DPCC
-
సమగ్ర సమాచారమివ్వండి
న్యూఢిల్లీ: బవానా, నరేలాలో ఏర్పాటు చేయబోతున్న డంపింగ్ ప్లాంట్‌కు సంబంధించి సమగ్ర ప్రణాళికను సమర్పించాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి(డీపీసీసీ), ఢిల్లీ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (డీఎస్‌ఐఐడీసీ)లను జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని డీఎస్‌ఐఐడీసీ మేనేజింగ్ డైరక్టరుకు సూచించింది. పర్యావరణ అనుమతి లేకుండా ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బాలంసింగ్ రావత్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దేశ రాజధానిలో ఇలాంటి ప్లాంటు ఇప్పటి వరకు లేకపోవడం బాధపడాల్సిన విషయమన్నారు. బవానా, నారెలాలో ఈ డంపింగ్ ప్లాంటు ఏర్పాటు కోసం ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 14 ఎకరాల భూమి అప్పగిస్తూ మార్చి 12న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుందని కార్పొరేషన్ తరఫు న్యాయవాది ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విచారణకు డీఎస్‌ఐఐడీసీ తరఫున ఎవరూ హాజరుకాకపోవడంపై ట్రిబ్యునల్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు పూర్తి సమాచారంతో డీఎస్‌ఐఐడీసీ మేనేజింగ్ డైరక్టరు స్వయంగా హాజరుకావాలని చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ ఆదేశించారు. డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడం వరకు మాత్రమే బాధ్యతే కాదు.. మొత్తం పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా చెత్త సేకరణ చేయడం, దానిని రవాణా చేసి నాశనం చేయడం కూడా మున్సిపాలిటీ బాధ్యతేనని బెంచ్ వ్యాఖ్యానించింది. -
విధాన రూపకల్పనపై సీఎంకు సలహా ఇస్తా
డీపీసీసీ కొత్త అధ్యక్షుడు అజయ్ మాకెన్ సాక్షి, న్యూఢిల్లీ : విధాన రూపకల్పనలో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు సలహా ఇస్తానని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) నూతన అధ్యక్షుడు అజయ్ మాకెన్ చెప్పారు. అజయ్ మాకెన్‌ను డీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ సోమవారం ప్రకటన జారీ చేసింది. ఇప్పటిదాకా ఈ పదవిలో అర్విందర్‌సింగ్ లవ్లీ కొనసాగిన సంగతి విదితమే. ఏఐసీసీ ప్రకటన అనంతరం అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడుతూ విధాన రూపకల్పనలో అనుభవం ఉన్నందున తాను అజయ్ మాకెన్ సలహాలు, సూచనలు కోరతానంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో కే జ్రీవాల్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేజ్రీవాల్ కోరినప్పుడల్లా సలహాలివ్వడానికి సిద్ధమని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిన తరువాత నుంచి కేజ్రీవాల్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే మార్గాలను కాకుండా, వాటి నుంచి పలాయనం చిత్తగించే దారులను అన్వేషిస్తున్నారని ఆరోపించారు. -
గాంధీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి సురేందర్
న్యూఢిల్లీ: నగరంలోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సురేందర్ ప్రకాశ్‌శర్మ పోటీ చేయనున్నారు. పార్టీ ఢిల్లీ విభాగం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పీసీ చాకో మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నియోజక వర్గం నుంచి 2013 నాటి ఎన్నికల్లో పోటీచేసిన ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ విజయం సాధించిన సంగతి విదితమే. ఇక రాజౌరీ గార్డెన్ నియోజకవర్గం నుంచి మీనాక్షి చండేలియా బరిలోకి దిగనున్నారు. ఢిల్లీ విధానసభకు వచ్చే నెల ఏడో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీలు విమర్శనా స్త్రాలను సంధించుకుంటున్నాయి. -
నిబంధనలను ఉల్లంఘించారు
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ మహేష్ గిరి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఆగ్నేయ ఢిల్లీలో రెండు పాఠశాలల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగర పరిధిలోని మెహ్రోలి, కృష్ణానగర్, తుగ్లకాబాద్ శాసనసభ నియోజక వర్గాలకు ఎన్నికల కమిషన్ ఇటీవల ఎన్నికల తేదీలను ప్రకటించిందని, ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళి ఈ మూడు నియోజకవర్గాల్లో అమల్లో ఉందని, అయినప్పటికీ బీజేపీ ఎంపీ మహేశ్... మద్నాపూర్ ఖాదర్ ప్రాంతంలో రెండు పాఠశాలల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారన్నారు. ఇలా చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఆందోళనా కార్యక్రమాలను చేపడుతుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో శంకుస్థాపనలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. 48 గంటల్లోగా బీజేపీ ఎంపీపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఉద్యోగులకు డీపీసీసీ దీపావళి బోనస్
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన సిబ్బందిలో నైతికస్థైర్యం పెంచేందుకు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) చొరవ తీసుకుంది. ఇందులోభాగంగా రెండు నెలల జీతాన్ని దీపావళి బోనస్ కింద అంద జేయడం ఇదే తొలిసారి. పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ రెండు నెలల జీతాన్ని బోనస్‌గా ఇవ్వడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. తమ పార్టీ 15 సంవత్సరాలపాటు అధికారంలో ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఢిల్లీకి చెందిన ముగ్గురు నాయకులు మంత్రులుగా పనిచేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అయితే ఏనాడూ బోనస్ ఇవ్వలేదన్నారు. దీపావళి బోనస్ ఇవ్వాలని ఈసారి మాత్రమే నిర్ణయించామన్నారు. తమ పార్టీ కార్యకర్తలతోపాటు ఉద్యోగులు కూడా ఎన్నికలకు అన్నివిధాలుగా సన్నద్ధమవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో బోనస్ అందజేయడం వల్ల వారిలో ఉత్సాహం ద్విగుణీకృతమవుతుందన్నారు. శాసనసభను తక్ష ణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా ఎన్నికలు జరిపించాలన్నారు. ఈ ఎన్నికల్లో తమ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
నగర వాయు నాణ్యతపై‘హుదూద్’ ప్రభావం పెరిగిన కాలుష్యం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను గడగడలాడిస్తున్న హుదూద్ తుఫాన్ నగర వాయునాణ్యతపై ప్రభావం చూపుతోంది. ఆదివారం ఇది మరింత ప్రభావం చూపనుంది. భారత వాతావరణ శాఖ అనుబంధ సిస్టం ఫర్ ఎయిర్ క్వాలిటీ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) అందించిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం నాటికే నగరవాతావరణంలో కార్బన్ మోనాక్సై డ్, ధూళికణాల శాతం పెరిగింది. ఒకవేళ ఆదివారం కనుక వర్షం కురవకపోతే వాయునాణ్యత తీవ్రంగా దెబ్బతింటుందని, అందుకు నగరవాసులు అన్నివిధాలుగా సిద్ధం కావాలని సఫర్ హెచ్చరించింది. నిర్ధారించిన డీపీసీసీ హుదూద్ తుఫాన్ ప్రభావం కారణంగా నగర వాతావరణంలో కొన్ని కాలుష్య కారకాల పరిమాణం పెరుగుతోందనే విషయాన్ని ఢిల్లీ కాలుష్య నియంత్రణ సంస్థ (డీపీసీసీ)కి చెందిన శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. ఆదివారం నాటికి కార్బన్ మోనాక్సైడ్ స్థాయి దాదాపు రెండింతలయ్యే అవకాశాలు ఉన్నట్టు సఫర్ చెబుతోంది. ఊపిరితిత్తులు సరిగా పనిచేయని కారణంగా శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురు కావచ్చని చెబుతోంది. ఓజోన్ స్థాయి ప్రస్తుతం బిలియన్కు 40 కణాలుగా ఉండగా అది ఆదివారం నాటికి 63కు చేరుకోవచ్చని తెలిపింది. తక్షణ మే ప్రభావం చూపుతుంది: శాస్త్రవేత్త కోస్తా తీరం నుంచి గాలిలోకి పెద్దఎత్తున వచ్చే కాలుష్య కారకాలు నేరుగా గంగాతీరం వద్ద పడతాయని సఫర్‌కు చెందిన ప్రధాన శాస్త్రవేత్త గుర్ఫాన్ బేగ్ తెలిపారు. ఈ పరిణామం నగరంపై ప్రభావం చూపుతుందన్నారు. రెండురోజుల పాటు వాయు నాణ్యత బాగా తగ్గిపోతుందన్నారు. ఒకవేళ వర్షం కురిస్తే కనుక పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంటుందని, అయినప్పటికీ కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్ల స్థాయి బాగా పెరుగుతుందని అన్నారు. ఆదివారం నగరంలో బలమైన గాలులు వీచే అవకాశముందన్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడొచ్చన్నారు. దీని ప్రభావం ఉత్తరప్రదేశ్‌పైనా పడుతుం దన్నారు. ఇదిలాఉండగా దీపావళి సమీపిస్తుండడంతో కాలుష్య నియంత్రణకు సంబంధించి డీపీసీసీ నగరంలోని పలు ప్రాంతాల్లో అవగాహనా శిబిరాలను నిర్వహిస్తోంది. -
ఆగ్రహించిన హోంగార్డులు
న్యూఢిల్లీ: తమ సర్వీసును రద్దు చేయడంపై ఆగ్రహించిన వందలాదిమది ఢిల్లీ హోంగార్డులు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. మధ్యాహ్నం గం 12.15 సమయంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంగార్డులు....ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా వీరంతా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నివాసం దిశగా దూసుకుపోయేందుకు యత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకున్నారు. పొడిగించమని కోరాం: లవ్లీ ఈ విషయమై డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ మాట్లాడుతూ ‘గత ఏడాది లెఫ్టినెంట్ గవర్నర్‌ని తాము కలిశాం. హోంగార్డుల కాంట్రాక్టు కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించాలని కోరాం. వారి కాంట్రాక్టు గడువు ముగిసినందువల్ల ఢిల్లీ ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే కచ్చితంగా పొడిగించాలి. అయితే వారి కాంట్రాక్టు కాలాన్ని పొడిగించాల్సిందిపోయి కొత్తవారిని నియమిస్తోంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని అన్నారు. సర్వీసు రద్దు కారణంగా వారి జీవనోపాధి దెబ్బతిందన్నారు. ఇందువల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఆందోళనకు దిగడం తప్ప వారికి మరో మార్గమే లేదన్నారు. వారి కాంట్రాక్టు కాలాన్ని పొడిగించాలన్నారు. అలాచేస్తే వారికి తిరిగి జీవనోపాధి లభిస్తుందన్నారు. కేంద్ర హోం శాఖ తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు. బీజేపీ, ఆప్ కుమ్మక్కు అనంతరం డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కుమ్మక ్కయ్యాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు హోంగార్డుల సమస్యలను గాలికొదిలేశాయన్నారు. వారి హక్కులను కాపాడడంలో విఫలమయ్యాయన్నారు. హోంగార్డుల ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామంటూ విధానసభ ఎన్నికల ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట ఇచ్చారని, 49 రోజులపాటు అధికారంలో ఉండికూడా ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారని అన్నారు.ఇప్పుడు బీజేపీ చేస్తున్నదికూడా ఏమీలేదన్నారు. ఆందోళన అనంతరం హోంగార్డుల సంఘానికి చెందిన త్రిసభ్య బృందం తమ డిమాండ్లకు సంబంధించి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతిపత్రం అందజేసింది. కాగా హోంగార్డులను అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు విధానంలో విధుల్లోకి తీసుకున్న సంగతి విదితమే. -
‘బీజేపీ పట్టించుకోవడం లేదు’
న్యూఢిల్లీ: జాతీయ రాజధాని వాసుల బాధలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ ఆరోపించారు. నగరంలోని చావ్రీ బజార్లో సోమవారం నిర్వహించిన జనజాగృతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఢిల్లీవాసుల సంక్షేమానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ)ఎన్నికల సమయంలో అధికార యం త్రాంగాన్ని ఆ పార్టీ దుర్వినియోగం చేసిందన్నారు. అందువల్లనే ఆ ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విజయం సాధించగలిగిందన్నారు. తమ పార్టీ అనుబంధ విభాగం ఎన్ఎస్యూఐ తరఫున బరిలోకి దిగిన వ్యక్తి కేవలం 700 ఓట్ల తేడాతోనే ఓడిపోయాడని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. బీజేపీ నాయకులు మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. తద్వారా సమాజంలోని అన్నివర్గాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ఈ కారణంగా అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని విమర్శించారు. అనంతరం డీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ మాట్లాడుతూ బీజేపీ మతవిద్వేష ప్రకటనల విషయంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. తమ పార్టీని కుదేలు చేసేందుకు ఆ రెండు పార్టీలు పరోక్షంగా చేతులు కలిపాయని ఆయన ఆరోపించారు. -
ఫీడర్ బస్సు సేవలను ప్రారంభించిన ఎల్జీ
న్యూఢిల్లీ: డీఎంఆర్సీ కొత్తమార్గాల్లో ప్రవేశపెట్టనున్న ఫీడర్ బస్సులను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సోమవారం ప్రారంభించారు. రాష్ట్ర రవాణా సంస్థ ఆమోదించిన మార్గాల్లో ఇవి సేవలు అందిస్తాయని డీఎంఆర్సీ తెలిపింది. బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ఎల్జీ, తరువాత శాస్త్రిపార్కులోని డీఎంఆర్సీ డిపో, వర్క్‌షాప్‌ను కూడా సందర్శించారు. డీఎంఆర్సీ కార్యాలయాలను సందర్శించడం అద్భుత అనుభవమని ఎల్జీ అన్నారు. ఇక తాజాగా ప్రవేశపెట్టిన ఫీడర్ బస్సులు ఉదయం ఎనిమిదింటి నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు సేవలు అందిస్తాయి. వీటిలో మొదటి నాలుగు కిలోమీటర్ల వరకు రూ.ఐదు వసూలు చేస్తారు. పది కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే రూ.10 చెల్లించాలి. ఇవి విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్ నుంచి బురారి, విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్ నుంచి గోకుల్‌పురి మెట్రో, అజాద్‌పూర్ మెట్రో స్టేషన్ నుంచి కన్హయ్య నగర్ మెట్రో స్టేషన్, ఛత్తర్పూర్ నుంచి హాజ్‌కాస్ మెట్రో స్టేషన్ మార్గాల్లో సేవలు అందిస్తాయి. ఈ ఏడాది వివిధ మార్గాల్లో డీఎంఆర్సీ ప్రవేశపెట్టబోయే 400 బస్సుల్లో ఇవి భాగమని సంస్థ అధికారులు తెలిపారు. కాలుష్యకారక పరిశ్రమలకు మూత: లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశంకాలుష్య కారక పరిశ్రమల మూసివేతకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి (డీపీసీసీ) జారీ చేసిన ఆదేశాల అమలుకు తక్షణం చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులు ఎవరో తేల్చాలని పట్టణాభివృద్ధిశాఖ డెరైక్టర్‌ను ఆజ్ఞాపించారు. పట్టణాభివృద్ధిశాఖ అధికారులతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఎల్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) ఎదుర్కొం టున్న సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. తగినంత మంది డ్రైవర్లు లేకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఖాళీల భర్తీని వెంటనే చేపట్టాలని డీటీసీ చైర్మన్ దేబశ్రీ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. డీటీసీ సమస్యల అధ్యయనం కోసం నియమించే కమిటీలో సీఎండీతోపాటు ముగ్గురు సీనియర్ అధికారులు ఉంటారు. నరేలా బస్టాపులోని మరుగుదొడ్లకు కూడా వెంటనే మరమ్మతులు చేయాలని ఎల్జీ ముఖర్జీని ఆదేశించారు. -
ఇక అంతా హైటెక్
న్యూఢిల్లీ: దీన్ద యాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లోని కాంగ్రెస్ కార్యాలయం (రాజీవ్ భవన్)ను ఆ పార్టీ ఐటీ విభాగం ఈ-మేక్ ఓవర్ చేయనుంది. ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఐటీ విభాగానికి చెందిన సిబ్బ ంది వెల్లడించారు. ఢి ల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో వెల్లడించింది. ఏ సమయంలోనైనా ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా ఉండడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయఢంకా మోగించాలనే లక్ష్యంతో రాష్ట్ర కాంగ్రెస్ విభా గం ముందుకు సాగుతోంది. ఇందులోభాగ ంగా పదిమందితో కూడిన కమ్యూనికేషన్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ-మేకోవర్ ప్రక్రియృ పూర్తికాగానే కమ్యూనికేషన్ బృందం నగరవాసుల అభిప్రాయాలు, స్పందనలను ఎప్పటికప్పుడు విశ్లేషించనుంది. కాగా ఐటీ విభాగం సమన్వయకర్తగా ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రాధికా ఖేరా వ్యవహరిస్తున్నారు. ఇక యూ ట్యూబ్ చానల్లో కీలక నాయకుల ప్రసంగాలను అందుబాటులో ఉంచనున్నారు. ఇంకా నిరసన ప్రదర్శనలు, కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయనున్నారు. తద్వారా తాము ప్రజల కోసం పనిచేస్తున్నదనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల లక్ష్యం. అందులోభాగంగానే ఫేస్బుక్లో ఖాతా తోపాటు ట్విటర్లోనూ మరో ఖాతా తెరిచింది. దీంతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలకు సోషల్ మీడియాపై అవగాహన కల్పించడం కోసం త్వరలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. -
ప్రజావ్యతిరేక బడ్జెట్: డీపీసీసీ
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దిశానిర్దేశం లేనిదని, ప్రజావ్యతిరేకమని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) విమర్శించింది. ఇది పేదలకు ఎలాంటి మేలూ చేయకపోగా, నిరుద్యోగాన్ని ప్రోత్సహించేలా ఉందని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ ఆరోపించారు. ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి ఒక్క చర్యను కూడా ప్రకటించలేదని మండిపడ్డారు. కరెంటు, నీటి సమస్యల పరిష్కారానికి నిధులు అంటూ ఢిల్లీవాసులను కేంద్రం మోసగించిందని లవ్లీ అన్నారు. -
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన
సాక్షి, న్యూఢిల్లీ:ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ నేతృత్వంలో సోమవారం జంతర్‌మంతర్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ బారికేడ్లను దాటి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. రైలు చార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయని, దీనికితోడు ఢిల్లీవాసులు విద్యుత్ సరఫరాలో కోతలతో ఇబ్బందిపడుతున్నారని ఈ సందర్భంగా లవ్లీ ఆరోపించారు. ఢిల్లీవాసులను బీజేపీ దోచుకుంటుంటే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. అయితే ఈ ప్రభుత్వానికి కొంత సమయమివ్వడానికి సుముఖంగా ఉన్నామన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయి, మూడో స్థానానికి దిగడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కొత్త బాట పట్టింది. కోల్పోయిన ప్రజాదరణను చూరగొనేందుకు ఆందోళనల పరంపరను కొనసాగిస్తోంది. ఓటర్లతో సరైన అనుబంధం లేకపోవడం వల్లనే ఓడిపోయామన్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తి ఆమ్ ఆద్మీ పార్టీ తమను గద్దె దింపిందనే విషయాన్ని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా విద్యుత్ కోతలు, నీటి సమస్యలు వంటి ప్రజా సమస్యలపై నగరంలో రోజుకోచోట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ఈ ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా స్థానిక కార్యకర్తలలో ఉత్సాహం నింపడంతోపాటు పనిలో పనిగా ఓటర్ల మెప్పు కూడా పొందవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. విద్యుత్ కోతలు, నీటి సమస్యలకు తోడుగా ఇటీవల రైలు చార్జీలు పెరగడంతో కాంగ్రెస్‌కు మరో అస్త్రం లభించింది. ఆ తరువాత డీజిల్ , పెట్రోలు ధరలు పెరిగాయి. ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు పెరగడం కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశంగా మారింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజున రైలు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌తో పాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ జంతర్‌మంతర్ వద్ద పెద్దఎత్తున నిరసన ప్రదర్శన జరిపింది. కాగా పరిస్థితులు అదుపు తప్పకుండా చేసేందుకుగాను ఆందోళనకు దిగినవారిలో 40 నుంచి 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తాము అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారి ఒకరు తెలియజేశారు. ఆ తర్వాత వారిని విడుదల చేశామన్నారు. -
రైలు చార్జీల పెంపునకు వ్యతిరేకంగా రేపు పార్లమెంట్ ఘెరావ్...
న్యూఢిల్లీ: రైలు చార్జీల పెంపు, నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వైఫల్యాన్ని నిరసిస్తూ సోమవారం పార్లమెంట్ హౌజ్‌ను దిగ్బంధిస్తామని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) హెచ్చరించింది. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం పది గంటలకు జంతర్‌మంతర్ వద్ద సమావేశమవుతారు. అక్కడనుంచి పార్లమెంట్‌వరకూ హభల్లాబోల్ ఆందోళన చేపడతారు. ఈ విషయమై డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ, సీఎల్పీ నాయకుడు హరూన్ యూసఫ్ మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. మంచిరోజులొస్తాయంటూ ప్రచారం చేశారని, అయితే అందుకు భిన్నంగా అన్ని చెడ్డరోజులుగా మారిపోతున్నాయని, ఇందుకు కారణం తప్పుడు నిర్ణయాలు, విధానాలేనన్నారు. ‘నిత్యావసరాల ధరలు నానాటికీ పెరుగుతుండడంతో ప్రజలు విసిగిపోయారు. మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందువల్లనే బీజేపీ ప్రభుత్వం ముంబై లోకల్ రైళ్ల చార్జీలను తగ్గించింది. అయితే ఇతర రాష్ట్రాలనుంచి ఇక్కడికి వచ్చి జీవిస్తున్న వారిపై మాత్రం రైలు చార్జీల భారం పడింది, ఇందుకు కారణం వారు ఏడాదికి రెండు పర్యాయాలు తమ తమ స్వస్థలాలకు వెళుతుండడమే. రైలు చార్జీల పెంపు అన్ని రకాల వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయినప్పటికీ ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు’ అని ఆరోపించారు. -
చార్జీలకు వ్యతిరేకంగా రైల్‌రోకో
న్యూఢిల్లీ: పెంచిన రైలు చార్జీలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) ఆధ్వర్యంలో మంగళవారం రైల్ రోకో నిర్వహించారు. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు నైరుతి ఢిల్లీలోని పాలం రైల్వే స్టేషన్లో కొద్దిసేపు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పెంచిన రైలు చార్జీలను వెంటనే ఉపసంహరించాలని ఢిల్లీ కాంగ్రెస్ ప్రతినిధి ముఖేశ్ శర్మ డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు రైల్వే మంత్రి సదానంద గౌడ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పెరిగిన రైల్వే చార్జీలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. -
ఓటమి బాధ్యత వారిదే!
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో పార్టీ పునరుద్ధరణకు సంబంధించి తన వద్ద ఓ వ్యూహం ఉందని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగినవారు ఘోర పరాజయం పాలవడానికి కపిల్ సిబల్, అజయ్ మాకెన్, సందీప్ దీక్షిత్‌లతోపాటు ఇతర ఎంపీలే కారణమని అన్నారు. అంతేతప్ప ఇందుకు పార్టీ కేంద్ర అధిషా ్టనం తప్పు ఎంతమాత్రం లేదన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో కొంతమంది రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండడంతో ఆయన పై విధంగా స్పందించారు. ఢిల్లీకి సంబంధించినంతవరకూ పార్టీ సరైన ఫలితాలను సాధించలేకపోవడానికి ఓటమిపాలైన ఏడుగురు పార్టీ అభ్యర్థులే బాధ్యత వహించాలన్నారు. ఈ ఓటమికి ఎవరైన బాధ్యులు ఉన్నారంటే మాజీ ఎంపీలేనని, వారితోపాటు తాను కూడా అందులో ఒకరినన్నారు. కాగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థులంతా మూడోస్థానానికే పరిమితమైన సంగతి విదితమే. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) కార్యవర్గంలో యువతకు ప్రాధాన్యమిస్తానని అర్వీందర్ సింగ్ లవ్లీ పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న పార్టీకి కొత్తరూపం తీసుకొస్తానన్నారు. ‘అజయ్ మాకెన్ రెండు సార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను సైతం నిర్వర్తించారు. బరిలోకి దిగినచోటే ఆయన ఓడిపోయారంటే అందుకు అధిష్టానం ఏవిధంగా బాధ్యత వహిస్తుంది’ అని ప్రశ్నించారు. పోరాటాలకు సన్నద్ధం ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్ ప్రజా సమస్యలపై దృష్టి సారించింది. శుక్రవారం తుపాను బీభత్సం తరువాత మూడురోజుల నుంచి ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు, మరోవైపు నీటి ఎద్దడిపై దృష్టి సారించిన కాంగ్రెస్ పోరాటాలకు సిద్ధమవుతోంది. నజఫ్‌గఢ్, రోహిణి, ఉత్తమన్నగర్లతోపాటు ఢిల్లీ శివారు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రమైన కరెంటు కోతలను ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి మూడు నుంచి ఐదు గంటలపాటు వరుసగా విద్యుత్ కోత ఉంటోంది. ఈ నేపథ్యంలో నిరంతరాయంగా నీటి, విద్యుత్ సరఫరాను చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నగరంలో విద్యుత్ పరిస్థితి దారుణంగా ఉందని ఢిల్లీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ అన్నారు. డీపీసీసీ చీఫ్ అర్విందర్‌సింగ్ లవ్లీ అధ్యక్షతన ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలంతా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. గత మూడు నెలలుగా విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని, దీనికితోడు శుక్రవారం తుపాను నగరానికి 35 గంటలపాటు విద్యుత్ లేకుండా చేసిందని ఆయన అన్నారు. అయితే పునరుద్ధరణ పనులు పూర్తయ్యేవరకు మరో రెండు రోజులు పడుతుందని విద్యుత్ అదికారులు చెబుతున్నారని ముఖేష్ తెలిపారు. -
కాలుష్య పరిశ్రమలపై కఠినంగా వ్యవహరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కాలుష్యం కలిగిస్తోన్న అన్ని పరిశ్రమలు మూసివేసేలా చూడాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ(డీపీసీసీ)ని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంగళవారం ఆదేశించారు. మొదట కాలుష్య విభాగాలకు నోటీసులు జారీ చేయాలన్నారు. డీపీసీసీ ఆదేశాలను పాటిం చని ఇన్స్పెక్టర్లపై చర్యలు తీసుకోవాలని పట్టణ అభివృద్ధి కార్యదర్శికి సూచించారు. సంబంధిత కమిషనర్లందరూ డీపీసీసీ ఉత్తర్వులు పాటించాలని ఆదేశించారు. విషపదార్థాలను శుద్ధి చేయకుండానే యమునా నదిలోకి వదిలినందుకు డీపీసీసీ ఇటీవల 112 పరిశ్రమలకు నోటీసులు జారీ చేసింది. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు.. నగరంలో కాలుష్య స్థాయిలను నియంత్రించేం దుకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మంగళవారం ఉన్నత స్థాయి కమిటీ నియమించారు. ఎల్జీ ఆదేశాల ప్రకారం ఈ కమిటీ రెండు అంశాలపై దృష్ట్టి సారిస్తుంది. ఢిల్లీ రోడ్లపై పెరుగుతోన్న వాహనాల కారణంగా కలుగుతోన్న కాలుష్యంతో పాటు పారిశ్రామిక వ్యర్థాలను, సీవేజ్ని వదలడం వల్ల యమునా నదిలో కాలుష్య స్థాయిలను లెక్కకట్టనుంది. నగరంలో కాలుష్యానికి సంబంధించిన అన్ని అంశాలను, అందుకు గల కారణాలు, దాని స్థాయిలు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యల ను పరిశీలించాలని నజీబ్ జంగ్ ఈ కమిటీకి సూచించారు. కాలుష్య సమస్య పరిష్కారానికి స్వల్ప కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక పరిష్కారాలను సూచించాలని ఆదేశించారు. నగరంలో కాలు ష్య నియంత్రణకు చర్యలు చేపట్టడం కోసం అమలుకు వీలున్న పరిష్కారాలతో సమగ్ర నివేదికను రూపొందించి నాలుగువారాలలో సమర్పిం చాలని ఆయన కమిటీని ఆదేశించారు. ప్రధాన కార్యదర్శి నేతత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో ట్రాఫిక్ పోలీస్ కమిషనర్, పర్యావరణ శాఖ కార్యదర్శి. రవాణా విభాగం కమిషనర్ సభ్యులుగా ఉన్నారు. మల్టీమోడల్ రవాణా వ్యవస్థను సమీక్షించిన ఎల్జీ మెట్రోస్టేషన్ల పరిసరాల్లో ఢిల్లీ సమీకృత బహుళ రవాణా వ్యవస్థ (డిమ్టస్) మార్గాల నిర్మాణం కోసం యూనిఫైడ్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ -ప్లానింగ్, ఇంజనీరింగ్ (యూటీటీటీఐపీఈసీ) సమర్పించిన ప్రజెంటేషన్‌ను లెప్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) నజీబ్ జంగ్ మంగళవారం పరిశీలించారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండే మెట్రో స్టేషన్ల పరిసరాల్లో పాదచారులు, వాహనాల ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఉపయోగించే విధానాలతో యూటీటీటీఐపీఈసీ ఈ ప్రజెంటేషన్ సమర్పించింది. ఇలాంటి నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు కావాల్సి ఉన్న 44 మెట్రో స్టేషన్లను యూటీటీటీఐపీఈసీ ఇప్పటికే గుర్తించింది. వీటిలో తొమ్మిది మెట్రో స్టేషన్ల కోసం సమగ్ర ప్రణాళికలను కూడా రూపొందించింది. మొదటి రెండు దశల్లో నిర్మించిన మెట్రో స్టేషన్లతో పని ప్రారంభించిన యూటీటీటీఐపీఈసీ మూడు నాలుగోదశ మెట్రో స్టేషన్లలో కూడా పనులు ప్రారంభించాలనుకుంటోంది. ప్రాజెక్టుల నిర్మాణదశలోనే వాటి పరిసరా ల్లో ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిం చాలని ఈ సంస్థ భావిస్తోంది. లక్ష్మీనగర్, నిర్మాణ్‌విహార్, ప్రీత్ విహార్, కార్కర్డూమా, ఛత్తర్పూర్ మెట్రో స్టేషన్ల సమీపంలో పనులు చేపట్టవలసిందిగా ఎల్జీ ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌ను (డీఎంఆర్సీ) ఆదేశించారు. ఐఎన్ఏ, ఎయిమ్స్, గ్రీన్‌పార్క్, హౌజ్ఖాజ్ మెట్రో స్టేషన్ల పనులు ప్రజాపనులశాఖ (పీడబ్ల్యూడీ)కు అప్పగిం చారు. ఈ మెట్రో స్టేషన్లకు సంబంధించిన పనులను తక్షణం చేపట్టి నిర్ణీత కాలంలో పూర్తిచేయాలని ఎల్జీ ఆదేశించారు. మిగతా 35 మెట్రోస్టేషన్ల ప్రణాళికలను కూడా త్వరలో పూర్తిలో పూర్తిచేయాలని నజీబ్ జంగ్ యూటీటీటీఐపీఈసీని ఆదేశించారు. ఈ ప్రణాళికల అమలులో జరుగుతున్న జాప్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మెట్రో స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో రద్దీని తగ్గించడానికి ప్రారంభించిన ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయడానికి సంబంధిత విభాగాలన్నీ సహకరించాలని నజీబ్‌జంగ్ కోరారు. -
డీపీసీసీ అధికార ప్రతినిధిగా ముఖేశ్ శర్మ నియామకం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మీడియా కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్న ముఖేశ్ ఇకపై ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) అధికార ప్రతినిధిగా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శర్మను అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు డీపీసీసీ శనివారం ప్రకటించింది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శర్మ ఇదివరకు ఖాదీ గ్రామోద్యోగ్ బోర్డ్ చైర్మన్‌గా, షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్లమెంటరీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఇలా పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన శర్మ లోక్‌సభ ఎన్నికల సమయంలో డీపీసీసీ అధికార ప్రతినిధిగా కూడా తనదైన ముద్ర వేస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఆయన సహకారంతో తాము లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తామనే ధీమాను డీపీసీసీ అధ్యక్షడు అర్విందర్ సింగ్ లవ్లీ వ్యక్తం చేశారు. శర్మ అనుభవం, లవ్లీ యువభాగస్వామ్యం పార్టీకి కలిసి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేతలు చెప్పారు. -
టీచర్ల సమస్యలను పరిష్కరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ప్రారంభించిన ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించింది. తాత్కాలిక టీచర్లతో కలిసి కొన్ని రోజులగా ఢిల్లీ సెక్రటేరియట్ వద్ద చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తుంటే ఆమ్ ఆద్మీ సర్కార్‌గా చెప్పుకుంటున్న కేజ్రీవాల్ ప్రభుత్వం, ఆ పార్టీ కార్యకర్తలు టీచర్ల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం జంతర్‌మంతర్‌లో ఆందోళన నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో ఢిల్లీ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, కాంగ్రెస్ శాసనసభ పక్షనాయకుడు హరూన్ యూసుఫ్, మాజీ ఎమ్మెల్యే ముఖేశ్‌శర్మ, పార్టీ కార్యకర్తల తోపాటు స్థానికులు పాల్గొన్నారు. ఆప్ సర్కార్ ధోరణి మారకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు వెనకాడబోమని లవ్లీ ప్రకటించారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో ధర్నాకు తరలివచ్చారు. కేజ్రీవాల్ సర్కార్ తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెడుతోందని ఇక్కడ ప్రసంగించిన పలువురు నాయకులు విమర్శించారు. సామాన్యుడి సమస్యలు పట్టని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ ఎలా అవుతారంటూ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమను పావులా వాడుకున్నారని కేజ్రీవాల్‌పై ఆరోపణలు గుప్పించారు. రైల్‌భవన్ వద్ద ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాలో నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన ఉపాధ్యాయులతోనూ ఆప్ కార్యకర్తలు అసభ్యంగా వ్యవహరించారని ముఖేశ్‌శర్మ ఆరోపించారు. -
అప్రకటిత కోతలను ఉపేక్షించం
సాక్షి, న్యూఢిల్లీ: అప్రకటిత కోతలు విధించే విద్యుత్ సరఫరా కంపెనీలను నిలదీస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హెచ్చరించారు. గత నెలన్నర రోజులుగా కోతలకు సంబంధించిన డేటాను ఇవ్వాల్సిందిగా కంపెనీలను కోరామని, అప్రకటితంగా కోతలు విధించిన కంపెనీలు సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుందని గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెప్పారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్తు కోతలు పెరిగిపోయాయని, నగరంలో విద్యుత్తు సరఫరాను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనట్లయితే నగరమంతటా ఆందోళనలు నిర్వహిస్తామని ెహ చ్చరిస్తూ డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ రాసిన లేఖకు కేజ్రీవాల్ గురువారం విలేకరుల సమావేశంలో ప్రతిస్పందించారు. ఏయే ప్రాంతంలో ఎప్పటి నుంచి ఎప్పటివరకు విద్యుత్ కోత విధిస్తారో తెలిపే సమాచారాన్ని విద్యుత్తు కంపెనీలు వెబ్సైట్లో ఉంచాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం కాకుండా అప్రకటితంగా విధించే విద్యుత్తు కోతల గురించి ఫిర్యాదు చేయడం కోసం ఒక టెలిఫోన్ నంబర్‌ను జారీచేయనున్నట్లు ఆయన చెప్పారు. షెడ్యూలు ప్రకారం విధించే కోతలు కాకుండా, అప్రకటితంగా కోతలు విధించినట్లయితే కంపెనీలను సంజాయిషీ కోరతామన్నారు. వెబ్సైట్ డిస్కంలు ఆడిట్‌కు ఇష్టపడడం లేదని, అందువల్ల తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుచేయడం కోసం విద్యుత్ కంపెనీలు అడ్డగోలుగా కోతలు విధించవచ్చని తమకు ఇదివరకే కొందరు హెచ్చరించారని ఆయన చెప్పారు. విద్యుత్తు కంపెనీల అడ్డగోలు వ్యవహారాలను తాము ఉపేక్షించేదిలేదన్నారు. నీటి సరఫరా జరగని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ట్యాంకర్ డ్రైవర్ల ఫోన్‌నంబర్లను వెబ్సైట్లో ఉంచనున్నామన్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లును జనవరి ఆఖరు వరకు రూపొందించనున్నట్లు చెప్పారు. -
డీపీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన లవ్లీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) అధ్యక్షుడిగా మాజీమంత్రి, గాంధీనగర్ ఎమ్మెల్యే అర్విందర్‌సింగ్ లవ్లీ ఆదివారం బాధ్యతలను చేపట్టారు. ఇటీవల జరిగిన ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత డీపీసీసీ ఇన్చార్జి పదవికి జయప్రకాశ్ అగర్వాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. యువతకు పెద్ద పీట వేయడంతో నగర పరిధిలో పార్టీని గాడిలోపెట్టే బాధ్యతను షీలాదీక్షిత్ సన్నిహితుడైన అర్విందర్‌సింగ్ లవ్లీకి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అప్పగించాలని నిర్ణయించారు. దీంతో స్థానిక డీడీయూ మార్గ్‌లోని రాజీవ్ భవన్ డీపీసీసీ కార్యాలయంలో లవ్లీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌ద్వివేది, మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, కేంద్రమంత్రి కపిల్ సిబల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్‌మాకెన్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా పనిచేస్తా ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించిన అర్విందర్‌సింగ్ లవ్లీ అతి పిన్న వయస్సులోనే డీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వందలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి లవ్లీ ప్రసంగించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గౌరవం తగ్గకుండా పనిచేస్తానన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేదాకా ఉద్యమిస్తానన్నారు. దేశ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉందన్నారు. యువనేత, కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భావి ప్రధాని అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఢిల్లీ విధానసభలోపలా, వెలుపలా బాధ్యతాయుతంగా పనిచేస్తామన్నారు. ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామన్నారు. ముభావంగా షీలాదీక్షిత్ ఇటీవల జరిగిన ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఎంతో నిరాశగా కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో తప్పనిసరై పాల్గొంటున్నా మునుపటి ఉత్సాహం ఆమెలో కనిపించడం లేదని ఆదివారం డీపీసీసీ కార్యాలయంలో కార్యక్రమానికి వచ్చిన పలువురు కార్యకర్తలు చర్చించుకున్నారు. పదవి పోయినప్పటి నుంచి షీలాదీక్షిత్ మీడియా మందుకు సైతం అంతగా రావడం లేదనే అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. లవ్లీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో షీలా నిరాశగా కనిపించారు.