ఇటీవలే పార్టీలోకి వచ్చిన బి.మనోహర్‌రెడ్డి (తాండూరు), శ్యాంనాయక్‌ (ఖానాపూర్‌), కంది శ్రీనివాస్‌రెడ్డి (ఆదిలాబాద్‌), యశస్వినిరెడ్డి (పాలకుర్తి), రేవూరి ప్రకాశ్‌రెడ్డి (పరకాల), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (పాలేరు), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), బండి రమేష్‌ (కూకట్‌పల్లి), జగదీశ్వర్‌గౌడ్‌ (శేరిలింగంపల్లి), నారాయణరావు పాటిల్‌(బోథ్‌), వొడితల ప్రణవ్‌ (హుజూరాబాద్‌), కస్తూరి నరేందర్‌ (రాజేంద్రనగర్‌), విజయారెడ్డి (ఖైరతాబాద్‌), యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), మురళీ నాయక్‌ (మహబూబాబాద్‌), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కె.ఆర్‌.నాగరాజు (వర్ధన్నపేట)లకు అవకాశ మిచ్చారు.  

బల్మూరి, విష్ణుకు మొండిచేయి 
అనుబంధ సంఘాల అధ్యక్షులు శివసేనారెడ్డి (వనపర్తి), బల్మూరి వెంకట్‌ (హుజూరాబాద్‌)లకు పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. మాజీ మంత్రి పీజేఆర్‌ కుటుంబానికి ఒక టికెట్‌తోనే సరిపెట్టింది. జూబ్లీహిల్స్‌ టికెట్‌ను పీజేఆర్‌ తనయుడు విష్ణు ఆశించినా అక్కడ మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ను ఎంపిక చేసింది. ఖైరతాబాద్‌లో పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డికి అవకాశమిచ్చింది. వరంగల్‌ జిల్లాలో కొండా దంపతులిద్దరికీ టికెట్‌ వస్తుందని భావించినా వరంగల్‌ తూర్పులో సురేఖకే అవకాశం ఇచ్చింది.

బీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించడంతో పార్టీలో చేరిన ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ భర్త శ్యాంనాయక్‌కు ఆసిఫాబాద్‌ టికెట్‌ ఖరారు చేసింది. ఇక ఖానాపూర్‌లో కొమురం భీం మనుమడు ఎడ్మ బొజ్జుకు, నారాయణపేటలో చిట్టెం కుటుంబానికి చెందిన డాక్టర్‌ పర్ణికారెడ్డి, పాలకుర్తిలో ప్రవాసాంధ్రురాలు హనుమాండ్ల ఝాన్సీ కోడలు యశశ్వినిరెడ్డి (ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో పిన్నవయసు్కరాలు (26))లకు అవకాశం కల్పించింది. 

పెండింగ్‌లో ఉన్న స్థానాలివే.. 
మిర్యాలగూడ, వైరా (సీపీఎంకు కేటాయించే అవకాశం), చెన్నూరు, కొత్తగూడెం (సీపీఐకి కేటాయించినట్లు సమాచారం), పటాన్‌చెరు, అశ్వారావుపేట, తుంగతుర్తి, సూర్యాపేట, నిజామాబాద్‌ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, చార్మినార్, బాన్సువాడ, జుక్కల్, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణ్‌ ఖేడ్‌ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.  

సామాజిక వర్గాల వారీగా ఇలా.. 
ఎస్సీలు–15 (మాదిగ–9, మాల–6) 
ఎస్టీలు–8 (ఆదివాసీలు–5, లంబాడీ–3) 
బీసీలు–20, మైనార్టీలు–4, ఓసీలు–53 (రెడ్డి–38, వెలమ–9, బ్రాహ్మణ–3, కమ్మ–3)

బీసీలకు 20 సీట్లే 
కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో కలిపి మొత్తం 20 స్థానాలే వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలకు దక్కాయి. మొదటి జాబితాలో 12 మందికి ఇవ్వగా, ఈసారి 8 మందికి అవకాశం కల్పించారు. తాజాగా ప్రకటించిన లిస్టులో 3 గౌడ, 2 ముదిరాజ్, పద్మశాలి, ఆరె మరాఠి, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. మధుయాాష్కీ, పొన్నం ప్రభాకర్, జగదీశ్వర్‌ (గౌడ) కస్తూరి నరేందర్, వాకిటి శ్రీహరి (ముదిరాజ్‌), కొండా సురేఖ (పద్మశాలి, భర్త మున్నూరు కాపు), నారాయణరావు పాటిల్‌ ( ఆరె మరాఠి), పూజల హరికృష్ణ (మున్నూరు కాపు)లకు టికెట్లు ఖరారయ్యాయి.

కాగా ప్రకటించిన 100 సీట్లలో 20 శాతమే బీసీలకు కేటాయించి 53 శాతం ఓసీ వర్గాలకు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు కేటా యించిన 20 సీట్లలో యాదవ–4, గౌడ –3, మున్నూరుకాపు–3, ముదిరాజ్‌–3, పద్మశాలి, ఆరె మరాఠి, వాల్మికి, మేరు, వంజర, చాకలి, బొందిలి కులాలకు ఒక్కొక్కటి దక్కాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement