‘లోకల్ పై' నిర్లక్ష్యం | Negligence on the local | Sakshi
Sakshi News home page

‘లోకల్ పై' నిర్లక్ష్యం

Published Sun, Mar 23 2014 10:10 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

Negligence on the local

లోక్‌సభ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కేటాయించే స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను (ఎంపీ ల్యాడ్ నిధులు) వెచ్చించడంలో ఢిల్లీ ఎంపీలు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. తూర్పుఢిల్లీ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్, పశ్చిమఢిల్లీ ఎంపీ మహాబల్ మిశ్రా మాత్రమే స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను పూర్తిగా ఖర్చు చేసినట్టు తేలింది.
 
దక్షిణఢిల్లీ ఎంపీ రమేశ్ కుమార్ అందరికంటే తక్కువగా నిధులను ఖర్చు చేసినట్టు వెల్లడయింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వశాఖ గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడయింది. దీని నివేదిక ప్రకారం ఢిల్లీ లోక్‌సభ ఎంపీలకు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల కింద రూ.93.75 కోట్లు కేటాయించగా, వాటిలో 70 శాతం డబ్బును మాత్రమే ఖర్చు చేశారు.
 
మిగతా రూ.28.80 కోట్లు మురిగిపోయాయి. రాష్ట్రంలోని ఏడు లోక్‌సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ నాయకులే ఎంపీలుగా గెలిచిన సంగతి తెలిసిందే. తూర్పుఢిల్లీ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్, పశ్చిమఢిల్లీ ఎంపీ మహాబల్ మిశ్రా స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను పూర్తిగా ఖర్చు పెట్టారు. డీపీసీసీ మాజీ అధ్యక్షుడు కూడా అయిన అగర్వాల్‌కు రూ.18.39 కోట్లను స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులుగా కేటాయించగా, రూ.16.69 కోట్లు ఖర్చు చేసినట్టు తేలింది.
 
 మిశ్రా నియోజకవర్గానికి రూ.13.31 కోట్లు కేటాయించగా, రూ.10.26 కోట్లు వినియోగించారు. ఈ విషయంలో ఎంపీ రమేశ్ కుమార్ బాగా వెనకబడ్డారు. ఆయనకు మొత్తం రూ.10.32 కోట్లు కేటాయించగా, రూ.3.71 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆఖరున నిలిచారు. అందుకే దక్షిణఢిల్లీ పరిధిలోని ప్రాంతాల్లో అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు.
 
 ‘మాకు తెలిసి ఇక్కడ ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మూత్రశాలలు, రోడ్లు, వీధిదీపాల వంటి కనీస సదుపాయాలు కూడా మా ప్రాంతాల్లో కనిపించవు’ అని ఛత్తర్‌పూర్‌వాసి ఆశిష్ బాత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తూర్పుఢిల్లీ ఎంపీ సందీప్ దీక్షిత్ పనితీరు కూడా మెరుగ్గా ఏమీ లేదు. ఆయనకు కేంద్ర ప్రభుత్వం రూ.7.89 కోట్లను స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులుగా కేటాయించగా, కేవలం రూ.3.67 కోట్లు వినియోగించారు.
 
 కేంద్రమంత్రి, చాందినీచౌక్ ఎంపీ కపిల్ సిబల్‌కు రూ.18.24 కోట్లు ఇవ్వగా, 13.47 కోట్లు ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ మీడియా వ్యవహారాల ఇన్‌చార్జ్, న్యూఢిల్లీ ఎంపీ అజయ్‌మాకెన్ పనితీరు కాస్త మెరుగ్గానే ఉంది. ఆయన నియోజకవర్గానికి రూ.20.96 కోట్లు అందజేయగా, రూ.16.61 కోట్లు వినియోగించారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి, వాయవ్యఢిల్లీ ఎంపీ కృష్ణ తీరథ్‌కు రూ.9.99 కోట్లు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులుగా కేటాయించగా, రూ.5.66 కోట్లను ఖర్చు పెట్టించగలిగారు.
 
 ఈమె నియోజకవర్గ పరిధిలోకి వచ్చే రోహిణి, రిఠాలా, నంగ్లోయి బన్వానా, నరేలా ప్రాంతాలవాసు లు కొందరు మాట్లాడుతూ నిధులు ఖర్చు చేసింది నిజమే అయినా, ఇందుకు సక్రమ విధానాన్ని అనుసరించలేదని విమర్శించారు. ‘డ్రైనేజీలను ఇప్పటికీ బాగు చేయకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.
 
 అందుకే ఏటా భారీగా మలేరియా, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. పైప్‌లైన్లు వేయడానికి   కార్పొరేషన్లు ఇష్టమొచ్చినట్టు రోడ్లు తవ్వుతున్నాయి. ఫలితంగా ఏర్పడే శిథిలాల ను ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని రోహిణిలోని సెక్టార్ 3 నివాసి శిఖ అన్నారు. ఇక్కడి పార్కుల్లో రాత్రిపూట గూండాలు, తాగుబోతులు సంచరి స్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆక్షేపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement